Breaking News

24/01/2020

నాగోబా జాతరకు కుండలు సిద్ధం

అదిలాబాద్, జనవరి 24, (way2newstv.in)
ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జరిగే నాగోబా జాతరకు సిరికొండ కుండలు సిద్ధం చేశారు. నాగోబా జాతరకు సిరికొండ కుండలు ఒక ప్రత్యేకతను చాటుకున్నాయి. ఆనవాయితీగా వస్తున్న నాగోబా జాతర సందర్భంగా ఆదివాసీ గిరిజనులు, మెస్రం వంశీయులు నిర్వహించే నాగోబా దేవతకు జరిపే పూజలకు, ఇతర కార్యక్రమాలకు సిరికొండ కుండలనే ఉపయోగిస్తారు. ఒకరకంగా చెప్పాలంటే సిరికొండ కుండలు లేనిది పూజలు కూడా నిర్వహించరు. కొన్నేండ్ల చరిత్ర కలిగిన నాగోబా జాతరకు, సిరికొండ కుండలు కూడా ఒక ప్రత్యేకతను, చరిత్రను కలిగి ఉన్నాయి. ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగ దేవతకు సిరికొండ కుండలంటేనే ఇష్టమని ఇక్కడ ఏ పూజచేసినా ఆ కుండలతోనే పూజలు, ఇతర కార్యక్రమాలు జరుపుతామని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. 
నాగోబా జాతరకు కుండలు సిద్ధం

నాగోబా దేవతకు దూపదీప నైవేద్యాలు సమర్పించడానికి ఈ కుండలే ఆచారం ప్రకారం వాడుతూ వస్తున్నారు. జాతర సందర్భంగా నిర్వహించే పూజలు, దూపదీప నైవేద్యాలు ఈ కుండల ద్వారనే సమర్పిస్తారు. ఈ కుండలను జాతర ప్రారంభం కంటే ఒక నెల రోజల ముందుగా మెస్రం వంశీయులు సిరికొండలో వాటిని తయారు చేసే వారికి ఆర్డర్‌ చేసి వెళ్లారు. వారు ఆర్డర్‌ ఇచ్చిన మరుసటి రోజు నుంచి ఈ కుండలను తయారు చేస్తుంటారు. ఈ కుండలు ఎవరుపడితే వారు తయారు చేయలేరు. సిరికొండకు చెందిన గుగ్గిల్ల వంశీయులు గత 70 సంవత్సరాల క్రితం గుగ్గిల్ల రాజన్న నుంచి మొదలుకొని నేటికిని వారి వంశీయులు రాజేశ్వర్‌, స్వామిలు వారి కుటుంబ సమేతంగా ఈ కుండలు తయారు చేస్తూ, మెస్రం వంశీయులకు ఆనవాయితీగా అప్పగి స్తున్నారు.పేద కుండలు, వీటిలో గంగ నుంచి తెచ్చిన నీటిని వీటిలో పోసి పూజల కోసం నిల్వ చేసి ఉంచుతారు.ఇందులో ఉన్న నీటితోనే జాతర వద్ద నాగదేవతకు సమర్పించే నైవేద్యాలు వంట చేసేందుకు ఉపయోగిస్తారు. 50 నీటికుండలు, కాగులో నిల్వ ఉంచిన నీటిని తీసి వీటిలో పోస్తారు. ఈ నీటి ద్వారా వంటలు చేస్తారు. వీటి పైకప్పుకు ఉపయోగించే మూతలు, కూడా 50 ప్రత్యేకంగా తయారు చేస్తారు. కడు ముంతలు 45, వీటిని పెద్ద కుండలు కాగులులో గంగ నుంచి తెచ్చిన జలాలను నిల్వ చేస్తారు. పూజ సమయంలో దేవత వద్ద వీటిని పెట్టి ఇందులో ఉన్న నీటినే పూజలకు ఉపయోగిస్తారు. దీపెంతలు 200, వీటిని నాగోబా దేవాలయం చుట్టూ దీపాలు వెలగించడానికి, ఆలయంలో కూడా దూప దీపాలు వెలగించడానికి ఉపయోగిస్తారు. పెంకలు 20, వీటిని సాదారణంగా రొట్టె పెంకలు అని కూడా అంటారు. వీటిని ఆలయ పరిసర ప్రాంతాలలో రొట్టెలు, ఇతర పిండి వంటలు చేయడానికి ఉపయోగిస్తారు. కట్టెల పొయ్యి వెలిగించి ఈ పెంకుల పైనే పిండి వంటలు చేస్తారు. వీటపై తయారు చేసిన పిండి వంటలను నాగోబా దేవతకు సమర్పించిన అనంతరం భక్తులకు వడ్డిస్తారు.కేస్లాపూర్‌ నాగోబా జాతర సందర్భంగా నిర్వహించే నాగోబా దేవత పూజకు తరతరాల నుంచి కుండలు తయారు చేస్తున్నాం. జాతర సందర్భంగా ఒక నెల రోజుల ముందుగానే మెస్రం వంశీయులు తమ వద్దకు వచ్చి ఆర్డర్‌ ఇచ్చి వెళ్తారు. మరుసటి రోజు నుంచి ఈ కుండలు తయారు చేస్తాం. అమావాస్యకు మూడు రోజుల ముందుగా మెస్రం వంశీయులు తమ ఇంటికి వచ్చి తయారు చేసిన కుండలను తీసుకుపోతారు. ఇంటివద్ద వాటికి ప్రత్యేక పూజలు చేసి ఎడ్ల బండ్లల్లో వాటిని తీసుకెళ్తారు. ఇక్కడ ఎలాంటి కానుకలు ఇవ్వరు. నాగోబా దేవతకు జరిపే పూజ రోజు తమను అలయానికి పిలిపించి ఆలయం వద్ద తమను సన్మానించి, సత్కరించి అనంతరం తగిన దక్షణ సమర్పిస్తారు. జాతర పూర్తి అయిన తర్వాత హుండీ లెక్కించిన అనంతరం అందులో నుంచి తమ కుటుంబానికి రూ.7వేల వరకు అప్పగిస్తారు.

No comments:

Post a Comment