Breaking News

30/01/2020

నిర్భయ నిందితులకు ఉరిపై అనిశ్చితి

న్యూఢిల్లీ, జనవరి 30, (way2newstv.in)
నిర్భయ కేసులో దోషుల దొంగ నాటకాలు కంటిన్యూ అవుతున్నాయి. ఉరిశిక్ష అమలును ఆలస్యం చేసేందుకు నలుగురు హంతకులు విడతల వారీగా డ్రామాలు ఆడుతున్నారు. ముఖేష్‌సింగ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్ట్‌ కొట్టేసిన రోజే... మరో దోషి వినయ్‌శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకున్నాడు. దీంతో ఫిబ్రవరి ఒకటిన ఉరి అమలుకావడం డౌటే అంటున్నారు న్యాయ నిపుణులు. ఫిబ్రవరి 1న వారిని ఉరితీయడం అనుమానంగానే ఉన్నది. కేసులో రెండో దోషి అయిన వినయ్‌కుమార్‌ శర్మ బుధవారం రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖలుచేయగా, మూడో దోషి అయిన అక్షయ్‌కుమార్‌ సింగ్‌ సుప్రీంకోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్‌ను దాఖలుచేశాడు. ఢిల్లీ జైలు నిబంధనల ప్రకారం.. ఒక కేసులో పలువురు దోషులున్నప్పుడు చివరి దోషి కూడా తనకున్న న్యాయపరమైన హక్కులను వినియోగించుకునేంత వరకు వారిలో ఏ ఒక్కరికీ ఉరిశిక్ష అమలు చేయడానికి వీల్లేదు. 
నిర్భయ నిందితులకు ఉరిపై అనిశ్చితి

అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించిన తరువాత 14 రోజుల వరకు దోషులను ఉరితీయకూడదు. నిర్భయ కేసులో నలుగురు దోషులు ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌ కుమార్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌లను ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరితీయాలని ట్రయల్‌ కోర్టు ఈ నెల 17న రెండోసారి డెత్‌ వారంట్‌ జారీచేసింది. అంతకుముందు ఈ నెల 22న ఉరితీయాలంటూ ఈ నెల 7న వారంట్‌ జారీచేసిన్పటికీ అది వాయిదాపడింది. వినయ్‌కుమార్‌ తరఫున రాష్ట్రపతి భవన్‌లో క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖలుచేసినట్లు అతడి తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు. తన వాదనను ఎవరూ వినలేదని, కనీసం మీరైనా వినాలని వినయ్‌ రాష్ట్రపతిని అభ్యర్థించినట్లు చెప్పారు. ఈ నెల 14న వినయ్‌ దాఖలుచేసిన క్యూరేటివ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో అతడు తాజాగా క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖలుచేశాడు. తీహార్‌ జైలు అధికారులు ఈ విషయాన్ని విచారణ కోర్టు దృష్టికి తీసుకెళ్లి, బ్లాక్‌ వారంట్‌ను మరోసారి వాయిదా వేయాల్సిందిగా కోరాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ముకేశ్‌ కుమార్‌ ఒక్కడే తనకున్న అన్ని న్యాయపరమైన అవకాశాలను పూర్తిచేసుకున్నాడు. అతడు పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను ఈ నెల 17న రాష్ట్రపతి తిరస్కరించారు. దీన్ని సవాల్‌ చేస్తూ అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. అక్షయ్‌కుమార్‌ సింగ్‌ దాఖలు చేసిన క్యూరేటివ్‌ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం  విచారణ చేపట్టింది. ఒకవేళ కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేస్తే, అతడు రాష్ట్రపతి ఎదుట క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖలుచేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ముకేశ్‌, వినయ్‌ తర్వాత క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన మూడో దోషి అక్షయ్‌. మహిళలపై నేరాలకు సంబంధించి ప్రజల్లో వెల్లువెత్తిన ఆగ్రహావేశాలకు అనుగుణంగానే కోర్టులు మరణశిక్షలు విధిస్తున్నాయని అక్షయ్‌ తన పిటిషన్‌లో ఆరోపించాడు. మరో దోషి పవన్‌ గుప్తా ఇంకా క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేయలేదు. తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ ముకేశ్‌కుమార్‌సింగ్‌ దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి వేగంగా తిరస్కరించినంత మాత్రాన దాన్ని ఆలోచించకుండా, ముందుగానే ఒక నిర్ధారణకు వచ్చి తీసుకున్న నిర్ణయంగా పరిగణించలేమని పేర్కొంది. అన్ని డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకునే రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారని స్పష్టంచేసింది.

No comments:

Post a Comment