హైద్రాబాద్, జనవరి 21, (way2newstv.in)
రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్లు పెరిగాయి. థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ఆ మేరకు జలవిద్యుత్ పెరిగినట్టు టీఎస్ జెన్‌కో పేర్కొంటున్నా...గతంతో పోలిస్తే ఈ ఏడాదిలో పవర్ ఎక్సేంజ్‌ల ద్వారా కొంటున్న కరెంటు కొనుగోళ్లు అధికమయ్యాయి. కేంద్ర ఇంధన శాఖ డిసెంబర్ మాసానికి సంబంధించిన నెలవారీ మార్కెట్ మానిటరింగ్ రిపోర్ట్‌లో ఈ వివరాలను బహిర్గతం చేసింది. కొత్తగూడెం యూనిట్-12 (800 మెగావాట్లు)ను మరమ్మతు పేరుతో మూసివేయడంతో ఈ కొనుగోళ్లు పెరిగాయని జెన్‌కో అధికారులు చెప్తున్నారు. కానీ, ఉద్దేశపూర్వకంగానే థర్మల్ కేంద్రాలను మూసివేసి, బయటి నుంచి కరెంటును కొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా డిసెంబర్ మాసంలో పవర్ ఎక్సేంజ్‌ల ద్వారా 4,333.78 మిలియన్ యూనిట్ల విద్యుత్ అమ్మకాలు జరిగాయి. ఈ విద్యుత్‌ను కొనుగోలు చేసిన తొలి పది రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉన్నది.
తగ్గని విద్యుత్ కొనుగోళ్లు
పవర్ ఎక్సేంజ్‌ల ద్వారా ఒక్క డిసెంబర్‌లోనే 683.78 మిలియన్ యూనిట్లను (15.78 శాతం) కొనుగోలు చేశారు. గరిష్టంగా రూ.3.60పైసలు చొప్పున ఖరీదు చేసినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే పవర్ ఎక్సేంజ్‌ల్లో ప్రతి 15 నిముషాలకు ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. పీక్ అవర్‌లో ఈ ధర మరింత అధికంగా ఉంటుంది. సొంత ఉత్పత్తి ప్లాంట్ల ద్వారా అయితే ఈ ఖర్చు మరింత తగ్గి ఉండేదని విద్యుత్‌రంగ నిపుణులు చెప్తున్నారు.కొత్తగూడెం (ఏబీసీ) ప్లాంట్ల ఉత్పత్తి సామర్ధ్యం 420 మెగావాట్లు కాగా, గత ఏడాది (2019) ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 1,773.9 మి.యూ., (63.99 శాతం పీఎల్‌ఎఫ్) ఉత్పత్తి జరిగింది. అంతకుముందు ఏడాది (2018) అదే కాలపరిమితిలో ఇవే ప్లాంట్ల నుంచి 2,909.2 మి.యూ., (66.79 శాతం పీఎల్‌ఎఫ్) ఉత్పత్తి జరిగింది. అంటే 1,135.3 మి.యూ., ఉత్పత్తి ఈ ప్లాంట్ల నుంచి తగ్గింది.కొత్తగూడెం యూనిట్ 9,10 ఉత్పత్తి సామర్ధ్యం 500 మెగావాట్లు. 2019 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఈ ప్లాంట్ల నుంచి 2,667.8మి.యూ., (80.84 శాతం పీఎల్‌ఎఫ్) ఉత్పత్తి జరిగింది. 2018 లో అదే కాలానికి... ఇవే యూనిట్ల నుంచి 2,989.9 మి.యూ., (పీఎల్‌ఎఫ్ 90.60 శాతం) ఉత్పత్తి జరిగింది. అంటే 322.1 మి.యూ., ఉత్పత్తి తగ్గింది.కొత్తగూడెం యూనిట్ 11 ఉత్పత్తి సామర్ధ్యం 500 మెగావాట్లు కాగా, గత ఏడాది 2,548.7 మి.యూ., (77.23 శాతం పీఎల్‌ఎఫ్) ఉత్పత్తి జరిగింది. ఇదే యూనిట్ నుంచి 2018లో 2,793.3 మి,యూ.,(84.65 శాతం పీఎల్‌ఎఫ్) ఉత్పత్తి జరిగింది. 244.6 మి.యూ., ఉత్పత్తిని తగ్గించారు.మొత్తంగా కొత్తగూడెం 5, 6 విద్యుదుత్పత్తి కేంద్రాల సామర్ధ్యం వెయ్యి మెగావాట్లు కాగా, 2019లో 5,216.5 మి.యూ., (పీఎల్‌ఎఫ్ 79.04 శాతం)విద్యుత్ ఉత్పత్తి అయ్యింది. ఇవే కేంద్రాల నుంచి 2018లో 5,783.3 మి.యూ., (పీఎల్‌ఎఫ్ 87.63 శాతం) ఉత్పత్తి జరిగింది. అంటే 2018తో పోలిస్తే 2019 డిసెంబర్ నాటికి 566.8 మి.యూ., ఉత్పత్తి తగ్గింది (తగ్గిన పీఎల్‌ఎఫ్ 8.59 శాతం).ఏడాది క్రితమే నూతనంగా ప్రారంభించిన కొత్తగూడెం-7వ స్టేషన్‌లో 800 మెగావాట్ల సామర్ధ్యంతో నడుస్తున్న యూనిట్ 12లో హఠాత్తుగా ఉత్పత్తి నిలిచిపోయింది. సాంకేతిక సమస్య వల్ల ఉత్పత్తి ఆగినట్టు జెన్‌కో అధికారులు చెప్పారు. ఈ యూనిట్‌ను బీహెచ్‌ఈఎల్ నిర్మించింది. రెండు నెలలు గడిచినా ఇప్పటికీ ఇక్కడ మరమ్మతులు పూర్తికాలేదు.కాకతీయ 1,2 థర్మల్ స్టేషన్ల ఉత్పత్తి సామర్ధ్యం 1,100 మెగావాట్లు. ఇక్కడి నుంచి గత ఏడాది 5,339.7 మి.యూ., (పీఎల్‌ఎఫ్ 73.55 శాతం) ఉత్పత్తి జరిగింది. ఇవే స్టేషన్ల నుంచి 2018లో 6,173 మి.యూ., (పీఎల్‌ఎఫ్ 85.03 శాతం) ఉత్పత్తి జరిగింది. 2018తో పోలిస్తే 2019 నాటికి ఈ స్టేషన్ల నుంచి 833.3 మి.యూ., ఉత్పత్తి తగ్గింది.మొత్తం తెలంగాణ జెన్‌కో థర్మల్ కేంద్రాల ఉత్పత్తి సామర్ధ్యం 3,382.5 మెగావాట్లు కాగా, 72.51 శాతం పీఎల్‌ఎఫ్‌తో పనిచేశాయి. కానీ 2018లో ఇవే ప్లాంట్ల పీఎల్‌ఎఫ్ 83.47 శాతంగా ఉంది. గరిష్టంగా జెన్‌కో కేంద్రాల్లో ఉత్పత్తి 15.96 శాతం తగ్గినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దాదాపు అంతే మొత్తంలో (15.78 శాతం) విద్యుత్‌ను పవర్ ఎక్సేంజ్‌ల ద్వారా కొనుగోలు చేశారు. దీనివల్ల విద్యుత్ సంస్థలతోపాటు వినియోగదారులపైనా ఆర్ధికభారం అధికంగా పడుతుందని విద్యుత్‌రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెంలో (120ఞ2ొ240) యూనిట్ 6, 8 కాలం చెల్లిపోవడంతో వాటిని కూల్చివేశారు. కొత్తగూడెం యూనిట్ 12ను 800 మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మించి, సాంకేతిక కారణాల పేరుతో రెండు నెలలుగా మూసిఉంచారు.టీఎస్‌జెన్‌కో ఆధ్వర్యంలోని జలవిద్యుత్ కేంద్రాలు మాత్రం 2018 కంటే 2019లో మెరుగ్గా పనిచేశాయి. భారీ వర్షాలు, ఎగువ రాష్ట్రాల్లో వచ్చిన వరదల వల్ల నదుల్లో పుష్కలంగా నీరు లభ్యమైంది. 2018లో జలవిద్యుదుత్పత్తి 1,610.5 మి.యూ., జరగ్గా, 2019లో 4,053.6 మి.యూ.,జరిగింది. అంటే 2,443.1 మి.యూ., ఉత్పత్తి పెరిగింది. అయితే ఇది కేవలం 2019 ఆగస్టు నుంచి డిసెంబర్ వరకే పరిమితమయ్యింది. టీఎస్‌జెన్‌కో ఆధ్వర్యంలో జలవిద్యుత్కేంద్రాల ఉత్పత్తి సామర్ధ్యం 2,441.8 మెగావాట్లు. 2019 ఏప్రిల్ నుంచి జులై వరకు ఈ కేంద్రాల్లో ఎలాంటి ఉత్పత్తి జరగలేదు. ఆగస్టులో ప్రారంభమైన వర్షాలు, ఎగువ ప్రాంతాల్లో వచ్చిన వరదల వల్ల జలాశయాల్లోకి నీరు రావడం ప్రారంభమైంది. ఆగస్టులో 733.8 మి.యూ., సెప్టెంబర్‌లో 1,242.7 మి.యూ., అక్టోబర్‌లో 1,293.7 మి.యూ., నవంబర్‌లో 625.8 మి.యూ., డిసెంబర్‌లో 111.9 మి.యూ., ఉత్పత్తి జరిగింది. ప్రియదర్శిని జూరాల, లోయర్ జూరాల, శ్రీశైలం ఎడమకాలువ, నాగార్జునసాగర్, నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్, పులిచింతల ప్రాజెక్టుల ద్వారానే జలవిద్యుదుత్పత్తి జరిగింది.
No comments:
Post a Comment