Breaking News

04/01/2020

మహారాష్ట్ర మంత్రి వర్గ చిచ్చు

ముంబై, జనవరి 4 (way2newstv.in)
మహారాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ దాదాపు అన్ని పార్టీల్లో చిచ్చు పెట్టిందనే చెప్పాలి. శివసేన వంటి బాసిజం ఉన్న పార్టీలోనూ అసమ్మతి గళం విన్పిస్తుంది. మరోవైపు ఎన్సీపీ లో కూడా మంత్రి పదవులు దక్కని వారు స్వరం పెంచుతున్నారు. తాజాగా కాంగ్రెస్ లోనూ మంత్రి వర్గ విస్తరణ చిచ్చు అంటుకుంది. ఈ చిచ్చు ఆరేలా లేదు. సీనియర్లను కాదని కొందరు అధినాయకత్వాన్ని తప్పుదారి పట్టించారంటున్నారు.నిజానికి మంత్రి వర్గ విస్తరణ జరిగి మంత్రి పదవులు దక్కించుకున్న వారు కూడా అసంతృప్తిలో ఉన్నారు. ప్రాధాన్యత కలిగిన శాఖ కావాలంటూ పైరవీలకు కాంగ్రెస్ మంత్రులు దిగారు. 
మహారాష్ట్ర మంత్రి వర్గ చిచ్చు

మంత్రి పదవి దక్కినా కీలక శాఖ కోసం కొందరు ప్రయత్నిస్తుంటే, మంత్రి పదవులు దక్కకపోవడంతో మరికొందరు అసంతృప్తిని తీవ్రంగా వ్యక్తం చేస్తున్నారు. అసలే కూటమి ప్రభుత్వం కావడంతో అసంతృప్తి మరింత హెచ్చు మీరకుండా ఉండేలా చూసేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రంగంలోకి దిగారు.మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగి ఐదు రోజులవుతోంది. శివసేన నుంచి 12 మంది, కాంగ్రెస్ నుంచి 10 మంది, ఎన్సీపీ నుంచి 14 మంది మంత్రివర్గ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే సుదీర్ఘంగా చర్చించి మూడు పార్టీలు మంత్రి వర్గ సభ్యుల జాబితాను రూపొందించినా చివరకు అసమ్మతి తలెత్తింది. కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణతికి మంత్రి వర్గంలో స్థానం కల్పించకపోవడంపై కాంగ్రెస్ క్యాడర్ ఆందోళనకు దిగింది.సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణతి షిండే షోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడి నుంచి ప్రణతి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె మంత్రి పదవి దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆమె పేరు జాబితా నుంచి తొలగించారని తెలుస్తోంది. దీనికి కారణం పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అని ఆరోపిస్తూ కాంగ్రెస్ క్యాడర్ ధర్నాకు దిగింది. సీనియర్లను కాదని కొత్తవారికి పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రణతితో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా పదవులు దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నారు. మరి కాంగ్రెస్ ఈ నిప్పును ఎలా చల్లారుస్తుందో చూడాలి.

No comments:

Post a Comment