జెట్ స్పీడ్ లో జగన్
విజయవాడ, జనవరి 11 (way2newstv.in)
అమరావతి నుంచి విశాఖ వైపుగా వస్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్ మరో పది హేను రోజుల్లో అక్కడకు చేరుకుంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజధాని రగడ జగన్ కి తెగ చికాకుగా ఉందిట. అందువల్ల ఇలా నాన్చుతూ పోతే మరింత ముదిరే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారుట. దాంతో సాధ్యమైనంత తొందరగా విశాఖను రాజధానిగా ప్రకటించి అక్కడకు షిఫ్ట్ అయిపోవాలనుకుంటున్నాట్లుగా భోగట్టా. దీని కోసం శరవేగంగా షెడ్యూల్ కదుల్తోంది. ఇప్పటికి రెండుమార్లు భేటీ అయిన హై పవర్ కమిటీ రాజధానికి సంబంధించి కేవలం సచివాలయం ఉద్యోగుల డిమాండ్లు మాత్రమే పరిశీలిస్తోంది. రైతుల విషయంలో ఇపుడు ఏం చెప్పినా వినరన్న ధోరణిలోనే అటు సర్కార్, ఇటు హై పవర్ కమిటీ కూడా ఉన్నాయని అంటున్నారు.సచివాలయం ఉద్యోగులు విశాఖకు తరలివస్తే వారిని పువ్వులో పెట్టి చూసుకుంటామని వైసీపీ సర్కార్ అంటోంది.
అమరావతి టూ విశాఖ
ఒక్కొక్క ఉద్యోగికీ రెండు వందల చదరపు గజాల స్థలం ఇవ్వడంతో పాటు పాతిక లక్ష వరకూ రుణాన్ని కూడా ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చేందుకు ప్రతిపాదించారు. అదే విధంగా ఉద్యోగులకు ఇంటి అద్దె విషయంలో నాలుగు వేల రూపాయలు వంతున జగన్ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేందుకు కూడా రెడీ అవుతోంది. ఇక బ్రహ్మచారులకైతే ఉచిత వసతిని కల్పించాలని డిసైడ్ అయింది. అదే విధంగా ఉద్యోగులు భార్యభర్తలుగా ఉంటే విశాఖలో ఖాళీ లేకపోయినా కూడా వారిని కూడా బదిలీ మీద తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటోంది. గెజిటెడ్ ఆఫీసర్ క్యాడర్ కి లక్ష రూపాయల నుంచి తరువాత క్యాడర్ వరకూ అందరికీ విశాఖ షిఫ్టింగ్ కోసం ఎటువంటి బిల్లులు చూపించనవసరం లేకుండానే సొమ్ము చెల్లించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.మరో వైపు రైతులకు అభివృధ్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలనుకుంటున్నారు. అదే విధంగా అమరావతిలో శాసనసభను ఉంచడంతో పాటు, కొన్ని ప్రభుత్వ శాఖలు అక్కడే నడిపించడం ద్వారా రాజధాని కళ కట్టేలా చూస్తారు, ఎడ్యుకేషన్ హబ్ గా అమరావతిని భవిష్యత్తులో తీర్చిదిద్దుతారు. దానికోసం ఉన్న భవనాలు ఉపయోగించుకుంటారు. మరో వైపు గవర్నర్ బంగళా కూడా అక్కడే ఉంటుంది. రైతులకు చేసే ఈ ప్రతిపాదనలు అన్నీ కూడా అసెంబ్లీ వేదికగానే చెబుతారు. రైతులు ఇపుడు చర్చలకు వస్తే అభ్యంతరం లేదు కానీ వారు వచ్చేలా లేరన్నది వైసీపీ సర్కార్ భావన.మరో మారు హైపర్ కమిటీ సమావేశం అయిన తరువాత ఈ నెల 18లోగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. దాన్ని అందుకున్న వెంటనే వైసీపీ సర్కార్ ఈ నెల 18న ఒకరోజు అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తుంది. దానికంటే ముందే అదే రోజుల హై పవర్ కమిటీ నివేదికను క్యాబినెట్ ఆమోదిస్తుంది. ఇక అసెంబ్లీలో విశాఖ రాజధానిగా ప్రకటించి ఒకే ఒక్క తీర్మానంతో ఆమోదించడంతో ఆ తంతు ముగుస్తుంది. ఈ నెల 22న జగన్ క్యాంప్ ఆఫీస్ విశాఖలో ప్రారంభం అవుతుంది. ఈ నెల 26న విశాఖలోనే జగన్ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని జెండా ఎగరవేస్తారు. ఈ మొత్తం తతంగం పూర్తి కావడానికి కేవలం పదిహేను రోజులు మాత్రమే వ్యవధి ఉంది అన్నమాట. మొత్తానికి జగన్ జెట్ స్పీడ్ తో విశాఖకు దూసుకువచ్చేస్తున్నారు. ఆలోచించుకోవడానికి కూడా విపక్షానికి నో చాన్స్ గా పరిస్థితి ఉంది. అంతా షాక్ తినేలోగానే కధ నడిపించాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.
No comments:
Post a Comment