Breaking News

13/12/2019

పార్టీల్లో కొనసాగుతున్న వ్యక్తిగత పూజలు

విజ యవాడ, డిసెంబర్ 13 (way2newstv.in)
సమరమైనా, రాజకీయమైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు. ఎందుకంటే మద్దతు ఎంత వుందో అక్కడే తెలిసిపోతుంది కాబట్టి. పేరుకు ప్రజాస్వామ్య పార్టీలుగా ఉన్నా చాలా వాటిలో అంతర్గత చర్చలు ఉండవు. ఇక అధినాయకుల గ్లామర్ మీదనే ఆధారపడి బండి లాగించేసే పార్టీల‌లో అధ్యక్షుడు నంది అంటే నంది, పంది అంటే పంది అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇపుడు ఇదే రకమైన వ్యక్తిపూజ అన్ని పార్టీల్లో ఉంది. ఏపీ విషయానికి వస్తే ఈ మధ్య ఇంగ్లీష్ మీడియం మీద జరిగినంత లొల్లి మరో టాపిక్ మీద జరగలేదు. తెలుగును చంపేస్తున్నారా. అసలు తెలుగు వారేనా మీరూ అంటూ అటు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు, ఇటు హీరో కమ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్ని గట్టిగానే తగులుకున్నారు. తెలుగు భాష అంటే మరీ అంత చులకనా అంటూ విరుచుకుపడ్డారు. 
పార్టీల్లో కొనసాగుతున్న వ్యక్తిగత పూజలు

తెలుగుని మసి చేయాలని చూస్తే సర్వనాశనమై పోతారంటూ శాపనార్ధాలు కూడా పెట్టారు. సరే ఇవన్నీ రాజకీయ విమర్శలు అనుకున్నా కూడా వీటికి జనం నుంచి వచ్చిన స్పందన కూడా అంతంతమాత్రమే. చంద్రబాబు పార్టీలోనే ఈ అంశం మీద విభేదించారు గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఇంగ్లీష్ మీడియం సర్కార్ బడులలో పెడతాను అని జగన్ అంటే మీకెందుకు అంత ఉలుకు బాబూ అంటూ ఆయన మీడియా ముఖంగానే హాట్ కామెంట్స్ చేశారు. మీ పిల్లలు ఇంగ్లీష్ చదువులు చదవాలా, పేదల బిడ్డలు మాత్రం మట్టికొట్టుకుపోవాలా..ఇదేమి నీతి అంటూ బాగానే లంకించుకున్నారు. మారుతున్న కాలానికి తగినట్లుగా ఆంగ్ల భాష బోధిస్తే తప్పేంటని కూడా వంశీ నిలదీశారు. ఈ దెబ్బకు చంద్రబాబు కిక్కురుమనలేకపోయారు. ఆ తరువాత వంశీని సస్పెండ్ చేశారు, అది వేరే విషయం అయినా ఇంగ్లీష్ మీడియం వంటి కీలకమైన అంశం విషయంలో సొంత పార్టీ తమ్ముళ్ళ మద్దతు చంద్రబాబుకు లేకపోయిందన్నది మాత్రం రాజకీయ ప్రపంచంలో బాగా ఎస్ట్లాబ్లిష్ అయిపోయింది. తన పార్టీ వారికే నచ్చచెప్పలేని చంద్రబాబు జగన్ మీద ఎలా యుధ్ధం చేస్తాడంటూ విమర్శలు మొదలయ్యాయి. మొత్తానికి ఆ తరువాత చంద్రబాబు యూ టర్న్ తీసుకుని ఇంగ్లీష్ మీడియం ఎక్కడ వద్దన్నామంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.నిజానికి ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించే విషయంలో చంద్రబాబు కంటే జనసేన పవన్ కళ్యాణ్ నాలుగాకులు ఎక్కువే చదివారు. ఆయన మన నుడి, మన నది అంటూ ఒక కార్యక్రమాన్ని కూడా ప్రకటించారు. తెలుగు జాతి మనది అంటూ ఆవేశ గీతాలు ఆలపించడమే కాదు, తెలుగుకి తెగులు పట్టిస్తే ఊరుకోమని గట్టి వార్నింగులే ఇచ్చారు. రాయలసీమలో తొలి తెలుగు శాసనం బయటపడిందని, అక్కడ నుంచి వచ్చిన జగన్ మాత్రం తెలుగు వద్దు అంటున్నారని బాగానే నోరు చేసుకున్నారు. మరి ఇపుడు ఆయన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మాత్రం నిండు అసెంబ్లీలో జై ఇంగ్లీష్ అనేశారు. అదే నోటితో వైసీపీ ఆలోచన భేష్ అని కూడా అన్నారు. తెలుగు భాష కోసం అధినేత పవన్ కొండంత రాగం తీస్తూంటే అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే రాపాక మాత్రం జగన్ నిర్ణయం బాబుందంటూ కితాబు ఇచ్చేశారు. ఓ విధంగా ఇది పవన్ కి అవమానమే. తన పార్టీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మనసులో ఏముందో కూడా తెలుసుకోకుండానే పవన్ తెలుగు ఉద్యమం మొదలుపెట్టారా అన్నది కూడా పెద్ద డౌట్ గా ఉంది.ఈ మాట కూడా రాపాక వరప్రసాద్ చెప్పుకున్నారు. అధినేతతో తనకు కొంత దూరం ఉందని ఆయన అంటున్నారు. ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్న జనసేనలో ఆయనకు తగినంత గౌరవం లేదన్నది కూడా ఈ మధ్య ప్రచారమవుతున్న మరో విషయం. ఇక తన ఎమ్మెల్యే ద్వారా శాసనసభలో బలమైన వాణిని వినిపించాలనుకునే అధినేత అయితే ఆయనతో ఉన్న గ్యాప్ ని పవన్ సర్దుబాటు చేసుకోవాలి. కానీ రాపాక విషయంలో పవన్ ఎక్కడో కనెక్షన్ మిస్ చేసుకున్నాడని తెలుస్తూనే ఉంది. మరో వైపు ఇదే మాట బయటకు చెప్పకపోయినా టీడీపీలో ఎమ్మెల్యే తమ్ముళ్ళ వైఖరి కూడా అలాగే ఉందని చెప్పాలి. చంద్రబాబుతో వారికి కూడా కమ్యునికేషన్ గ్యాప్ ఉండడం వల్లనే అధినేతాశ్రీ చెప్పిన బాటను అనుచరులు తప్పుతున్నారనిపిస్తోంది. ఏది ఏమైనా చంద్రబాబు, పవన్ ముందు ఇంట గెలవాలని అని అంతా అంటున్నారు.

No comments:

Post a Comment