ఉక్కిరిబిక్కరవుతున్న హస్తిన వాసులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8, (way2newstv.in)
ఒకవైపు అంతులేని కాలుష్యం... మరోవైపు ఒక్కసారిగా మారిపోయే వాతావరణం... ఇలా ఎన్నో రకాల సమస్యలతో అల్లాడుతున్న దేశ రాజధాని అందరినీ భయపెడుతున్నది. తమ పరిస్థితి కూడా ఢిల్లీ మాదిరే మారుతుందేమోనన్న భయం దేశంలోని ప్రధాన నగరాలను వేధిస్తున్నది. ఢిల్లీలో వాయు, జల కాలుష్యాలు ఇప్పటికే ప్రమాదకర స్థాయిని దాటిపోయాయి. దీపావళి రోజున బాణా సంచాను కూడా కాల్చరాదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చిందంటే, పరిస్థితి తీవ్రతను ఊహించడం కష్టం కాదు. కాలుష్యానికి వాతావరణ పరిస్థితి కూడా తోడై ఢిల్లీ అంటేనే అనారోగ్యానికి కేంద్రమనే అభిప్రాయం బలపడుతున్నది. ఉదయం దట్టమైన మంచు, చలి.. మధ్యాహ్నం భరించలేంత ఎండ.. రాత్రి మళ్లీ చలి.. ఇలా వాతావరణం తరచు మారుతుండడంతో, రోగాలు కూడా అదే స్థాయిలో విజృంభిస్తున్నాయి.
చలి..ఎండ...చలి
స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతుండగా, ఇటీవల ఒకరు ఈ కారణంగానే మృతి చెందడం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా 124 స్వైన్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి. అంటే ఈ ఏడాది ఇప్పటి వరకూ ఈ వ్యాధికి గురైన వారి సంఖ్య 1,019కి చేరింది. గంటగంటకూ సంఖ్య పెరుగుతునే ఉందనేది వాస్తవం. 183 మంది చిన్నారులుసహా మొత్తం 895 మంది బాధితులకు చికిత్సను అందిస్తున్నారు. కాగా, స్వైన్ ఫ్లూతో ఒకరు మాత్రమే మృతి చెందారని అధికార వర్గాలు అంటుంటే, ఈ ఏడాది మొత్తం 13 మంది చనిపోయారని ఒక నివేదిక స్పష్టం చేస్తున్నది. సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో పది మంది మృతి చెందగా, మరో మూడు కేసులు ఆర్‌ఎంఎల్ హాస్పిటల్‌లో నమోదైనట్టు ఈ నివేదిక పేర్కొంది. కాలుష్యం, రోగకారకాలైన వైరస్ వ్యాపిస్తున్నప్పటికీ, విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకూ ప్రతి ఒక్కరూ ఉరుకులు, పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తమతమ పనుల మీద వెళుతున్నారు. ఇలావుంటే, స్వైన్ ఫ్లూ దేశంలోని పలు నగరాలను సైతం వేధిస్తున్నది. ఈ సమస్య రాజస్థాన్‌లో మరింత తీవ్రంగా ఉంది.స్వైన్ ఫ్లూ బారిన పడిన రాజస్థాన్‌లో ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ లేబొరేటరీలు చౌక ధరలకు స్వైన్ ఫ్లూ పరీక్షలను నిర్వహిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కారణంగా ఇప్పటికే 80 మందికి పైగా మృతి చెందారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సమిత్ శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు ఫ్లూ పరీక్ష రుసుమును రూ. 3,500 నుంచి రూ. 2,500కు తగ్గించడానికి అంగీకరించాయని ఆ ప్రకటన వివరించింది
No comments:
Post a Comment