Breaking News

07/12/2019

పురపోరుకు సిద్ధం (నిజామాబాద్)

నిజామాబాద్, డిసెంబర 07(way2newstv.in): 
ఎన్నికల దిశగా నేతలు మరోమారు సమాయత్తమవుతున్నారు. పుర ఎన్నికలపై ఎదురొచ్చిన అడ్డంకుల స్టేను హైకోర్టు ఎత్తివేయడంతో ఇక  జోరును చూపేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో ఎన్నికల నిర్వహణ దిశగా అనుకూల వాతావరణం కనిపించడంతో ఆశల లోకంలో విహరిస్తున్నారు. పట్టణంలో తమ సత్తాను చాటుకునే దిశగా ఆశావహనాయకులు ఇక అన్నిపనుల్ని పక్కనబెట్టి అసలైన రాజకీయాన్ని చూపించాలనే దిశగా అడుగులేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌, రామగుండం నగరపాలక సంస్థలతోపాటు 14పురపాలికల్లో త్వరలో జరిగే ఎన్నికల్లో తమ ప్రాబల్యాన్ని చూపించడానికి  నాయకులు ఆసక్తిని చూపిస్తున్నారు. గతేడాది డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికలు మొదలు ఏప్రిల్‌ నెల వరకు జరిగిన వరస ఎన్నికల్లో తలమునకలైన నాయకులు మరోసారి ఓట్ల సమరంలో సత్తాను చాటాలనే జోష్‌ను చూపిస్తున్నారు. ఇందుకోసం ఇక మీదట ఏమి చేయాలనే విషయమై తమ అనుచరగణంతో చర్చించుకుంటున్నారు. 
పురపోరుకు సిద్ధం (నిజామాబాద్)

ఇప్పటికే ఆయా డివిజన్లు, వార్డుల్లో పోటీ చేయాలనుకునే నాయకులంతా మరోసారి ప్రజల ముంగిట నిలిచేలా  ఆసక్తిని చూపిస్తున్నారు. ఇందుకోసం ప్రణాళికాయుతంగా ముందుకెళ్తున్నారు. సిట్టింగ్‌లో ఉన్న వారితోపాటు గతంలో పోటీ చేసి ఓడిన నాయకులంతా మరోసారి ప్రజల నాడిని పట్టి గెలిచేందుకు ఇప్పటి¨నుంచే వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఈ ఏడాది జూలైలోనే ఎన్నికలు వస్తాయనే జోరులో పోటీ చేయాలనుకునే ప్రాంతాల్లో ఆశావహులంతా విస్తృతంగా పర్యటించిన సందర్భాలున్నాయి. మధ్యలో ఎన్నికల విషయంలో స్పష్టత రాకపోవడంతో నిదానపు తీరుని వ్యవహరించారు. ఇక తాజాగా హైకోర్టు తీసుకున్న నిర్ణయంతో అడ్డంకులు తొలిగిపోవడం. మరో పక్షం రోజుల్లో అభ్యంతరాలు, సవరణల పరిష్కారం దిశగా మళ్లీ యంత్రాంగంలో కదలిక కనిపిస్తుండటంతో తమ ప్రాబల్యాన్ని చూపాలని నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా డివిజన్లు, వార్డుల విభజన సహా రిజర్వేషన్లు , ఓటర్ల జాబితా .. ఇలా అన్నింటిపై  దృష్టిని సారించబోతున్నారు. ఇప్పటికే తమకు అనుకూలంగా వస్తుందనే ఆశ ఉన్న ప్రాంతంలో ప్రజలకు పరోక్షంగా తానే బరిలో ఉంటామనే సంకేతాల్ని చూపించబోతున్నారు.ప్రధాన పార్టీల దృష్టంతా ఇకమీదట పట్టణాలపైనే కేంద్రీకృతమవనుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాసతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా, కాంగ్రెస్‌ , ఎంఐఎం, తెదేపా, కమ్యూనిస్టు పార్టీలన్నీ తమ కదలికల్లో వేగాన్ని పెంచేందుకు ఈ ఎన్నికల్ని అసలైన అదనుగా మార్చుకోబోతున్నాయి. అభివృద్ధి నినాదంతో ప్రజల మనసుల్ని గెలుస్తామని గులాబీ పార్టీ భావిస్తుండగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని సొమ్ము చేసుకుని పట్టణాల్లో తమ పార్టీల ప్రాబల్యాన్ని చూపాలని ఇతర పార్టీలు యోచిస్తున్నాయి. ఇన్నాళ్లుగా అడపాదడపా కార్యక్రమాలతో జోరుని పెంచిన తీరు తమకు లాభమని అన్ని పార్టీలు ఆశాభావ దృక్పథంతో ఉన్నాయి. ఇదే కాకుండా నాలుగు జిల్లాల పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల తరువాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎవరికివారుగా అన్ని పార్టీలు  పాగాను వేయాలని భావిస్తున్నాయి. పట్టణ ఓటర్లు చైతన్యవంతులవడంతో ఇట్టే వారి దృష్టిని తమవైపునకు తిప్పుకునేలా వ్యూహాత్మక శైలిని చేతల్లో చూపించాలనుకుంటున్నారు. ఇదే సమయంలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఏ క్షణాన ఎన్నికలు వచ్చినా ప్రత్యర్థుల్ని ఎదుర్కొని పోరుకి సై అంటున్నారు. ఇందుకోసం అవసరమైన అన్నిరకాల అస్త్రశస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలో ఎన్నికల నిర్వహణ పరంగా ఎన్నికల సంఘం సహా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

No comments:

Post a Comment