ముంబై, జనవరి 10 (way2newstv.in)
బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతూ వస్తున్న పసిడి ధర ఈ రోజు భారీగా పడిపోయింది. దీంతో కొండెక్కిన బంగారం ధర మళ్లీ ఒక్కసారిగా దిగొచ్చినట్లు అయ్యింది. పసిడి వెలవెలబోతోంటే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. బంగారం కన్నా ఇంకా ఎక్కువగానే పతనమైంది.హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర భారీగా పతనమైంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.970 క్షీణించింది. దీంతో పసిడి ధర రూ.38,300కు దిగొచ్చింది. గురువారం బంగారం ధర రూ.39,270 వద్ద ఉంది.అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు ఏకంగా రూ.1,070 పతనమైంది. దీంతో పసిడి ధర రూ.41,790కు క్షీణించింది. కాగా బంగారం ధర గురువారం నాడు రూ.42,860 వద్ద ఉంది.అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా బంగారం ధర పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే.
1000 రూపాయిలు తగ్గిన బంగారం
అయితే ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ శాంతి చేకూర్చుకునేందుకు సిద్ధంగానే ఉన్నామని ప్రకటించారు. దీంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడింది. ఒక్కసారిగా వెలవెలబోయింది.బంగారం ధర పడిపోతే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.1500 కుప్పకూలింది. దీంతో ధర రూ.49,500కు దిగొచ్చింది. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు సహా పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలోనూ ధరలు ఇలానే ఉన్నాయి.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.1000 క్షీణించింది. దీంతో ధర రూ.39,100కు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.980 క్షీణించింది. దీంతో ధర రూ.40,300కు తగ్గింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.1500 దిగొచ్చింది. దీంతో ధర రూ.49,500కు క్షీణించింది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.06 శాతం క్షీణతతో 1,553.285 డాలర్లకు తగ్గింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.06 శాతం తగ్గుదలతో 17.92 డాలర్లకు క్షీణించింది. ఇకపోతే అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా బంగారం ధర 2019 సెప్టెంబర్ నెలలో కూడా ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరిన విషయం తెలిసిందే.దేశీ మార్కెట్‌లో బంగారం ధర గత ఏడాది దాదాపు 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.పసిడి ధర మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి పడిపోవడం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.50,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి
No comments:
Post a Comment