శ్రీకాకుళం, జనవరి 07 (way2newstv.in):
జిల్లాలో చేనేత సహకార సంఘాలు అప్పులఊబిలో కూరుకుపోతున్నాయి. ప్రైవేటు వ్యాపారుల వడ్డీలకు డబ్బులు తెచ్చి కార్మికులకు చెల్లింపులు చేయాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంటోంది. స్వేదం చిందించి వస్త్రాలు తయారు చేసినా అయిదు వేళ్లూ నోట్లోకి వెళ్లని పరిస్థితి నేత కార్మికులను వెంటాడుతోంది. పనులు కల్పించాల్సిన సంఘాల ఆర్థిక పరిపుష్టి దిగజారిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. అలాగని సంఘాల వద్ద డబ్బుల్లేక కాదు! ఉన్న డబ్బులన్నీ వస్త్రాలపై పెట్టుబడి పెట్టారు. ఆ వస్త్రాలను ఆప్కోకు విక్రయించారు. ఆప్కో సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలోకి నెట్టేసింది. జిల్లాలో 42 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వాటిల్లో బాగా పనిచేస్తున్న సంఘాలు 36 వరకు ఉన్నాయి. వాటి పరిధిలో కార్మికులు తయారు చేసిన వస్త్రాలను ఆప్కోకు విక్రయిస్తూ వస్తున్నారు.
ఆదుకునేవారెవరు..? (శ్రీకాకుళం)
దాదాపు రెండేళ్ల నుంచి బకాయిలు పేరుకుపోయినట్లు సంఘాల ప్రతినిధులు గగ్గోలు పెడుతున్నారు. మొత్తంగా 20 సంఘాలకు రూ.4.65 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు తేలింది. గత ఏడాది సెప్టెంబరుకు ముందే రూ.4.12 కోట్ల మేర బకాయిలు ఉండగా, సెప్టెంబరులో మరికొన్ని సంఘాలు రూ.52.89 లక్షల విలువైన వస్త్రాలను ఆప్కోకు విక్రయించాయి. 2018, జూన్ నుంచి బకాయిలు చెల్లించాల్సి ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. చేనేత కార్మికులకు సరిపడా పని కల్పించలేని పరిస్థితులు ఉత్పన్నమవుతుండడతో వీరు మరో రంగంలోకి మళ్లితే మున్ముందు సంఘాల మనుగడే ప్రమాదంలో పడుతుందన్న ఆందోళన సంబంధిత వర్గాల్లో వ్యక్తమవుతోంది. కార్మికులకు నూలు, తదితర ముడి సరకును అందజేస్తే వస్త్రాలు తయారు చేసి సంఘాలకు అందిస్తుంటారు. ఆయా వస్త్ర రకం బట్టి నిర్ణయించిన ధరల మేరకు చేనేత కార్మికులకు సంఘాలు చెల్లింపులు చేస్తుంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్మికులకు పనులు కరవవుతున్నాయి. సంఘాలకు బకాయిల బెడద వెంటాడుతుండడంతో కార్మికులను ఆదుకోలేక తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీరంతా బతుకుదెరువు కోసం చేనేత నుంచి మరో రంగం వైపు మళ్లితే తరువాత మళ్లీ ఈ రంగంలోకి తీసుకొచ్చే పరిస్థితులు సన్నగిల్లుతాయని ఆందోళన చెందుతున్నారు. దీనికి భయపడే చాలాచోట్ల ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి పనులు నడిపిస్తున్నారు.
No comments:
Post a Comment