Breaking News

30/01/2020

తగ్గని మోడీ ఆదరణ

న్యూఢిల్లీ, జనవరి 30, (way2newstv.in)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్ దేశ వ్యాప్తంగా ఏ మాత్రం తగ్గలేదు. ఆర్థికమాంద్యం, కీలక బిల్లుల ఆమోదం నేపథ్యంలో మోదీ క్రేజ్ తగ్గిపోతుందని విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా జరిపిన సర్వేలు అవి నిజం కాదని తేల్చాయి. విపక్ష పార్టీలు మోదీకి కనుచూపు మేరలో కన్పించడం లేదు. సర్వేల్లో ఎక్కువ మంది ప్రజలు మోదీయే మళ్లీ ప్రధానిగా కావాలని కోరుకుంటుండటం విశేషం.ఇటీవల పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అనేక రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయోధ్య, కాశ్మీర్ అంశంతో పాటు పౌరసత్వ బిల్లు తేవడంతో మోదీ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆర్థిక మాంద్యంతో దేశం అట్టడుగు స్థాయికి చేరుకుందన్న విశ్లేషణలూ వెలువడుతన్నాయి. 
తగ్గని మోడీ ఆదరణ

అయితే ఏడు నెలల కిందట తిరిగి అధికారంలోకి వచ్చిన మోదీ పరిస్థితి ప్రజల్లో ఎలా ఉందన్న దానిపై జరిపిన సర్వేల్లో ఆశ్యర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి.ఇటీవల ఇండియా టుడే గ్రూప్ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట దేశ వ్యాప్తంగా సర్వేలు నిర్వహించింది. ఈ సర్వేలో తదుపరి ప్రధానిగా ఎవరిని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు అత్యధికులు మోదీ వైపు మొగ్గు చూపడం విశేషం. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో మోదీ ప్రధానిగా 53 శాతం మంది కోరుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కేవలం 13 శాతం మంది మాత్రమే కోరుకున్నారు. అమిత్ షాను 4 శాతం మంది మాత్రమే ప్రధాని అభ్యర్థిగా కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మోదీ, రాహుల్ గాంధీకి మధ్య దాదాపు 40 శాతం తేడా ఉండటం గమనించదగ్గ విషయం. మొత్తం 19 రాష్ట్రాల్లో 97 పార్లమెంటు స్థానాల్లోని 194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12,141 మంది నుంచి ఈ సర్వే ద్వారా అభిప్రాయాన్ని సేకరించారు.ఇక తాజాగా ఐఏఎన్ఎస్ – సీ ఓటరు సర్వే కూడా అదే చెప్పింది. మోదీ పట్ల ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గలేదని ఈ సర్వే కూడా స్పష్టం చేసింది. నరేంద్ర మోదీ పాాలన పట్ల అత్యధిక ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని తేల్చింది. అంతేకాదు ప్రధానిగా మోదీయే ఉండాలని 62.3 శాతం మంది అభిప్రాయపడ్డారు. 70 శాతం మంది తిరిగి మోదీకే ఓటేస్తామని ఈ సర్వేలో చెప్పడం విశేషం. ఇప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహించినా 330 పార్లమెంటు స్థానాలు బీజేపీకి దక్కుతాయని సీ ఓటరు సర్వే తేల్చడం విశేషం. మొత్తం మీద మోదీ క్రేజ్ దేశంలో ఏమాత్రం తగ్గలేదని తేలింది.

No comments:

Post a Comment