Breaking News

25/07/2018

టీడీపీలో టికెట్ల రగడ

కడప జూలై 25  (way2newstv.in): 
కడప జిల్లాలోని టీడీపీ నేతల్లో టికెట్ల రగడ మెల్లమెల్లగా రగులుకుంటోంది. రానున్న ఎన్నికల్లో తామే అభ్యర్థులమని ప్రచారం ముఖ్యనేతల్లో వినిపిస్తోంది. అంతా కలిసి పనిచేయాలని అధినేత చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తూనే సర్వే ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని టికెట్ల కేటాయింపులు జరుగుతాయని వెల్లడిస్తున్నారు. కానీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు మాత్రం ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తూ తమకే టికెట్లు అంటూ సొంత కేడరును ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. కాగా ప్రతి నియోజకవర్గంలో ‘ఎవరికి వారు’గా వ్యవహరిస్తూ సమన్వయంతో నడవడం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న ఎన్నికల్లో గెలుపు ఎలా అన్న చర్చ పార్టీలో నడుస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవాలని కొంత ప్రయత్నాలు చేస్తున్నా నేతల్లో సయోధ్య లేకపోవడంతో ఆ వివాదాలు వేదికగా మారుతున్నాయి.



టీడీపీలో టికెట్ల రగడ

2009 ఎన్నికల నాటి నుంచి జిల్లాలో టీడీపీ ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంటూ వస్తోంది. 2009లో ప్రొద్దుటూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన లింగారెడ్డి, 2014 ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసిన మేడా మల్లికార్జునరెడ్డి మాత్రమే గెలిచి ఏకైక ఎమ్మెల్యేలుగా నిలిచారు. రానున్న ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించాలని అధినేత చంద్రబాబు వ్యూహ ప్రతివ్యూహాలతో తమ్ముళ్లను హెచ్చరిస్తూనే వస్తున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో జరగని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జిల్లాలో నిర్వహించి ప్రజల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. అంతేకాదు పులివెందులకు కృష్ణా జలాలు, నేతలకు పదవుల పందేరం వంటివి చేపట్టి జిల్లా నేతలను అగ్రభాగంలో నిలిపారు. పలు సమీక్షలు, సమావేశాల్లో సీఎం చంద్రబాబు అంతా సమన్వయంతో నడిచి రానున్న ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపు సాధించాలని హెచ్చరిస్తూనే వస్తున్నారు. ఇటీవల జిల్లా సమన్వయ కమిటి సమావేశాలు నిర్వహించిన సీఎం చంద్రబాబు వన్‌ టు వన్‌గా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ఆ నియోజకవర్గాల ముఖ్య నేతలతో మాట్లాడారు.
టికెట్లపై గట్టి హామీ ఇవ్వకుండానే సర్వే సమీకరణలు ఇతర అంశాలు పరిగణనలోకి తీసుకుని గెలుపు గుర్రాలకే టికెట్లు అంటూ వెల్లడించారు. అందరూ కలిసి కట్టుగా సమన్వయంగా పనిచేస్తే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని, దీంతో ప్రతిపక్ష నేత జగన్‌కు చెక్‌ పెట్టినట్లు అవుతుందని టీడీపీ అధిష్టానం జిల్లా నేతలను కోరుతూ వచ్చింది. కొన్ని నియోజకవర్గాల నేతలు సీఎంతో సమావేశమైన తరువాత కొంత కలిసి పనిచేసినట్లుగానే కనిపిస్తున్నా లోలోపల నివురుగప్పిన నిప్పులా ఆ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఒకరికి టికెట్‌ ఇస్తే మరొకరు సహకరిస్తారా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఉన్న కేడరు, నేతలు సమన్వయంతో పనిచేస్తే ఏడు అసెంబ్లీ స్థానాల్లో గెలుపు సాధిస్తామని జిల్లా నేతలు పేర్కొంటున్నారు. కానీ పరిస్థితులు మాత్రం నియోజకవర్గాలకు భిన్నంగా కనిపిస్తున్నాయి. లోలోపల నేతల మధ్య వర్గ పోరు టికెట్ల కేటాయింపుతో మరోసారి రగడ రగులుతుందని పార్టీ నేతలే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
జిల్లాలోని టీడీపీ నేతల మధ్య వర్గపోరు అంతర్గతంగా జోరుగానే ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఉన్న కీలక నేతలు ఒకరంటే మరొకరు భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలో మొదటి నుంచి రామసుబ్బారెడ్డి టీడీపీలోనే కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో కూడా రామసుబ్బారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి కట్టబెట్టడంపై రామసుబ్బారెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అందుకనే అధినేత రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి శాంతింపజేసినా ఆ ఇద్దరు నేతల మధ్య మాటలు కూడా లేవు. తిరిగి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఆదినారాయణరెడ్డి పోటీ చేయాలని భావిస్తుండగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తమ కుటుంబం ఎన్నికల్లో పోటీ వస్తుందని రామసుబ్బారెడ్డి అంతర్గత చర్చలతో పాటు ముఖ్య నేతల ముందు చెబుతున్నట్లు సమాచారం. తాము కలిసి పనిచేసినా గ్రామ స్థాయిలో కేడరు కలవదని వారు తెగేసి చెబుతున్నారు. మైదుకూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఈసారి కూడా పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నారు. తన సామాజికవర్గానికి పెద్దపీట వేస్తున్నారని పుట్టా సుధాకర్‌యాదవ్‌పై పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు.
నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం బలమైంది కావడంతో ఇతర పార్టీల్లోని నేతను ఆహ్వానించి ఈసారి టికెట్‌ ఇస్తారని ప్రచారం సాగుతోంది. అందుకనే పుట్టాకు టీటీడీ చైర్మన్‌ పదవి ఇచ్చారని ఆ నియోజకవర్గ నేతలు వెల్లడిస్తున్నారు. ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 2009లో ఎమ్మెల్యేగా నిలిచిన లింగారెడ్డిని కాదని 2014లో వరదరాజులరెడ్డికి టికెట్‌ ఇచ్చినా ఓడిపోయారు. ఆ తరువాత సివిల్‌ సప్లై ఛైర్మన్‌ పదవిని లింగారెడ్డికి కట్టబెట్టి కొంతశాంతిపజేశారు. ఈ నియోజకవర్గంలో వరదరాజులరెడ్డి, లింగారెడ్డిల మధ్య టికెట్ల కోసం పోటీ పడుతూ ఈసారి తమకే ఛాన్స్‌ లభిస్తుందని ఇరువురు నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బద్వేలు నియోజకవర్గం ఎస్సీలకు కేటాయించినా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ హోదాలో పూర్తి పెత్తనం విజయమ్మకే అప్పగించారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన విజయజ్యోతి, వైసీపీ నుంచి వచ్చిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే జయరాములు మరోసారి టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ విజయమ్మ కీలకంగా మారడంతో ఆమె సూచనలనే అధిష్టానం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
పులివెందుల నియోజకవర్గంలో మాజీ మండలి డిప్యూటీ చైర్మన్‌ సతీష్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ బీటెక్‌ రవిలు కీలకంగా వ్యవహరిస్తున్నా రాంగోపాల్‌రెడ్డి కూడా టికెట్‌ రేసులో ఉన్నానంటూ ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుల గొడవ సతీష్ రెడ్డి, రాంగోపాల్‌రెడ్డిల మధ్య నెలకొని పోరాటానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాయచోటి నియోజకవర్గంలో మాజీ ఎంపీ పాలకొండ్రాయుడు తనయుడు ప్రసాద్‌బాబు, ప్రస్తుత ఇన్‌ఛార్జ్‌, మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డిలు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరి మధ్య కూడా సయోధ్య అంతంత మాత్రమే ఉంది.
కడప నియోజకవర్గంలో హరిప్రసాద్‌, దుర్గాప్రసాద్‌లు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తుండగా అమీర్‌బాబు, గోవర్ధన్‌రెడ్డిలు కూడా కీలకంగానే వ్యవహరిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో నేతల సంఖ్య ఎక్కువ కావడంతో ఇప్పటి వరకు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ ఎవరన్నది తేల్చలేదు. రైల్వేకోడూరు ఎస్సీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు, ఇన్‌ఛార్జ్‌ కస్తూరివిశ్వనాథనాయుడులు కీలకంగానే ఉన్నా ఇద్దరి మధ్య వర్గ పోరు నడిచింది. అధినేత చంద్రబాబు మందలింపుతో కొంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నా ఇద్దరి మధ్య సఖ్యత అన్నది లేదు. ఈ ఇద్దరు నేతలు పోటీ చేసే అవకాశం లేకపోయినా ఇద్దరు కలిసి అభ్యర్థిని సూచిస్తే వారికే టికెట్‌ అంటూ చంద్రబాబు తేల్చి చెప్పారు.
రాజంపేట నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఏకైక నాయకుడిగా చలామణి అవుతున్నారు. ఇతర నేతలెవరూ ఆయనకు పోటీ లేకపోవడంతో మేడా ఒక్కరే అన్నట్లుగా నియోజకవర్గంలో వ్యవహారాలు నడుస్తున్నాయి. మేడా పార్టీ మారుతారని ప్రచారం జోరుగా ఉన్నా ఆయన మాత్రం పార్టీ మారేది లేదని సన్నిహితులకు తేల్చి చెబుతున్నారు. ఒకవేళ పార్టీ మారితే అభ్యర్థి ఎవరన్నది కూడా ఆలోచన సాగుతోంది. ఇలా పది నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు ఎవరికి వారుగా వ్యవహరిస్తూ వర్గ పోరుకు ఆజ్యం పోస్తుండడంతో దీని ప్రభావం రానున్న ఎన్నికల్లో చూపుతుందని కేడరు ఆందోళన వ్యక్తం చేస్తున్నది.

No comments:

Post a Comment