Breaking News

10/01/2020

యాసంగికి ఫుల్ నీరు

నిజామాబాద్, జనవరి 10, (way2newstv.in)
పోచంపాడ్‌ పరిధిలోని ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ రిజర్వాయర్లలో ప్రస్తుతం ఆశించిన స్థాయిలో నీరున్నదనీ, యాసంగికి ఎస్సారెస్పీ పరిధిలోని 13 లక్షల 67వేల ఎకరాల ఆయకట్టుకు నీటి కొరత లేదని ఎస్సారెస్పీ సీఈ శంకర్‌ పేర్కొన్నారు. యాసంగిలో ఎస్సారెస్పీ పరిధిలోని ఆయకట్టుకు నీటిని ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో డిసెంబర్‌ 25 నుంచి మార్చి 15 వరకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 83.253 టీఎంసీలు, ఎల్‌ఎండీలో 19.914 టీఎంసీల నీరుందని వివరించారు. గతేడాది వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల ఎస్సారెస్పీలోకి 160 టీఎంసీల నీరు వచ్చినట్లు తెలిపారు. ఎల్‌ఎండీ ఎగువన ఉన్న 4 లక్షల 62 వేల 920 ఎకరాలకు, ఎల్‌ఎండీ దిగువన ఉన్న 5 లక్షల 5 వేల 720 ఎకరాలకు డిసెంబర్‌ 25 నుంచి జనవరి 2వ తేదీ వరకు మొదటి తడి నీటిని అందించామన్నారు. రెండో తడికి నీటిని విడుదల చేయనున్నట్లు చెప్పారు. 
యాసంగికి ఫుల్ నీరు

ఎస్సారెస్పీ స్టేజ్‌-1 పరిధిలో 1,152 చెరువులుండగా, వీటిలో ప్రస్తుతం 800 చెరువులను నీటితో నింపేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టంచేశారు. ఎల్‌ఎండీ రిజర్వాయర్‌ నుంచి 18.5 టీఎంసీల నీటిని స్టేజ్‌ -2 కింద ఉన్న 681 చెరువుల్లో 595 చెరువులను నింపినట్లు తెలిపారు. అలాగే, స్టేజ్‌ -2 పరిధిలో 3 లక్షల 97 వేల ఎకరాల ఆయకట్టుకుగానూ ప్రస్తుతం 2 లక్షల 50 వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించాలని శివం కమిటీ ఆదేశాలిచ్చిందన్నారు. ప్రస్తుతం 8 రోజుల ఆన్‌, 7 రోజుల ఆఫ్‌ పద్దతిన నీటిని ఎల్‌ఎండీ ఎగువ, దిగువ ఆయకట్టుకు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు చెరువులు, కుంటలు నింపుతున్నామని చెప్పారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి రైతులకు బావుల్లో నీటి నిల్వలు పెరుగుతాయని చెప్పారు. రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలన్నారు. మొదటి రైతులు చివరి ఆయకట్టు రైతులకు నీరందేలా సహకరించాలని కోరారు. కాలువలను ధ్వంసం చేయవద్దనీ, సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.

No comments:

Post a Comment