నల్గొండ, డిసెంబర్ 23, (way2newstv.in)
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో జాయింట్ చెక్ పవర్ వివాదాలు మరింత ముదురుతున్నాయి. సెప్టెంబర్లో 30 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన నిధులే కాకుండా సర్పంచ్ లు తమ సొంత నిధులు ఖర్చు చేసినా ఇప్పటివరకు వాటి బిల్లులు రిలీజ్ కాలేదు. పనులు పూర్తయినా చాలా గ్రామాల్లో బిల్లుల విడుదలకు చెక్ ల మీద సంతకాలు కాలేదని సర్పంచ్ లు చెబుతున్నారు. ఉప సర్పంచ్ లు సతాయిస్తున్నారని, బిల్లులో కొంత కమీషన్ ఇస్తేనే సంతకం పెడతామని చెబుతున్నట్లు సర్పంచ్ లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో పనులు జరిగినా బిల్లులు విడుదల కావేమోనని సర్పంచ్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అప్పులపాలయ్యామని, పనులు చేపట్టాలని ఉప సర్పంచ్లనే కోరుతామని కొందరు చెబుతున్నారు.
ముదురుతున్న చెక్ పవర్ పంచాయితీలు
సెప్టెంబర్లో చేపట్టినట్లే జనవరి 2 నుంచి 11 వరకు పల్లె ప్రగతిని నిర్వహించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్ని జిల్లాల అధికారులతో సమీక్ష చేపట్టారు. ప్రభుత్వం కూడా ఈ నెలాఖరు కల్లా నిధులు విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి. పచ్చదనం, పరిశుభ్రతతో పాటు డంపింగ్ యార్డు, ఇంకుడు గుంతలు, వైకుంఠ ధామాల ఏర్పాట్లను ఈ కార్యక్రమంలో చేపట్టనున్నట్లు తెలుస్తోంది.కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్, ఉప సర్పంచ్ కు కలిపి జాయింట్ చెక్ పవర్ అధికారాన్ని ప్రభుత్వం కల్పించిన విషయం తెలిసిందే. పంచాయతీల్లో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులపై సంతకాలు పెట్టడం లేదని సర్పంచ్ లు ఫిర్యాదు చేస్తుండటంతో చర్యలు ప్రారంభం అయ్యాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని మాసానిగూడ ఉప సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డిని నెల రోజులు సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ హరీశ్ ఉత్తర్వులిచ్చారు. గ్రామంలో చేసిన పనులకు సంబంధించి నిధుల డ్రా కోసం సంతకాలు చేయటం లేదని జిల్లా కలెక్టర్ కు సర్పంచ్ రాములు ఫిర్యాదు చేశారు. దీంతో వెంకటేశ్వర్ రెడ్డిని సస్పండ్ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా నందనం గ్రామంలో యాక్షన్ ప్లాన్ లో చేసిన పనులకు బిల్లుల విడుదల కోసం చెక్కులపై సంతకాలు చేయకుండా సతాయిస్తున్నారంటూ ఉప సర్పంచ్ ఆరెల్లి మౌనికపై సర్పంచ్.. పంచాయతీ రాజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మౌనికకు డీఎల్ పీవో నోటీసు ఇచ్చి సంజాయిషీ కోరారు. ఉప సర్పంచ్ ఇచ్చిన సమాధానం సరిగ్గా లేదంటూ 6 నెలలు ఆమెను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు.ఓ వైపు చెక్కుల మీద సంతకాలు చేయటం లేదని ఫిర్యాదులు, సస్పెన్షన్లు కొనసాగుతున్నా చాలాచోట్ల కమీషన్లు అడగడం మాత్రం మారలేదు. సర్పంచ్, ఉప సర్పంచ్కు కలిపి జాయింట్ చెక్ పవర్ ఇస్తారన్న ఉద్దేశంతో వార్డు మెంబర్ గా గెలిచి ఉప సర్పంచ్ కావటానికి చాలా గ్రామాల్లో భారీ ఎత్తున ఖర్చు చేశారు. పలు చోట్ల ఉప సర్పంచ్ పదవికి ఇతర వార్డు మెంబర్లు పోటీ పడకుండా అప్పులు తెచ్చి కొంత నగదును ముట్టచెప్పినట్లు వార్తలు వచ్చాయి. సస్పెండ్ చేసేది కొంత కాలమే కదా, ఇంకా నాలుగున్నర ఏళ్లు పదవి ఉంది కదా అని పలువురు ఉప సర్పంచ్ లు అంటున్నట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment