Breaking News

11/01/2020

శివకుమార్ కు కలిసి రాని కాలం

బెంగళూర్, జనవరి 11 (way2newstv.in)
కర్ణాటక కాంగ్రెస్ పదవుల భర్తీ విషయంలో ఆచితూచి అడుగులేస్తుంది. కీలకనేతలిద్దరూ రాజీనామా చేసి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇంకా పదవులను భర్తీ చేయలేదు. దీనికి కారణం ఈ నియామకాలతో కాంగ్రెస్ పార్టీకి మరిన్ని కష్టాలు తలెత్తే అవకాశాలున్నాయన్న నివేదికలు రావడం వల్లనే కాంగ్రెస్ అధిష్టానం నియామకాల విషయంలో వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ లో ముఖ్య పదవులను పూర్తి చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశముంది.కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా ఉన్న దినేష్ గుండూరావు, శాసనసభ పక్ష నేతగా ఉన్న సిద్ధరామయ్యలు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ వీరిద్దరూ రాజీనామా చేశారు. అయితే దినేష్ గుండూరావు రాజీనామాను అధిష్టానం ఆమోదించింది. 
శివకుమార్ కు కలిసి రాని కాలం

సీఎల్పీ నేతగా సిద్ధరామయ్య ఇచ్చిన రాజీనామాను మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ హోల్డ్ లో పెట్టింది.అయితే పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ ను నియమిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయనకు కొందరు మోకాలడ్డినట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్ పై ఉన్న ఈడీ కేసులతో పాటు ఆయనను నియమిస్తే మరిన్ని గ్రూపులు తయారయ్యే అవకాశాలున్నట్లు నివేదికలు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు అందాయి. అందుకే డీకే శివకుమార్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.కానీ డీకే శివకుమార్ ఈ ప్రతిపాదన పట్ల విముఖత చూపుతున్నారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవి మాత్రమే కావాలని ఆయన పట్టుబడుతున్నారు. అందరినీ కలుపుకుని పోయే నేతనే పీసీసీ అధ్యక్ష పదవికి నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచన. దీనిపై మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచనలను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నిన్న టివరకూ పీసీసీ ప్రెసిడెంట్ రేసులో ముందున్న డీకే శివకుమార్ ను కొందరు కావాలనే పనిగట్టుకుని మరీ వెనక్కు నెట్టినట్లు తెలుస్తోంది. దీని వెనక సిద్ధరామయ్య వర్గం ఉన్నట్లు అనుమానం డీకే వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ పీఠం దక్కకుంటే డీకే మనస్ఫూర్తిగా పార్టీకి పనిచేస్తారా? అన్న అనుమానమూ తలెత్తుతోంది.

No comments:

Post a Comment