Breaking News

09/08/2018

యూనివర్శిటీల పనితీరు, పురోగతిపై నేను చాలా సంతృప్తిగా ఉన్నాను – గవర్నర్ పిహెచ్.డి అడ్మిషన్లలో గందరగోళం ఉండకుండా యుజీసీ నిబంధనలు పాటించాలి వీసీల సమావేశం అనంతరం మీడియాతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

హైదరాబాద్, ఆగస్టు 9 (way2newstv.in)
‘‘విశ్వవిద్యాలయాల అచీవ్ మెంట్స్ ఎలా ఉన్నాయి సార్?’’ యూనివర్శిటీల పనితీరుపై గవర్నర్ కు మీడియా సంధించిన ప్రశ్న....‘‘ గవర్నర్ చాలా హ్యాపీ. ఇంతకంటే ఇంకేం అచీవ్ మెంట్ కావాలి ’’ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహ్మన్ మీడియాకు  ఇచ్చిన సమాధానం.
విశ్వవిద్యాలయాల గత ఏడాది పనితీరుపై నేడు బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో 14 యూనివర్శిటీల వీసీలు, రిజిస్ట్రార్ లు, అధికారులతో సమావేశం జరిగింది.  గత ఏడాది అక్టోబర్ లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహ్మన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో చెప్పిన వివిధ అంశాలపై నేడు సమీక్ష చేశారు. రానున్న ఏడాదికి కార్యాచరణ ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు. విశ్వవిద్యాలయాలను పటిష్టం చేయడానికి దిశానిర్ధేశనం చేశారు.



యూనివర్శిటీల పనితీరు, పురోగతిపై నేను చాలా సంతృప్తిగా ఉన్నాను – గవర్నర్
పిహెచ్.డి అడ్మిషన్లలో గందరగోళం ఉండకుండా యుజీసీ నిబంధనలు పాటించాలి
వీసీల సమావేశం అనంతరం మీడియాతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

నేడు దేశంలో, రాష్ట్రంలో మహిళలు, బాలికలపై దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయి, తెలంగాణ విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహ్మన్ వీసీలకు సూచించారు. ఇలాంటి ఏ ఒక్క సంఘటన కూడా తెలంగాణలో జరగడానికి వీలు లేదన్నారు. విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు, పరీక్షలు, ఫలితాలు ఒకే విధానంలో జరిగేందుకు వీలుగా కామన్ క్యాలెండర్ అమలు చేయాలన్నారు. అదేవిధంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీలలో విద్యలో నాణ్యత పెంచేందుకు బయో మెట్రిక్ మిషన్లను కచ్చితంగా ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు అవసరమైన కొత్త కోర్సులను అధ్యయనం చేసి ఏర్పాటు చేయాలని, అవసరం లేని కోర్సులు తీసేయాలని చెప్పారు. ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులు, ఇతర విద్యార్థులతో గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేసేలా చర్యలు తీసుకోవాలని వీసీలకు సూచించారు. పిహెచ్.డి అడ్మిషన్లు, గైడ్ల కేటాయింపు, నిర్ణీత కాలంలో పిహెచ్.డి పూర్తి చేయడంపై కూడా ఒకే విధానాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని చెప్పారు.
ఉన్నత విద్యను పటిష్టం చేయడానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని, దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని గవర్నర్ నరసింహ్మన్ కొనియాడారు. స్వతహాగా ఆయన అధ్యాపకుడని, ఏవైనా కథలు చెబితే ఆయన వెంటనే పట్టేస్తారని అన్నారు. ఎప్పటికప్పుడు విద్యారంగంలో వస్తున్న మార్పులు, తీసుకుంటున్న చర్యలపై తనకు  చెబుతున్నారని తెలిపారు.
మొత్తంగా యూనివర్శిటీల పనితీరుపై సంతృప్తి ఉందని గవర్నర్ నరసింహ్మన్ తెలిపారు. గత ఏడాది కింద గవర్నర్ నరసింహ్మన్ అధ్యక్షతన జరిగిన సమావేశం నుంచి నేటి వరకు విశ్వవిద్యాలయాలలోని వివిధ కార్యక్రమాలు, అభివృద్ధిపై నేడు గవర్నర్ గారు పూర్తి స్థాయి సమీక్ష చేశారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ముఖ్యంగా గత ఏడాది అన్ని యూనివర్శిటీలు, అనుబంధ కాలేజీలు, గుర్తింపు పొందిన కాలేజీలలో బయో మెట్రిక్ మెషీన్లు పెట్టాలని నిర్ణయం తీసుకోగా...ఇంకా కొన్ని కాలేజీలలో వాటి ఏర్పాటు జరగలేదన్నారు. తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న క్యాంపస్, అనుబంధ, గుర్తింపు పొందిన కాలేజీలలో పూర్తి స్థాయిలో 3 నెలల వ్యవధిలో బయో మెట్రిక్ మెషీన్లు ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లోని సేవలు చాలా వేగంగా డిజిటలైజ్ చేయడం పట్ల గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారన్నారు. విశ్వవిద్యాలయాల్లో కామన్ క్యాలెండర్ అమలు చేయడంపై కూడా సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. కామన్ క్యాలెండర్ అమలుకు ముందు ఎవరికీ తోచినట్లు వారు అడ్మిషన్లు చేపట్టేవారని, గత ఏడాది నుంచి అన్ని కాలేజీలు ఒకే సమయంలో అడ్మిషన్లు, పరీక్షలు, ఫలితాలు ఇచ్చే విధంగా క్యాలెండర్ అమలు చేస్తున్నామన్నారు.
కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో మహిళలపై చిన్న దురదృష్టకర సంఘటన జరగకుండా అన్ని విశ్వవిద్యాలయాల వీసీలు చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మహిళా అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించినట్లు చెప్పారు.
పిహెచ్.డి అడ్మిషన్లలో గందరగోళం ఉందని, అన్ని యూనివర్శిటీలలో నెట్, స్లెట్, సెట్ పరీక్షలలో మెరిట్ సాధించిన వారికే యూజీసీ నిబంధనల మేరకు అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. అదేవిధంగా గైడ్స్ సమర్థత కూడా పరిగణనలోకి తీసుకోవాలని గవర్నర్ చెప్పారని తెలిపారు. ఇబ్బడిముబ్బడిగా పిహెచ్.డి అడ్మిషన్లు ఇవ్వవద్దని, పిహెచ్.డిలు కూడా మంచి సబ్జెక్టులపై చేసేలా శ్రద్ధ వహించాలని వీసీలకు గవర్నర్ సూచించారని ఉఫ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.
దేశంలో రెండో స్థానం, దక్షిత భారతదేశంలో మొదటి స్థానం సంపాదించిన వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని గవర్నర్ అభినందించినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. అదేవిధంగా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన తెలుగు మీడియం విద్యార్థులను మంచి ఇంజనీర్లు, ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్న బాసర ట్రిపుల్ ఐటినీ కూడా గవర్నర్ కొనియాడినట్లు ఉఫ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విశ్వవిద్యాలయాలు వాటికున్న ప్రత్యేకమైన రంగాల్లో సేవలను అవుట్ సోర్సింగ్ చేయడం వల్ల స్వయంవృద్ధి చెందాలని వీసీలకు సూచించినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వీసీల సమావేశం పెట్టి విశ్వవిద్యాలయాల ప్రగతిని సమీక్షిస్తారని, ఆరు నెలలపై యాక్షన్ రిపోర్టు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలని వీసీలను గవర్నర్ కోరినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.
ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి,  విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ ఇతర అధికారులు పాల్గొన్నారు

No comments:

Post a Comment