సీఆర్డీఏ స్థానంలో ఏఎంఆర్డీయే ఏర్పాటు
అమరావతి పరిధిలోని భూమి లేని పేదలకు...
నెలవారీ పింఛన్ల సొమ్ము రెట్టింపు
అమరావతి జనవరి 21 (way2newstv.in)
సీఆర్డీఏను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూపొందించిన బిల్లును సోమవారం సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. అనంతరం పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. సీఆర్డీఏ రద్దు వల్ల రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోకుండా గత ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల ఫలితంగా అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల ముసుగులో టీడీపీ నేతలు భూముల దందా నడిపారని బొత్స ధ్వజమెత్తారు.రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి భూ సమీకరణ, కౌలు చెల్లింపు, ప్లాట్ల కేటాయింపు, ప్రభుత్వ భవనాల నిర్మాణం తదితర అంశాలకుసంబంధించి 2014లో గత ప్రభుత్వం సీఆర్డీఏను ఏర్పాటు చేసింది.
ఏపీసీఆర్డీయే చట్టం రద్దు
రాజధాని వికేంద్రీ కరణ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయనుంది. ఇకపై సీఆర్డీఏకు సంబంధించిన లావాదేవీలన్నీ అమరావతి రీజియన్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి వస్తాయి. భూ సమీకరణ కింద రైతులిచ్చిన భూముల్లో అభివృద్ధి నిర్వహణ ఏఎంఆర్డీఏ పర్యవేక్షిస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం జరీబు భూములకు 50 వేలు, మెట్ట భూములకు ఎకరానికి 30 వేల చొప్పున రైతులకు కౌలు చెల్లిస్తోంది. సీఆర్డీఏ చట్టం ప్రకారం ఈ కౌలు పదేళ్ల కాలపరిమితితో రైతులతో అంగీకారం కుదిరింది. ఈ గడువును 15 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించింది.అదే విధంగా రాజధాని ప్రాంతంలో భూమిలేని పేదలు, రైతు కూలీలకు ప్రతి కుటుంబానికి 2500గా ఉన్న పింఛన్‌ను 5వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా భూ సమీకరణ కింద సేకరించిన భూమిని నిబంధనలకు లోబడి వినియోగిస్తారు. ప్రధాన చట్టం కింద నిర్వహించే చెల్లింపులు అవసరం కోసం ఏపీసీఆర్డీఏ నిర్వహించిన సామాజిక భద్రతా నిధిని ఏఎంఆర్డీఏకు బదలాయిస్తారు. వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన ఉద్యోగులపై అజమాయిషీ ఉంటుంది. వీరిని మాతృ సంస్థలకు పంపటం, అవసరమైన ఉద్యోగుల నియామకాల అధికారం ఇకపై ఏఎంఆర్డీఏకు ఉంటుంది.సీఆర్డీఏకు మంజూరు చేసిన అన్ని ఆర్థిక, ఇతర రాయితీలు, పన్ను మినహాయింపు, లైసెన్స్‌లు, ప్రయోజనాలు, ఇతర విశేషాధికారాలు, ప్రస్తుతం అమల్లో ఉన్న ఏదైనా చట్టం ప్రకారం వ్యవహారాలను కూడా ఏఎంఆర్డీఏ పర్యవేక్షిస్తుంది. చట్టం రద్దుతో సంబంధం లేకుండా ఏవైనా రుణాలు, కౌలు, ఆర్థిక లావాదేవీలు కూడా నిర్వహిస్తుంది. చట్టం ప్రారంభం నాటి నుంచి రెండేళ్లు గడిచిన తరువాత ఎలాంటి ఉత్తర్వులు వర్తించవు. మరోవైపు పట్టా రైతులకు ప్రస్తుతం అసైన్డ్ భూములకైతే 800 గజాలు నివాస, 200 గజాలు వాణిజ్య ప్లాట్లను కేటాయించారు. కొత్త చట్టం ప్రకారం మరో 200 చదరపు గజాలు అదనంగా కేటాయిస్తారు.
No comments:
Post a Comment