Breaking News

18/12/2019

పార్లమెంట్ సభ్యులు రెట్టింపు అవుతారా...

న్యూఢిల్లీ, డిసెంబర్ 18 (way2newstv.in)
ఇపుడు దేశంలో లోక్ సభ సీట్లు 545 ఉన్నాయి. దేశంలో 28 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత రాష్ట్రాలకు కూడా ప్రాతినిధ్యం ఉంది. అయితే ఇపుడున్న సంఖ్య ఏ మాత్రం సరిపోదు అంటున్నారు. మారిన కాలంతో పాటు పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎంపీ సీట్లు పెంచాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. చివరి సారిగా ఎంపీ సీట్లను 1977లో పెంచారని, ఆనాటికి దేశ జనాభా 55 కోట్లు మాత్రమే ఉందని అధికార లెక్కలు చెబుతున్నాయి. అంటే ఇపుడు దేశ జనాభా 130 కోట్లు అయింది. రెట్టింపు సీట్లు కూడా ఈ విధంగా వస్తాయని అంచనాలు వేస్తున్నారు.దేశంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవ‌డంతో పాటు, చరిత్రలో మరుగున పడిన వాటిని వెలికితీసి మరీ కొత్త చట్టాలను చేస్తున్న బీజేపీ లోక్ సభ సీట్లు పెంచే గొప్ప బాధ్యతను కూడా తలకెక్కించుకుంటుందా అన్న చర్చ సాగుతోంది. ఈ దేశంలో చిరకాలం పాటు అధికారంలో ఉండాలన్నది కమలనాధుల అజెండా. 
పార్లమెంట్ సభ్యులు రెట్టింపు అవుతారా...

అత్యుత్సాహంతో బీజేపీ నేతలు 2050 వరకూ తమ పార్టీయే పవర్లో ఉంటుందని ఆరు నెలల క్రితం చెప్పిన సంగతిని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే మరి కొన్ని దఫాలు బీజేపీ దేశాన్ని ఏలేలా పక్కాగా ప్లాన్ తెర వెనక రూపొందుతోందని కూడా అంటున్నారు.తాజాగా దేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లోక్ సభ సీట్ల పెంపుపై మాట్లాడారు. ఇండియా ఫౌండేషన్ తాజాగా నిర్వహించిన అటల్ బిహరీ వాజ్ పేయ్ స్మారక సదస్సులో ఆయన మాట్లాడుతూ 1971 జనాభా లెక్కల ప్రకారమే ఇంకా లోక్ సభ సీట్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇపుడు పెరిగిన జనాభా, ఓట్లర్లకు అనుగుణంగా వేయి సీట్లు చేసినా తప్పులేదని కూడా ప్రణబ్ పాలకులకు సూచించారు. అపుడే దేశంలో అందరి గొంతుక వినిపించే అవకాశం ఉంటుందని ఆయన అంటున్నారు.ప్రణబ్ ముఖర్జీ ఈ మాట అన్నా కూడా బీజేపీ మదిలో కూడా ఈ సంగతి ఎపుడో మెదిలిందని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఇపుడున్న పార్లమెంట్ భవనం సరిపోదని, కొత్తగా విశాలంగా భవనం నిర్మించాలని బీజేపీ ఆ మధ్య ప్రతిపాదించింది కూడా. అంటే కనీసం వేయి మంది వరకూ లోక్ సభ సభ్యులు కూర్చునేలా లోక్ సభ సామర్ధ్యాన్ని, దానికి అనుగుణంగ రాజ్యసభ సామర్ధ్యాన్ని పెంచేలా బీజేపీ ప్రతిపాదనలు సిధ్ధం చేసిందని అంటున్నారు. ఇంకా నాలుగున్నరేళ్ల మోడీ పాలన మిగిలి ఉంది. అందువల్ల ఇపుడున్న దూకుడుతో లోక్ సభ సీట్లు పెంచినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఆ విధంగా కూడా బీజేపీ తన అధికారాన్ని మరింతగా పదిలపరచుకునే అవకాశాలను గట్టిగానే పరిశీలిస్తుందని అంటున్నారు.

No comments:

Post a Comment