Breaking News

11/08/2018

ఉత్తర తెలంగాణ కేటీఆర్... దక్షిణ తెలంగాణకు హరీష్

హైద్రాబాద్, ఆగస్టు 11 (way2newstv.in)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాల్లో దిట. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండానే కదన రంగంలో ప్రత్యర్థిని మట్టికరిపించే మైండ్ ఆయనది. ఇక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం కావాలన్నది కేసీఆర్ ఆలోచన. అందుకే ఇప్పటి నుంచే కొడుకు, అల్లుడిని రంగంలోకి దించారు. కేసీఆర్ కు నిజం చెప్పాలంటే ఓపిక తక్కువ. సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు అంటే ఆయన ఎక్కువగా ఇష్టపడరు. తప్పనిసరి అయితేనే హాజరవుతారు. ఇక జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు విపక్షాన్ని వీక్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఆయన కొడుకు కేటీఆర్ కు, అల్లుడు హరీశ్ రావుకు రెండు కీలక బాధ్యతలను అప్పగించినట్లు పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతుంది.ఉత్తర తెలంగాణను కేటీఆర్, దక్షిణ తెలంగాణను హరీశ్ చూసుకోవాలని గులాబీ బాస్ ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ మంచి ఫలితాలే సాధించింది. దక్షిణ తెలంగాణలో మాత్రం అనుకున్న సీట్లను సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ బాధ్యతను హరీశ్ పై పెట్టినట్లు గులాబీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. 



ఉత్తర తెలంగాణ కేటీఆర్... దక్షిణ తెలంగాణకు హరీష్

దీంతో వీరిద్దరు ఇటీవల కాలంలో వరుస పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ప్రతి జిల్లాలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వెళ్లి ఇటు పార్టీ ను సెట్ చేయడంతో పాటు కాంగ్రెస్ నేతలున్న నియోజకవర్గాలపై దృష్టి పెడుతున్నారు.ఇద్దరూ నిత్యం జనాల్లో ఉండాలని కేసీఆర్ ఆదేశంగా తెలుస్తోంది. వీరి పర్యటనలతో క్యాడర్ లో ఉత్సాహం రావడమే కాకుండా, అభివృద్ధి పనులను కూడా వేగం చేస్తున్నారు. బహిరంగ సభల్లో కాంగ్రెస్ ను ఇద్దరూ తూర్పారపడుతున్నారు. రోజూ ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉత్తర తెలంగాణలోనే కేటీఆర్ ఎక్కువగా పర్యటిస్తున్నారు. దీంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎటూ కేటీఆర్ కనుసన్నల్లోనే ఉంది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటిచేత్తో కేటీఆర్ 99 సీట్లు సాధించడంతో ఆయనకే నగర బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు.ఇక హరీశ్ రావు దక్షిణ తెలంగాణలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరీశ్ అక్కడే మకాం వేసి పనులు వేగవంతం అయ్యేలా చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాళేశ్వరం ప్రధాన అంశంగా మారనుంది. దీంతో పాటు దక్షిణ తెలంగాణాలో హరీశ్ పర్యటనలు ఎక్కువగా జరుపుతున్నారు. కీలకమైన కాంగ్రెస్ నేతలను కారెక్కించడానికి హరీశ్ మంతనాలు జరుపుతున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలను వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో హరీశ్ ఉన్నారు. అందుకే ఇటీవల రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ లో పర్యటించి వచ్చారు. కేవలం పర్యటనలతోనే సరిపెట్టకుండా జిల్లాలో పార్టీ పరిస్థితులు, ఎమ్మెల్యేల పనితీరుపై కూడా వీరు అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద గులాబీ బాస్ పక్కా వ్యూహం ప్రకారమే అల్లుడు,కొడుకును రంగంలోకి దించారన్న టాక్ విన్పిస్తోంది.

No comments:

Post a Comment