విజయవాడ, డిసెంబర్ 19, (way2newstv.in)
ఏపీ రాజధాని అమరావతి లో ఉండేది ఎవరు ? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు ప్రాంతాల్లో రాజధానుల ప్రకటన తరువాత టిడిపి వారికి వచ్చిన సందేహమే కాదు. అందరిలో ఇదే ప్రశ్న వెంటాడుతుంది. అమరావతిలో శాసనసభ మాత్రమే వుండబోతుందన్న సంకేతం తరువాత ఇక్కడికి వచ్చే వారు కేవలం శానసభ్యులు మాత్రమే. వారి పదవీకాలం కేవలం ఐదేళ్లే కావడంతో అమరావతిలో భూములు ప్లాట్ లు లేదా ఇతర వ్యవహారాలపై దృష్టి పెట్టేందుకు ఆస్కారం లేదు. సచివాలయం దాని అనుబంధ ఉద్యోగులు ఉత్తరాంధ్ర కేంద్రం విశాఖ వైపే చూస్తారనడంలో సందేహం లేదు. వారికి అమరావతితో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు వుండవు. ఇప్పుడు వున్న సాంకేతికత ఆధారంగా సచివాలయం విశాఖలో వున్న మరోచోట ఉన్నప్పటికీ క్షణాల్లో సమాచారం ఇంటర్నెట్ ద్వారా బట్వాడా అవుతుంది.
లబోదిబోమంటున్న బడా బాబులు
అమరావతి కేంద్రం గా రియల్ వ్యాపారం చేయాలని చూసిన టిడిపి నాయకులు, వారికి మద్దతుగా వెనుక వున్న పారిశ్రామిక వేత్తలు, బడాబాబుల పరిస్థితి ఇప్పుడు అయోమయంలో పూర్తిగా పడిపోయింది. నారాయణ, మురళి మోహన్ వంటివారు ఇప్పటికే కోట్లాది రూపాయలు వెంచర్స్ అమరావతి లో రాజధానికన్నా వేగంగా మొదలు పెట్టేశారు. వీరందరిని ఇప్పుడు చంద్రబాబు ఎలా సముదాయిస్తారన్నది వేచి చూడాలి. చంద్రబాబు ను నమ్మి హైదరాబాద్ లో వున్న విలువైన ఆస్తులు అమ్ముకుని కోట్ల రూపాయలను అమరావతిలో ధారపోస్తే ఇప్పుడు సగం ధరలకు సైతం కొనే నాథులు లేకుండా పోయారని ఇప్పటికే కొన్ని నెలలుగా వారంతా లబోదిబో మంటున్నారు. వీరిని ఓదార్చడానికి ఇప్పుడు టిడిపి మాజీ మంత్రులు, ఎమ్యెల్యేలకు ధైర్యం చాలడం లేదు. ఎందుకంటే వారిలో చాలామంది ఇప్పుడు అమరావతిని నమ్ముకుని పెట్టుబడులు పెట్టి దెబ్బతిన్నామని ఎవరికీ చెప్పుకోలేని బాధలో అల్లాడుతున్నారు.సింగపూర్ లాంటి రాజధాని అంటూ చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ అంటూ విలువైన భూములు ఇమ్మంటే ఇచ్చిన రైతులకు వైసీపీ సర్కార్ అసెంబ్లీలో చేసిన ప్రకటనలు పిడుగుపాటుకు గురిచేశాయి. చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించి ఐదేళ్ళు గ్రాఫిక్స్ చూపడం వల్లే ఇంతా జరిగిందని అదే నిర్మాణాలు పూర్తి చేసి ఉంటే జగన్ ప్రభుత్వానికి రాజధాని మార్చే ఆలోచనే చేయలేకపోదురని వాపోతున్నారు. అటు భూములకు పంటలు దక్కక అరచి గోల పెడితే తమకు రావాలిసిన బకాయిలు అడపాదడపా ఇస్తున్నారని రేపటి పరిస్థితి ఎలా వుండబోతుందో అని బెంగ పెట్టేసుకున్నారు. అయితే వీరికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం ముందుగానే ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. రాజధాని లో రైతుల నుంచి సేకరించిన భూమిని తిరిగి వారికి అప్పగించి అవసరాల మేరకు మాత్రమే ఉంచుకోవాలని భావిస్తున్నట్లు అంటున్నారు. మొత్తానికి జగన్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అమరావతి కేవలం శాసనసభకు మాత్రమే పరిమితం కాబోతుందని తేలడం ప్రకంపనలే సృష్టిస్తుంది.
No comments:
Post a Comment