Breaking News

16/12/2019

పత్తిరైతుకు దొరకని సీసీఐ మద్దతు ధర

వరంగల్, డిసెంబర్ 16, (way2newstv.in )
వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. అడ్తి, ఖరీదు, మిల్లర్లు సిండికేట్‌గా మారి కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఐ ఇచ్చే మద్దతు ధరను రైతుకు దక్కనివ్వడం లేదు. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతన్నకు మార్కెట్‌లో నిరాశే మిగులుతున్నది. అడ్తి వ్యాపారులు రైతులతో బస్తాల్లో పత్తిని తెప్పించి క్వింటాల్‌కు రూ.3500 నుంచి రూ.5వేలలోపు కొనుగోలు చేస్తున్నారు. అదే సరుకును టాటా ఏస్‌ వాహనంలో లూజుగా నింపి సీసీఐకి అమ్మి మద్దతు ధరను పొందుతున్నారు. అలాగే లూజు వాహనాల్లో రైతులు తీసుకువచ్చిన పత్తిని సీసీఐ అధికారులు రిజక్ట్‌ చేయడంతో తక్కువ ధరలకే ప్రైవేట్‌ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. 
పత్తిరైతుకు దొరకని  సీసీఐ మద్దతు ధర

అదే సరుకును తమ పలుకుబడితో సీసీఐకి అమ్మి మద్దతు ధరను పొందుతున్నారు. మార్కెట్‌లో ప్రైవేట్‌ వ్యాపారులు కొనుగోలు చేసే ధరలకే గ్రామాల్లో దళారులు కొనుగోలు చేసి అడ్తి, ఖరీదు వ్యాపారులతో పాటు టీఎంసీ మిల్లుల యజమానులు ద్వారా అమ్ముతున్నట్లు బహిరంగంగానే ఆరోపణలు వస్తున్నాయి. మార్కెట్‌లో అడ్తి, ఖరీదు వ్యాపారులు సిండికేట్‌గా మారి పత్తి బస్తాలను తక్కువ ధరలకే కొనుగోలు చేస్తున్నట్లు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో రోజురోజుకూ దళారుల దందా పెరిగిపోతున్నది. సీసీఐ అధికారులు, మార్కెట్‌ కమిటీ అధికారులు ఒక్కటై ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ చుట్టు పక్కల 20కి పైగా మిర్చి కల్లాలు ఉన్నాయి. అవి కాస్తా ఇప్పుడు పత్తి కల్లాలుగా మారాయి. బస్తాల నుంచి పత్తిని తీసి లూజుగా వాహనాల్లో నింపేందుకు ఉపయోగపడుతున్నాయి. బస్తాలతో కొనుగోలు చేసిన పత్తిని ఒక్క రోజులోనే సీసీఐకి అమ్మి లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది.సీసీఐకి పత్తిని అమ్మాలంటే తప్పనిసరిగా పట్టాపాసు పుస్తకం కావాలి. కానీ మార్కెట్‌ పరిధిలో పత్తి బస్తాలను, వాహనాల్లోని లూజ్‌ పత్తిని సీసీఐ రిజక్ట్‌ చేస్తే తక్కువ ధరలకే ప్రైవేట్‌ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అలాగే సంబంధిత వ్యాపారులకు నమ్మకం కలిగిన రైతుల నుంచి పాసు పుస్తకాలతో పాటు బ్యాంక్‌ అకౌంట్‌ను అద్దెకు తీసుకుంటున్నారు. వెయ్యి రూపాయల నుంచి రూ.2 వేల వరకు అద్దె ఇచ్చి వాటిని తీసుకొని సీసీఐకి అందజేస్తున్నారు. ఏనుమాములలో పట్టా పాసు పుస్తకాలు అద్దెకు ఇవ్వడం పెద్ద వ్యాపారంగా మారింది.వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈ సీజన్‌ అక్టోబర్‌ నుంచి ఇప్పటి వరకు మార్కెట్‌లో ప్రైవేట్‌ వ్యాపారులు 3,68,136 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. సీసీఐ వారు మార్కెట్‌లో రెండు సెంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే 10 టీఎంసీ పత్తి మిల్లుల దగ్గర క్రయవిక్రయాలు జరిగేలా గుర్తించారు. నవంబర్‌ 1న సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1, 88,742 క్విటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తానికి ఈ సీజన్‌లో 5, 56,878 క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు వచ్చింది.

No comments:

Post a Comment