కడప, డిసెంబర్ 21, (way2newstv.in)
సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక్కడ నుంచి వైఎస్ కుటుంబం అనేక సంవత్సరాలుగా వరుస విజయాలు నమోదు చేస్తోంది. ఇక్కడ ఎవరు నిలబడ్డా.. వైఎస్ కుటుంబానికే విజయం అనే మాట వినిపిస్తుంటుంది. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి, వైఎస్.వివేకానందరెడ్డి, వైఎస్.విజయమ్మ, వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఇలా వీళ్లందరూ వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. అలాంటి నియోజక వర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదిపారు. ఏకంగా జగన్‌నే ఓడించాలని భావించారు.ఈ క్రమంలోనే ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోతున్న సతీష్ రెడ్డికి ప్రాధాన్యం ఇచ్చారు.
పులివెందులలో గజ్వేల్ ఫార్ములా
ఇటు రాజకీయంగా, అటు సంక్షేమం పరంగాకూడా బాబు అడుగులు వేశారు. పులివెందులకు పట్టిసీమ నీటిని అందించారు. దీంతో ఇంకేముంది టీడీపీ విజయం ఖాయమని అనుకున్నారు. సతీష్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు. మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చారు. పులివెందులకు నీళ్లు వచ్చే వరకు తాను గెడ్డం తీయనని మరీ ఆయన ప్రతిజ్ఞ చేశారు. కానీ, ఈ ఏడాది ఎన్నికల్లో అనూహ్యంగా జగన్ మెజారిటీ మరింత పెరిగిపోయింది. అంతేకాదు, ఇప్పుడు ఇక్కడ ఏకంగా టీడీపీకి ప్రాతినిధ్యం వహించే నాయకుడు కూడా లేకుండా పోవడం గమనార్హం.ఇక్కడ నుంచి వరుస ఓటములు చెందిన పార్టీని నడిపిస్తున్న సతీష్ రెడ్డి ఈ నెల 26న జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇక, ఇదే సమయంలో జగన్ కూడా తన సొంత నియోజకవర్గంలో ప్రత్యర్థే లేకుండా చూసుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ అనుసరించిన గజ్వేల్ ఫార్ములాను అనుసరిస్తు న్నారని అంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. తాను వరుసగా విజయం సాధిస్తూ వచ్చిన గజ్వేల్‌లో తన ప్రత్యర్థి ఒంటేరు ప్రతాపరెడ్డిని ఏకంగా తన పార్టీలోకి చేర్చేసుకున్నారు. ప్రతాప్‌రెడ్డి గత రెండు ఎన్నికల్లోనూ కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిపోయారు.గతేడాది ఎన్నికల్లో రెండోసారి ఓటమి తర్వాత ఆయన్ను పార్టీలో చేర్చుకుని.. నామినేటెడ్ పదవి కూడా ఇచ్చారు. ప్రస్తుతం ప్రతాప్‌రెడ్డి తెలంగాణ అటవీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు. ఇదే ఫార్ములాను ఇక్కడ జగన్ కూడా అనుసరించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే సతీష్ రెడ్డి వైసీపీతో మంతనాలు కూడా పూర్తి చేసుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన కడప స్టీల్ ప్లాంటుకు శంకు స్థాపన చేసే ఈ నెల 26న వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని అంటున్నారు. ఆ వెంటనే త్వరలోనే జగన్ ఆయనకు నామినేటెడ్ పదవి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
No comments:
Post a Comment