విజయవాడ, జనవరి 25, (way2newstv.in)
ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాల్లో ఎంతో కీలకమైనది రవాణాశాఖ. ప్రస్తుతం ఈ రంగం ఆర్థిక సంక్షోభంలో ఉంది. వాహనాల అమ్మకాలు మందకొడిగా సాగుతున్నాయి. ఆర్థిక మాంద్యం ప్రభావం గణనీయంగా ఉంది. ఫలితంగా ఈ శాఖ ద్వారా వచ్చే ఆదాయానికి గండి పడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో బాగా క్షీణించింది. ఎనిమిది నెలల్లో లక్ష్యంలో 80 శాతమే సమకూరింది. ఇంకా 20 శాతం లోటు కన్పిస్తోంది. వాహనాల క్రయ, విక్రయాలు పడిపోవడమే ప్రధాన కారణం. ఈ ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిత పన్ను, త్రైమాసిక పన్నుపై పడింది. ఆదాయంలో ఈ విభాగాల ద్వారా వచ్చేదే అధికం. ఈ పరిస్థితిని అధిగమించడానికి రవాణా శాఖ అధికారులు తనిఖీల జోరును పెంచారు.
20 శాతం ఆదాయం తగ్గిన రవాణాశాఖ
2019-20 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండే తడబాటు కన్పించింది. మొదట్లో బాగా వెనుకబడి ఉన్న కృష్ణాజిల్లా ఆ తర్వాత నెలల్లో కొంత వరకు పుంజుకుంది. విజయవాడ నగరం రవాణా హబ్‌గా పేరుగాంచింది. రవాణా, రవాణేతర వాహనాల క్రయ, విక్రయాలు అధికంగా సాగుతుంటాయి. ఈ సారి ఈ రంగం నుంచి వచ్చే ఆదాయం తగ్గింది. ప్రధానంగా జీవిత పన్ను, త్రైమాసిక పన్ను, రుసుములు, సేవా పన్నులు, తనిఖీల ద్వారా ఆదాయం వస్తుంది. అన్ని పద్దుల ద్వారా ఇచ్చిన లక్ష్యం కంటే ఆదాయం తగ్గింది. గత ఎనిమిది నెలల్లో కొత్త వాహనాల కొనుగోళ్లు తగ్గడం వల్ల, వీటి ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా క్షీణించింది. రవాణా వాహనాలపై త్రైమాసిక పన్ను విధిస్తుంటారు. ఇప్పటికే ఉన్న రవాణా వాహనాలతో పాటు, కొత్త వాటిపైనా ఈ పన్ను వేస్తారు. ప్రతి మూడు నెలలకోసారి చెల్లించాల్సి ఉంది. కొత్త వాహనాల కొనుగోళ్లు తగ్గడం ఆదాయ లోటుకు పరోక్షంగా కారణమైంది. రుసుముల ద్వారా వచ్చే ఆదాయం కూడా పడిపోయింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, వాహనాలఅమ్మకాలు, ఎల్‌ఎల్‌ఆర్, డ్రైవింగ్ లైసెన్స్, పునరుద్ధరణ తదితర వాటి కోసం నిర్దేశిత రుసుము చెల్లించాలి. సేవా పన్నుల విషయంలోనూ ఇదే ధోరణి కన్పించింది. రవాణా శాఖ అందించే వివిధ సేవలపై పన్ను విధిస్తారు. సేవలు పొందే వారి సంఖ్య తగ్గడంతో పన్నుల ఆదాయం కూడా క్షీణించింది. తనిఖీల్లో భాగంగా ఉల్లంఘనలపై వేసే జరిమానా కూడా పడిపోయింది. ఆదాయంపై ప్రతి వారం రవాణాశాఖ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షిస్తున్నారు. పన్ను చెల్లించని వాహనదారులకు రవాణాశాఖ అధికారులు తాఖీదులు జారీ చేస్తున్నారు. జాబితాను సంబంధిత ఎంవీఐలకు ఇస్తూ వసూళ్లను పర్యవేక్షిస్తున్నారు.
No comments:
Post a Comment