Breaking News

09/01/2020

రెండేళ్ల నుంచి విడుదల కాని కళ్యాణ లక్ష్మీ నిధులు

వరంగల్, జనవరి 9, (way2newstv.in)
కళ్యాణలక్ష్మి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మానస పుత్రికగా ప్రకటించుకున్నారు. కళ్యాణలక్ష్మి, పథకం కింద ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం రెండేండ్లుగా నిలిచిపోయింది. వివాహానికి వారం రోజుల ముందే వధువు ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా అది ఆచరణకు నోచుకోవడం లేదు. 2018-2019 సంవత్సరంలో 14,9,514 మంది యువతులు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1940 దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు తిరస్కరించారు. వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో కేవలం 39,655 దరఖాస్తులను మాత్రమే ఆమోదించారు. మిగతా దరఖాస్తులన్ని ఇప్పటికీ పరిశీలన దశలోనే ఉంచినట్టు సమాచారం. ఆమోదించిన దరఖాస్తులకు సైతం ఆర్థిక సహాయాన్ని అందించకపోవడం గమనార్హం. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు సుమారు రూ. 512. 98 కోట్లు చెల్లించాల్సి ఉంది.
రెండేళ్ల నుంచి విడుదల కాని కళ్యాణ లక్ష్మీ నిధులు

ప్రభుత్వ పథకాల్లో ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైనదని ఆయన అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. సీఎం చెప్పినట్టే ప్రతి ఎన్నికల్లోనూ ఈ పథకం టీఆర్‌ఎస్‌కు లబ్ది చేకూర్చింది. టీఆర్‌ఎస్‌ సర్కారు దాదాపు ఐదేండ్ల పాటు ప్రజలతో అవసరం లేదనుకున్నారో..ఏమో ప్రభుత్వ పెద్దలు కళ్యాణలక్ష్మిపై శీత కన్నేశారు. నిధుల్విక పోవడంతో ఇప్పుడాపథకం పడకేసింది. కళ్యాణలక్ష్మినే ఆసరాగా చేసుకుని వివాహం చేసుకున్న యువతులను కన్నీరు పెట్టిస్తున్నారు.కళ్యాణలక్ష్మి పథకాన్ని 2014 అక్టోబర్‌లో ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రారంభంలో ఈ పథకం కింద రూ. 51వేలు చెల్లించేందుకు గాను రూ.1450 కోట్లు కేటాయించింది. అసెంబ్లీ ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మహిళల ఓట్లు రాబట్టేందుకు 2018 మార్చిలో ఈ కళ్యాణలక్ష్మి ఆర్థిక సహాయాన్ని రూ. 1,00,116 కు పెంచింది. దీనికి అనుగుణంగా బడ్జెట్‌లో నిధులు మాత్రం అధికం చేయలేదు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటానికి ఇదొక ప్రధాన కారణంకాగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడంతో కళ్యాణలక్ష్మి పథకానికి కష్టాలు మొదలయ్యాయి. అడపా దడపా నిధులు విడుదల చేస్తున్నా ఆర్థిక శాఖ మాత్రం వాటిని ఫ్రీజింగ్‌లో పెట్టడం వల్ల నిధులు విడుదల కావడం లేదని సంక్షేమ శాఖ అధికారులు అంటున్నారు.కళ్యాణక్ష్మి వస్తుందనే ఆశతో అప్పులు చేసి వివాహాలు చేసుకున్నామనీ, కానీ రెండేండ్లు గడుస్తున్నా నేటికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందలేదని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివాహాల కోసం చేసిన అప్పులకు తమ తల్లిదండ్రులు వడ్డీలు చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన చెందుతున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదనే సమాధానం మాత్రమే వస్తున్నదని పలువురు లబ్దిదారులు తెలిపారు.

No comments:

Post a Comment