విజయవాడ, మార్చి 11, (way2newstv.in)
లంగాణ విద్యుత్ సంస్థలు తమకు చెల్లించాల్సిన మొత్తం రూ.5 వేల కోట్లు కాదని.. దరిదాపుగా 11,728 కోట్లు చెల్లించాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ ఇంధన పంపిణీ సంస్థలు వెల్లడించాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఆంధ్ర నుంచి.. ఆంధ్ర విద్యుత్ సంస్థలకు తెలంగాణ నుంచి కరెంటు సరఫరా అయింది. ఆంధ్రప్రదేశ్ ఎక్కువ మొత్తంలో సరఫరా చేసింది. అందుకుగాను బ్యాలెన్సు చెల్లించాలని డిమాండ్ నోటీసులు పంపుతూ వచ్చింది. విద్యుత్ సరఫరాలో ఏ మాత్రం జాప్యం జరిగినా హుంకరించిన తెలంగాణ.. బకాయిలు చెల్లింపులో మాత్రం ధిక్కార ధోరణిని ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ బకాయిలు కొండలా పేరుకు పోయి.. చివరకు పోలవరం జల విద్యుత్కేంద్రం అంచనా వ్యయాన్ని దాటేసి రూ.5000 కోట్లకు చేరాయి. ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా బకాయిల చెల్లింపునకు తెలంగాణ ముందుకు రాకపోవడంతో.. ఆ రాష్ట్ర విద్యుత్ సంస్థలు దివాలా తీసినట్లుగా ప్రకటించాలని ఆంధ్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఏకంగా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ని ఆశ్రయించాయి.
తెలుగు రాష్ట్రాల మధ్య కరెంట్ జగడం
ఇలాంటి తరుణంలో ఆంధ్ర ప్రదేశ్ తమకే రూ.2,406 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలంగాణ ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు హైదరాబాద్‌లో పేర్కొన్న నేపథ్యంలో ఆంధ్ర సంస్థలు ఆయనకు దీటుగా బదులిచ్చాయి. ఆయన మీడియా సమావేశంలో వెల్లడించినదంతా నిరాధారం, అవాస్తవమని ఆంధ్ర జెన్‌కో ఆర్థిక సలహాదారు, అక్కౌంట్స్ చీఫ్ కంట్రోలర్ ఆదినారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ సంస్థల ఖాతా పుస్తకాల ప్రకారమే ఆంధ్రకు రూ.11,728 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. అందులో నుంచి తామివ్వాల్సిన బకాయిలను మినహాయించినా ఇంకా రూ.8,274.23 కోట్లు తమకే బకాయిపడ్డాయని తెలిపారు. తెలంగాణ డిస్కమ్‌లకు సరఫరా చేసిన విద్యుత్‌కు గాను అన్ని సర్దుబాట్లూ పోగా నికరంగా రూ.5,732.40 కోట్లు బకాయి రావలసి ఉందని చెప్పారు. రాజ్యసభ, లోక్‌సభల్లో ప్రశ్నలు లేవనెత్తినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆంధ్రకు తెలంగాణ విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందని స్పష్టం చేసిన సంగతిని ఆదినారాయణ గుర్తుచేశారు. బకాయిలపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మధ్య ఎప్పటికప్పుడు భేటీలు జరుగుతూనే ఉన్నాయని.. ఆంధ్రకు బకాయిలు చెల్లించాలని ఆ సందర్భంగా అంగీకరించి.. తక్షణమే రూ.150 కోట్లు చెల్లించేందుకు సరేనని.. ఇప్పుడు ఆంధ్ర సంస్థలే తమకు బకాయి పడినట్లు ప్రభాకరరావు చెప్పడంపై ఆదినారాయణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో గత్యంతరం లేకనే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ)ను తాము ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు. తెలంగాణ విద్యుత్ సంస్థలు నిజంగా తమకు బకాయిపడకపోతే అవి ఎన్‌సీఎల్‌టీని కాకుండా ఈఆర్‌సీని ఎందుకు ఆశ్రయించాయని నిలదీశారు. కాగా.. దివాలా కేసు ఈ నెల 20వ తేదీన ఎన్‌సీఎల్‌టీలో విచారణకు రానుందని.. బకాయిల చెల్లింపునకు ఆ సందర్భంగా పట్టుబడతామని ఆంధ్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఓ ప్రకటనలో తెలిపారు
No comments:
Post a Comment