ఖమ్మం, జనవరి 4, (way2newstv.in)
మిర్చి మోత మోగుతోంది. రాష్ర్టంలోని వ్యవసాయ మార్కెట్లలో క్వింటాల్ ధరలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గురువారం మిర్చి క్వింటాల్ రూ.21 వేలు పలికి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. ఖమ్మం, మలక్‌పేట్ గంజ్, వరంగల్ మార్కెట్లలోనూ భారీగా ధరలు పలికాయి. మిర్చికి ఈ స్థాయిలో రేట్లు రావడంతో వ్యాపారులు, రైతులు ఆశ్చర్యపోతున్నారు. ఈ నెలాఖరు వరకు ఇలాగే కొనసాగితే రైతులకు సిరులు కురుస్తాయని చెబుతున్నారు. ఈసారి సీజన్ ప్రారంభం నుంచే మంచి ధర లభిస్తోందని రైతులు చెబుతున్నారు. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన పంట నవంబర్లోనే అమ్ముడుపోవడం, దక్షిణాది రాష్ట్రాల్లో మిర్చి వాడకం ఎక్కువగా ఉండటం, చైనా, థాయ్‌లాండ్, మలేషియా తదితర దక్షిణాసియా దేశాల నుంచి భారీగా ఆర్డర్లు రావడంతోనే మిర్చి ధర పెరుగుతోందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మిర్చి రైతు ఫుల్ ఖుషీ
చలికాలంలో మిర్చి వాడకం సాధారణంగా ఎక్కువగానే ఉండటం కూడా మరో కారణమని చెబుతున్నాయి. మంచి భూముల్లో ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. పెట్టుబడి ఖర్చు లక్ష వరకు వస్తోంది. క్వింటాల్ రూ.20 వేలు ధర పలికినా ఎకరానికి రూ.6 లక్షల వరకు ఆదాయం వస్తుందని, పెట్టు బడి ఖర్చులు పోను ఎకరానికి రూ.5 లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నా రు. పంట పూర్తిగా అమ్ముకునేంత వరకు ఈ ధరలే ఉంటే మంచి లాభాలు వస్తాయని అంటున్నారు.ఘాటు ఎక్కువ ఉండే మిర్చి రకానికి భారీ డిమాండ్ ఏర్పడింది. గతేడాది ఇదే సమయంలో ఘాటు రకం క్వింటాల్ రూ.13 వేలు వరకు పలుకగా.. ఈ సారి రూ.5 వేల నుంచి 7 వేలకు పైగా అదనంగా ధరలు నమోదవుతున్నాయి. ఖమ్మం మార్కెట్‌లో తేజ రకం కొత్త మిర్చి గురువారం రూ.21వేలు పలికి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. గత జూన్‌లో రూ.11వేలు పలికిన ధర.. నవంబర్ నాటికి పాత మిర్చి క్వింటా రూ.20,021 నుంచి రూ.20,500 వరకు పలికింది. ఇక హైదరాబాద్ మలక్‌పేట్‌గంజ్ మార్కెట్‌లో క్వింటాల్ రూ.19,800, వరంగల్ మార్కెట్‌లో 20 వేల వరకు ధర పలికింది. నంబర్ వన్ రకం 19,800 నుంచి 21,000 వరకు కలుకగా, నంబర్ టు రకం రూ.13 వేల నుంచి 16 వేల వరకు పలికింది. తాలు మిరపకాయలే క్వింటాల్ 10 వేల వరకు పలుకుతుండటం గమనార్హం.తేజ రకానికి ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది పచ్చి మిర్చి ధర ఎక్కువగా ఉండటంతో ముందుగానే కోశారు. దీంతో పండు మిర్చి ఉత్పత్తి తగ్గింది. ధరల పెరుగుదలకు ఇది కారణమైంది. ధరలు ఇలానే కొనసాగితే క్వింటా రూ.22 వేలకు దాటవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.దేశవ్యాప్తంగా మిర్చి సాగు చేయడంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర రాష్ట్రాలు కీలకం. ఏటా 3.98 లక్షల మెట్రిక్ టన్నులు పండిస్తూ మిర్చి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో ఉన్నది. అయితే పంట వేసిన కొన్నాళ్లకే అకాల వర్షాలతో కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వరదల్లో పంట పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో మిర్చి దిగుబడిపై భారీగా దెబ్బ పడింది. మన రాష్ట్రంతోపాటు ఏపీలోనూ మిర్చి పంట వర్షాలకు కొంత మేర దెబ్బతిన్నది. కొందరు రైతులు మిర్చి పంటకు ప్రత్యామ్నాయంగా వరి, మొక్కజొన్న సాగు చేశారు. రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ సాగు 1.81 లక్షల ఎకరాలు కాగా వర్షాల ప్రభావంతో 1.23 లక్షల ఎకరాల్లో మిర్చి సాగైంది. దాదాపు 60 వేల ఎకరాలు(32శాతం) తగ్గిపోయింది. ప్రధానంగా ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, అర్బన్, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, జగిత్యాల, కరీంనగర్, గద్వాల జిల్లాల్లో మిర్చి ఎక్కువ సాగు చేశారు.
No comments:
Post a Comment