Breaking News

20/08/2019

మరో చారిత్రాత్మక నిర్ణయానికి సిద్ధమౌతున్న మోడీ

న్యూఢిల్లీ, ఆగస్టు 20, (way2newstv.in)
నిర్ణయాల్లో వేగం…సంస్కరణల విషయంలో రిస్కుతో కూడిన సాహసం. ప్రతిపక్షాలను నామమాత్రం చేయడం.. ప్రాంతీయపార్టీలను బెంబేలెత్తించడం..దేశం మొత్తాన్ని ఒకేతాటిపైకి తీసుకురావడం..ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు భారత్ మాటకు ఎదురుచెప్పలేని పరిస్థితి కల్పించడం వంటివన్నీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకదానివెంట ఒకటిగా జరిగిపోతున్నాయి. ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థ దెబ్బతినిపోతున్నాయని ఎందరెందరో విమర్శిస్తున్నారు. కానీ ప్రధాని నరేంద్రమోడీ శక్తిమంతుల్లో కెల్లా మరింత శక్తిమంతుడిగా మారిపోతున్నారు. ఇప్పటికే ఇందిర తర్వాత అంతటి పవర్ పుల్ ప్రైమ్ మినిస్టర్ గా పేరు తెచ్చుకున్నారు. కశ్మీర్ వంటి విషయాల్లో ఇందిర సైతం చేయని సాహసం ఆయనను నంబర్ ఒన్ ప్లేస్ లో కూర్చోబెట్టేసిందనేవారూ ఉన్నారు. ఐక్యరాజ్యసమితి కూడా కశ్మీర్ తమ పరిధిలోది కాదన్నట్లుగా తేల్చేయడంతో మరిన్ని ముందడుగులు అడుగులు పడబోతున్నాయనే సంకేతాలు అందుతున్నాయి. 
 మరో చారిత్రాత్మక నిర్ణయానికి సిద్ధమౌతున్న మోడీ

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అధ్యక్షతరహా లక్షణాలను సంతరించుకుంటోంది. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యానికి, అధ్యక్షతరహా పాలనకు చాలా తేడా ఉంటుంది. పోల్చి చూస్తే పార్లమెంటరీ డెమొక్రసీ చాలా బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో కూడి ఉంటుందని పేరు. ఇక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎక్కువగా ఉండటం దీనికి కారణం. నేరుగా ప్రజాప్రతినిధులతో కూడిన పార్లమెంటు ప్రభుత్వాన్ని, ప్రధానిని నిరంతరం అదుపులో ఉంచుతుంది. అమెరికా వంటి దేశంలో చాలా నిర్ణయాలు ప్రెసిడెంట్ ఇష్టాయిష్టాలపై ఆధారపడి జరిగిపోతూ ఉంటాయి. కాంగ్రెసు, సెనేట్ వంటి వ్యవస్థలు ఉన్నప్పటికీ ప్రెసిడెంట్ అత్యంత పవర్ పుల్ . దేశానికి సూపర్ పీఎంగా అవతరించిన మోడీ కాతాలో ఇంకా ఏమేం నిర్ణయాలు మిగిలి ఉన్నాయనేదే ఇప్పుడు చర్చ.నోట్ల రద్దు, జీఎస్టీ వంటి విషయాల్లో మోడీ కనబరిచిన చురుకుదనం పాలనపరమైన వేగానికి నిదర్శనం. ట్రిపుల్ తలాక్ వంటి నిర్ణయం పార్టీ పరమైన సిద్దాంతానికి ఉమ్మడి పౌరస్మ్రుతి దిశలో తీసుకున్న తొలి అడుగు. ఎక్కడైతే తీవ్ర వ్యతిరేకత వస్తుందో అక్కడే అదే వర్గంలో మెజార్టీని విభజించడం రాజకీయంగా బలమైన ఎత్తుగడ. డెబ్భై ఏళ్లుగా నలుగుతున్న కశ్మీర్ విషయాన్ని ఒక్కరోజులో తేల్చి పడేశారు. త్రివిధ దళాలను సమన్వయం చేస్తూ నేత్రుత్వం వహించే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం అనేది మరో కీలక నిర్ణయంగానే చెప్పాలి. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రక్షణ వ్యవస్థగా ఉన్న భారతదేశం యుద్ధ సన్నద్ధత విషయంలో మాత్రం ఎక్కడో ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ల నుంచి అదే సమస్య. 1962లో చైనాతో యుద్దంలో వైమానిక దళం పాత్ర కనిపించదు. 1965లో పాకిస్తాన్ యుద్ధంలో త్రివిధ దళాలు త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్లాలనుకున్నా నావికా విభాగానికి సకాలంలో సమాచారం లేదు. 1971 యుద్ధంలో మాత్రమే జనరల్ మానిక్ షా పుణ్యమా అని పెద్ద విజయం నమోదైంది. వైమానిక ,నావికాదళాధిపతులతో తనకున్న వ్యక్తిగత సత్సంబంధాలతో మానిక్ షా భారత్ కు అపూర్వ విజయాన్ని సాధించి పెట్టాడు. 20 ఏళ్ల క్రితం నాటి కార్గిల్ యుద్దంలోనూ పదాతిదళం పాట్లు పడుతుంటే వైమానిక దళం చివరి వరకూ రంగంలోకే దిగలేదు. ఇటువంటి అనేక ఘట్టాల్లో భారత వైఫల్యాలకు ప్రధాన కారణం త్రివిధ దళాలను సింగిల్ కమాండ్ తో నడిపే చీఫ్ లేకపోవడమే. ఆ కొరతను తీర్చేందుకు ప్రధాని మోడీ పూనుకోవడం యుద్ద సన్నద్ధత విషయంలో భారత్ వేస్తున్న కీలకమైన అడుగు. నేరుగా పీఎం నుంచే సైనిక దళాల చీఫ్ కు ఆదేశాలందుతాయి. ప్రధాని స్థానాన్ని మరింత శక్తిమంతం చేసే చర్యే ఇది.మోడీ దూకుడుకు విపక్షాలు నిజంగానే బెదిరిపోతున్నాయి. సంకీర్ణ రాజకీయాల శకం మొదలైన తర్వాత ప్రాంతీయ పార్టీలు అయినదానికీ, కానిదానికీ బెదిరిస్తూ తమ అధినేతల స్వార్థ ప్రయోజనాలకు జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టడం సాగుతోంది. బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతం, అవినీతి, కుటుంబపాలన బలంగా వేళ్లూనుకు పోయాయి. రీజనల్ సాత్రప్స్ గా పేరొందిన ప్రాంతీయ అధినేతలు ఆడింది ఆట పాడింది పాటగా చెలామణి అయ్యింది. మోడీ వచ్చిన తర్వాత తొలిపాలన కాలంలోనే సామదానభేదోపాయాలతో ప్రాంతీయాధినేతలకు కళ్లెం వేసేశారు. రెండోసారి అధికారం తర్వాత ప్రాంతీయ పార్టీలన్నీ ఒకింత ఆందోళనలోనే పడ్డాయి. తమ సిద్దాంతాలకు విరుద్దంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు సైతం ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రాంతీయ పార్టీలు పార్లమెంటులో సహకరిస్తున్నాయి. స్వచ్చందంగానే సహకరిస్తున్నాయనుకోలేం. కేంద్రం దూకుడుని చూసిన తర్వాత తమ అస్తిత్వాలకు ఎక్కడ భంగం వాటిల్లుతోందనే భయమే వాటిని ఒప్పిస్తోంది. సమాఖ్య స్ఫూర్తికి ఇది విఘాతమే. కానీ భాష, ప్రాంతం, కులం, కుటుంబం చుట్టూ రాజకీయాలు పెనవేసుకుపోవడంతో రాష్ట్రాల్లో పరిపాలన గాడి తప్పుతోంది. దీర్ఘకాలిక ఆలోచనలు, అభివ్రుద్ది పై నేతలకు ద్రుష్టి తగ్గిపోతోంది. ఈ పరిస్థితులకు ప్రత్యామ్నాయంగా బీజేపీని చూస్తున్న కారణంగానే దేశంలో మోడీ బలోపేతమవుతున్నారు.పద్దతి ప్రకారం అన్నిటినీ చేయాలనుకోరు మన ప్రధాని మోడీ . రూల్స్ ను బుల్ డోజ్ చేసేయడంలో దిట్ట. నా దారి రహదారి అంటూ దూసుకుపోవడమే ఆయనకు తెలిసిన విద్య. భారతీయ జనతాపార్టీకి పెద్ద దిక్కులైన అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటివారిని పక్కనపెట్టేయడమే ఇందుకు నిదర్శనం. ప్రధాని పదవికి అన్ని అర్హతలూ ఉండి కూడా అవకాశం దక్కించుకోలేకపోయిన అద్వానీకి కనీసం రాష్ట్రపతి పదవి అయినా దక్కుతుందనుకున్నారు. కానీ మోడీ ఆలోచనలే వేరు. తనకు మార్గదర్శకం చేసి, ముఖ్యమంత్రిత్వాన్ని కాపాడిన అద్వానీనే దూరం పెట్టేశారు. ఇండియా భవిష్యత్ ప్రస్థానంపై తనకున్న విజన్, మిషన్ విషయంలో అద్వానీ వంటి పెద్దలు అడ్డుతగులుతారేమోననే సందేహం. సంకోచం. అద్వానీ రాష్ట్రపతిగా ఉంటే తన మిషన్ కు ఎక్కడైనా బ్రేక్ పడుతుందేమోననే ముందుచూపే ఆయనను దూరం పెట్టడానికి కారణం. అణ్వస్త్రాల విషయంలో తొలిసారి ఉపయోగించమని మనకు మనం నిషేధం విధించుకున్నాం. తొలి అణ్వస్త్ర పరీక్షలు చేసిన 1974 నుంచి దీనిని తూచ తప్పకుండా పాటిస్తున్నాం. ఈ విషయంలోనూ తామేం కట్టుబడి ఉండమని భారత ప్రభుత్వం తాజాగా తేల్చేస్తోంది. అంటే ఇంకా పెద్ద కార్యమేదో మోడీ అంబుల పొదిలో ఎదురుచూస్తున్నట్లే.

No comments:

Post a Comment