Breaking News

09/01/2020

ఇక ఈజీగా కొత్త వాహానాల రిజిస్ట్రేషప్

హైద్రాబాద్,  జనవరి 9 (way2newstv.in)
తెలంగాణలో కొత్త వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేయించుకొనే ప్రక్రియ మరింత సులభతరం అవుతోంది. వాహనాలు కొన్న అనంతరం వాటిని రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రస్తుతం వినియోగదారుడు ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇక ఆ ఇబ్బందుల్లేకుండా రిజిస్ట్రేషన్‌ను చేసేలా ప్రణాళిక తయారవుతోంది. ఇందులో భాగంగా షోరూంలో వాహనం కొన్న వ్యక్తి అక్కడే రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసుకునేలా కొత్త విధానాన్ని తీసుకురానున్నారు. వాహన తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొత్తాన్ని డీలర్‌ పరిధిలోనే పూర్తి చేస్తారు. దీని కోసం సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు తయారీ రవాణాశాఖ నుంచి షోరూం పరిధిలోకి వెళ్లింది. ఈ ప్రక్రియతోనే దాదాపు వాహన రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని డీలర్లకు అప్పగించేలా మార్గం సుగమమైనట్లు రవాణాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఇక ఈజీగా కొత్త వాహానాల రిజిస్ట్రేషప్

అయితే, ఏపీలో వాహన రిజిస్ట్రేషన్లను డీలర్లకు అప్పగించడం ద్వారా అక్కడ రూ.కోట్ల విలువైన అక్రమాలు జరిగాయి. దీన్ని పరిగణనలోకి తీసుకొని తెలంగాణలో ఆ పరిస్థితి తలెత్తకుండా ఉండే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నారు. ఈ వ్యవహారంపై రవాణాశాఖ అధికారుల్లో కొంత ఆందోళన ఉన్నప్పటికీ, వాహన కొనుగోలుదారులకు సౌకర్యవంతంగా సేవలు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ సులభతర ప్రక్రియ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతోసహా, ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపునకు సంబంధించిన ప్రక్రియ చివరిదశకు వచ్చినట్లు తెలిసింది. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటివారంలో అందుబాటులోకి రావచ్చని అధికారులు అంటున్నారు.ప్రస్తుతం ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు విషయంలో అధికారులు కొంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. అధికారులు ఎంత పక్కాగా వ్యవహరించినా, నంబరు దక్కని వ్యక్తులు వారిపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ సమస్య లేకుండా ఫ్యాన్సీ నంబర్లను ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ద్వారా కేటాయించాలని నిర్ణయించారు. ఫ్యాన్సీ నంబరు కావాలనుకునే వ్యక్తులు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో పాల్గొని, ఎక్కువ చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేస్తారో, వారికే నంబరు దక్కేలా విధానం రూపొందిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా దళారుల సమస్య తగ్గి, రవాణాశాఖకు రాబడి కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.

No comments:

Post a Comment