Breaking News

13/05/2019

సైబారాబాద్ లో తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్య

హైద్రాబాద్, మే 13, (way2newstv.in)
జంటనగరాల్లోనూ, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లో రోడ్లపై అత్యంత ట్రాఫిక్‌ జామ్‌ల గురించి చర్చిస్తే ప్రధానంగా గుర్తొచ్చేది సైబరాబాద్‌ ఐటీ కారిడార్‌. ఈ మూడు కమిషనరేట్ల పరిధిల్లో అత్యధికంగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతుందంటే సైబరాబాద్‌ కమిషనరేట్‌ అనే చెప్పాల్సి వస్తోంది. ఎందుకంటే సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో అనేక సంఖ్యలో ఐటీ కారిడార్లు, షాపింగ్‌ మాల్స్‌, నివాసాలు, టూరిజం స్థలాలు, పెరిగిపోవడంతో నిత్యం లక్షలాది మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులతో పాటు కాలనీలు, గ్రామాలకు చెందిన సామాన్య ప్రజానీకం రాకపోకలు సాగిస్తున్న దృష్ట్యా ఇక్కడ రహదారులు రద్దీ సమయాల్లో కిటకిటలాడుతుంటాయి. రవాణా సదుపాయాలు మెరుగ్గా లేకపోవడంతో ఐటీ ఉద్యోగులు, సామాన్య మానవుడికి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం ఈ కారిడార్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచే చర్యలను సైబరాబాద్‌ కమిషనరేట్‌ చేపట్టింది.సైబరాబాద్‌ ఐటీ కారిడార్‌ ప్రాంతంలో రద్దీ వేళల్లో తరుచూ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడటం గంటల కొద్ది వాహనాలు ఎక్కడవి అక్కడే నిలబడి పోవడంపై రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


సైబారాబాద్ లో తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్య

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో అన్ని ఐటీ కంపెనీల్లో పనిగంటలు ఒకే సమయంలో ప్రారంభం కావటం ఒక కారణమైతే మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కొత్తగూడ, మిర్‌దొడ్డి, గౌలిదొడ్డి తదితర ప్రాంతాల్లో కొత్త కొత్త కాలనీలు వెలుస్తుండటం ఇంకో కారణంతో గంటల కొద్ది ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతుంది. ఈ సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలపై ఇటీవల సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఆర్‌డీసీఎల్‌ (హైదరాబాద్‌ రోడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌), జలమండలి, టీఎస్‌ఐఐసీ తదితర శాఖల అధికారుల దిద్దుబాటు చర్యలపై అధ్యయనం ప్రారంభించారు.రద్దీ వేళల్లో ప్రయాణికులకు ఎదురయ్యే రవాణా ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 10గంటల మధ్య ఈ ప్రాంతంలోని దాదాపు అన్ని రహదారులు వాహనాలతో కిటకిటలాడుతుంటాయి. ఆ సమయాల్లోనే అత్యధిక శాతం ఐటీ ఉద్యోగులు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. రవాణా పరిభాషలో చెప్పాలంటే వాహనాలు బంపర్‌ టు బంపర్‌ వెళ్లాలి. సొంత వాహనాలపై వెళ్లే వారి పరిస్థితి ఇలా ఉంటే ప్రజా, ప్రయివేటు రవాణా పరిస్థితులు సైతం ఏమంత బాగా లేవు. ఐటీ ఉద్యోగుల రాకపోకలకు అనువుగా బస్సు ట్రిప్పుల సంఖ్య లేదనేది బహిరంగ రహస్యం. లక్షల్లో ప్రయాణికులను తరలించేందుకు కేవలం వందల సంఖ్యలో బస్సులు ఏ మూలకూ సరిపోవడం లేదు. ప్రస్తుతం హైటెక్‌ సిటీకి మెట్రో రైలు సదుపాయం అందుబాటులోకి వచ్చినా కొన్ని ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యోగులకు అనువుగా లేదు. నాగోల్‌- ఉప్పల్‌- తార్నాక- సికింద్రాబాద్‌- బేగంపేట- పంజాగుట్ట- అమీర్‌పేట మార్గాల ద్వారా యూసుఫ్‌గూడ- జూబ్లీహిల్స్‌ మీదుగా హైటెక్‌ సిటీకి రాకపోకలు సాగించే ఉద్యోగులకే ప్రస్తుతం మెట్రో రైలు సదుపాయం అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో కిక్కిరిసి ప్రయాణించాల్సి రావడం ఉద్యోగులకు ఇబ్బందికరంగా పరిణమిస్తుండగా.. ఐటీ కారిడార్‌లోని ప్రధాన కూడళ్లలో ఆటోలు అడ్డదిడ్డంగా నిలుపుతుండటంతో ట్రాఫి చిక్కులు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రజారవాణాను మెరుగుపర్చడంపై యంత్రాంగం దృష్టి సారించింది. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ ఎస్‌ఎం విజరుకుమార్‌, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌(ఎస్‌సీఎస్‌సీ) కార్యదర్శి ఆర్టీసీ అధికారులు, ట్రాఫిక్‌ వలంటీర్లు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు కీలక మార్గాల్లో ఆర్టీసీ బస్సు ట్రిప్పుల సంఖ్యను పెంచాల్సిన అవసరంపై చర్చించారు. ఇందుకు ఆర్టీసీ అధికారులు సానుకూలంగా స్పందించారు. 

No comments:

Post a Comment