Breaking News

07/01/2020

శరద్ పవార్ పార్టీకే పెద్ద పీట

ముంబై, జనవరి 7  (way2newstv.in)
మహారాష్ట్రలో సంకీర్ణ సర్కార్ ఏర్పాటయిన తర్వాత ఉద్ధవ్ థాక్రే కాంగ్రెస్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే అదే సమయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కాదని ఏమీ చేయడం లేదు. సంకీర్ణ ధర్మం కావచ్చు… లేకుంటే పవార్ ను కాదని మహారాష్ట్ర సర్కార్ లో తాను ఏ నిర్ణయం తీసుకోలేనని కావచ్చు. శరద్ పవార్ కు చెప్పనిదే ఏ నిర్ణయమూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తీసుకోవడం లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది.కి శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి కావడానికి శరద్ పవార్ ప్రధాన కారణం. శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయినప్పుడు ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపుతారామోనన్న ఆందోళన శివసేనలో కన్పించింది. అయితే మహారాష్ట్ర రైతుల సమస్యపై మాట్లాడటానికే వెళ్లానని శరద్ పవార్ చెప్పిన మాటలను అప్పట్లో శివసేన విశ్వసించలేదు కూడా. 
శరద్ పవార్  పార్టీకే పెద్ద పీట

అయినా శరద్ పవార్ పట్టించుకోకుండా శివసేనతో కాంగ్రెస్ తో పాటు తాను జట్టుకట్టేందుకు రెడీ అయిపోయారు.అజిత్ పవార్ ఎన్సీపీని వీడి బీజేపీ వైపు వెళ్లినప్పుడు కూడా శివసేన శరద్ పవార్ ను అనుమానించింది. శరద్ పవార్ అనుమతి లేకుండా అజిత్ పవార్ బీజేపీ వైపు వెళ్లరని భావించింది. అయితే శరద్ పవార్ తాను అనుకున్నది చేశారు. శివసేనతో ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అయిపోతూనే అజిత్ పవార్ ను కూడా వెనక్కు రప్పించగలిగారు. అజిత్ పవార్ తో రాజీనామా చేయించి బీజేపీ ప్రభుత్వం కూలిపోయేలా వ్యూహం రచించారు. గవర్నర్ కు కూడా గట్టి సంకేతాలు పంపారు. దీంతోనే మహారాష్ట్రలో సంకీర్ణ సర్కార్ సాధ్యమయింది.అందుకే శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఇప్పుడు తనకు నమ్మకమైన మిత్రుడిగా శరద్ పవార్ ను భావిస్తున్నారు. ఆయనకు చెప్పకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మంత్రి వర్గ విస్తరణతో పాటు శాఖల కేటాయింపులో కూడా శరద్ పవార్ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. అంతేకాదు భవిష్యత్తులో తీసుకోబోయే ఏ నిర్ణయమైనా శరద్ పవార్ కు తెలియకుండా జరగదంటున్నారు. ఎన్సీపీ బలపడేలా శరద్ పవార్ సూచనలు చేసినా తనకు అభ్యంతరం లేదంటున్నారు ఉద్ధవ్ థాక్రే. మొత్తం మీద ఉద్ధవ్ థాక్రేకు ప్రస్తుతం శరద్ పవార్ నమ్మకమైన మిత్రుడిగా కన్పిస్తున్నారు.

No comments:

Post a Comment