Breaking News

23/12/2019

నిర్భయ నిందితుల ఉరికి అంతా సిద్ధం...

న్యూఢిల్లీ, డిసెంబర్ 23  (way2newstv.in)
నిర్భయ నిందితులకు డెత్‌ కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఇప్పుడప్పుడే అమలు కాకపోవచ్చునేమో కానీ ఉరి మాత్రం తప్పదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. డెత్‌ వారెంట్‌ ఇష్యూ పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు వచ్చేనెల 7వ తేదీకి వాయిదా వేసింది. ఇదంతా తెలిసిన సంగతే. అసలు డెత్‌ వారెంట్‌ ఎప్పుడు ఇష్యూ చేస్తారు.? అసలు కారాగారాల్లో నిందితులకు ఉరి ఎలా వేస్తారు? ఉరి తీసే రోజు ట్రయల్స్‌ ఎలా ఉంటాయ్‌? ఉరితాడు ఎలా నేస్తారు ఉరి ఎలా వేస్తారు.? ఇదిప్పుడు కచ్చితంగా చర్చించుకోవాల్సిన సందర్భమే. తెలుసుకోవాల్సి విషయమే.  నిర్భయ దోషులకి ఉరి ఖాయమైంది. ఉరి శిక్ష అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించే తీహార్ జైలు గదిని ఖరారు చేశారు. తీహార్ జైలులోని మూడో నంబరు జైలు గదిలో నిర్భయ దోషులను ఉరి తీయాలని నిర్ణయించారు. తీహార్‌ జైలులో మూడో నెంబరు గదిలో నిర్భయ నిందితులను ఉరి తీయనున్నారు. 
నిర్భయ నిందితుల ఉరికి అంతా సిద్ధం...

ఉరి తీసే గదిని ఎంపిక చేశారు. మూడో నంబరు తీహార్ జైలులో నిర్భయ నిందితుల ఊపిరి ఆగిపోనుంది. ఆ గది వద్ద 24 గంటల పాటు జైలుగార్డుల పహరా ఏర్పాటు చేశారు. హైసెక్యూరిటీ వార్డు అయిన ఫాన్సీ కోట లోపలకు ఎవరినీ అనుమతించట్లేదు. అత్యంత భద్రత నడుమ కొంతమంది హై సెక్యూరిటీ ఖైదీలుగా ఉన్న నలుగురు నిర్భయ నిందితులను ఈ వార్డులో ఉంచుతున్నారు. ఫాన్సీ కోట లోపలకు ప్రవేశాన్ని కొంతమంది జైలు అధికారులకే పరిమితం చేశారు. గతంలో ఉరిశిక్ష వేసిన కశ్మీర్ ప్రత్యేకవాద నాయకుడు మక్బూల్ భట్, పార్లమెంటుపై దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురులను తీహార్ జైలులోనే ఉరి వేసి ఇక్కడి ఫాన్సీ కోటలోనే పూడ్చిపెట్టారు. పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, ముఖేష్‌సింగ్‌ ఈ నలుగురు నిందితులను తీహార్‌ జైలు మూడో నెంబరు గదిలోనే ఉరి తీయనున్నారు. రాష్ట్రపతి నుంచి క్షమాభిక్ష తిరస్కరణ ఉత్తర్వులు రాగానే కోర్టు డెత్ వారంట్ జారీ చేస్తారు. తర్వాత నిర్భయ దోషులను ఉరి వేస్తారు. ప్రస్తుతం నలుగురు నిందితుల ఆరోగ్యం బాగానే ఉందని, వారిని రోజు వైద్యుడు పరీక్షిస్తున్నారని తీహార్‌ జైలు వర్గాలు చెప్పాయి. బీహార్‌‌లోని బక్సర్‌ జైలు నుంచి ఉరితాళ్లను తీసుకువస్తారు. ఉరికంబంపై శిక్ష అమలు ఎలా జరపాలో నలుగురు దోషుల బరువు, అంత ఎత్తున్న దిష్టిబొమ్మలకి ఉరి తీసి డమ్మీ ట్రయల్స్‌ వేసి చూస్తారు. దోషులందరినీ ప్రస్తుతం తీహార్‌ జైలు నంబర్‌ మూడులో వేర్వేరు గదుల్లో ఉంచి సీసీటీవీ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జైలు నంబర్‌ 3లోనే దోషులకి ఉరిశిక్ష అమలు చేయనున్నారు. అసలు ఉరి ఎలా తీస్తారు ఉరి శిక్ష విధించేటప్పుడు పాటించే పద్దతులు ఏంటో చూద్దాం. అక్షయ్‌, వినయ్‌, ముఖేష్‌ ఈ ముగ్గురు నిందితులు గత ఏడేళ్ల నుంచి తీహార్‌ జైలులోనే ఉన్నారు. మరో నిందితుడు పవన్‌కుమార్‌ గుప్తా మండోలి జైలులో ఉన్నారు. ఇటీవలే మండోలి జైలు నుంచి పవన్‌‌కుమార్‌ను తీహార్‌ జైలుకి తరలించారు. ముఖేష్‌ సింగ్, అక్షయ్‌ సింగ్, వినయ్‌ శర్మను ఉంచిన జైలు నెంబర్ ‌3లో పవన్‌ కుమార్‌ గుప్తాను కూడా ఉంచారు జైలు అధికారులు. ఉరిశిక్ష అమలు చేసేటప్పుడు పాటించే పద్దతులు చాలానే ఉంటాయ్‌. నిందితులను ఎవరు ఉరి తీస్తారు. ఎలా తీస్తారన్న విషయాలు ఆసక్తికరంగానే ఉంటాయి. ఉరి శిక్షే అమలు అనేది చాలా అరుదైన ఘటన. ఇలాంటివి చాలా జాగ్రత్తగా అమలు చేస్తుంటారు. ఉరి శిక్ష పడ్డ ఖైదీ విషయంలో దాన్ని అమలు చేసే రోజు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. జైలు నిబంధనల ప్రకారం, ఖైదీని ఉదయం 4 గంటలకే నిద్రలేపుతారు. మేల్కొలిపిన 10 నిమిషాల తర్వాత స్నానం చేయాలని చెబుతారు. స్నానం చేశాక కొత్త బట్టలు ఇస్తారు. వాటిని ధరించాలని కోరుతారు. ఇది సంప్రదాయం. ఆ తర్వాత ఎస్పీ, డీఎస్పీ, ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌, వైద్యాధికారి నలుగరూ కలిసి ఖైదీ ఉన్న సెల్‌ వద్దకు చేరుకుంటారు. ఏ కారణంతో ఉరి తీస్తున్నారో తెలిపే వారంట్‌ను ఖైదీకి చదివి వినిపిస్తారు. మేల్కొన్న 20 నిమిషాలకు అల్పాహారం అందజేస్తారు. తర్వాత టీ ఇస్తారు. ఉరి శిక్ష పడ్డ వారు అడిగినవి జైలు క్యాంటీన్‌లో దొరకకపోతే ఆఖరు కోరికను తీర్చేందుకు బయటి నుంచి తెప్పిస్తారు. అల్పాహారం అనంతరం ఏదైనా మతపరమైన పుస్తకాన్ని చదువుకోవాలని చెబుతారు. లేదా ప్రార్థన చేసేందుకైనా అనుమతిస్తారు. ఆ తర్వాత ఉరికంబం వద్దకు ఖైదీని తీసుకొస్తారు. ఉరికంబం ఎక్కించి ముఖంపై కాటన్‌తో తయారుచేసిన తొడుగును కప్పుతారు. మేజిస్ట్రేట్ సంకేతం ఇవ్వగానే ఖైదీ కాళ్ల కింద ఉన్న తలుపులు తెరుచుకునేలా తలారి లీవర్‌ను లాగుతాడు. ఉరితాడు బిగిసిన తర్వాత అరగంట సేపటి దాకా అలాగే ఉంచుతారు. ఖైదీ మరణించినట్టు వైద్యాధికారి ధ్రువీకరించాక, ఆ విషయాన్ని హోంశాఖ అధికారులకు తెలియజేస్తారు. ఉరికంబం పొడవు 15 ఫీట్లు, వెడల్పు 10 ఫీట్లు ఉంటుంది. ఇక్కడో విషయం గురించి మాట్లాడుకోవాలి. ఉరి తీసిన తలారికి కూడా చివరి నిమిషం దాకా ఎవరిని ఉరి తీస్తున్నారో చెప్పరు. ఒక టెర్రరిస్టును ఉరితీయాలని మాత్రం చెబుతారు. ఉరికంబానికి అతణ్ని తీసుకొచ్చే ముందు మాత్రమే తలారికి అసలు నిజం వివరిస్తారు. ఇది ఉరి శిక్షను అమలు చేసే కారాగారం సంప్రదాయం. భారత్‌లో చాలా అరుదైన కేసుల్లోనే దోషులకు ఉరిశిక్షలు పడుతుంటాయి. అంతే అరుదుగా, ఆ శిక్షలు అమలు చేసేందుకు ఉపయోగించే తాడు కూడా దేశంలో ఒక్క చోటే లభిస్తుంది. అదే బీహార్‌లోని బక్సర్ సెంట్రల్ జైలు. గాంధీ హంతకుడు గాడ్సే నుంచి పార్లమెంట్‌పై దాడి కేసులో దోషిగా తేలిన యాకుబ్‌ మెమెన్‌ వరకూ భారత్‌లో ఉరిశిక్షను ఎదుర్కొన్న ఖైదీల చుట్టూ బక్సర్ ఉరితాడే బిగుసుకుంది. బక్సర్‌ ఉరితాళ్లు నేసే కారాగారం. ఎక్కడ ఎవరికి ఉరి వేయాలన్నా తాళ్లు బక్సర్‌ నుంచే తీసుకెళ్లాలి. తాజాగా నిర్భయ నిందితుల కోసం ఉరితాళ్లు చేయించాలని బక్సర్ జైలు అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో ఈ జైలు మరోసారి వార్తల్లోకెక్కింది. అయితే, ఉరిశిక్షల కోసం బక్సర్‌ తాడునే ఎందుకు వాడుతున్నారు? వేరే చోట్ల అది ఎందుకు తయారుకావడం లేదు? ఈ ప్రశ్నకు కూడా సమాధానం ఉంది. భారత ఫ్యాక్టరీ చట్టం ప్రకారం ఉరి తాళ్ల తయారీపై దేశంలో నిషేధం ఉంది. ఒక్క బక్సర్ సెంట్రల్ జైలుకు మాత్రమే దాని నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ నిషేధం బ్రిటీష్ కాలం నుంచి కొనసాగుతోంది. ఉరితాళ్ల తయారీకి అవసరమైన యంత్రం దేశంలో ఒక్క బక్సర్‌లో మాత్రమే ఉండటం విశేషం. ఉరి తీసేందుకు ఉపయోగించే తాడు చాలా మృదువుగా ఉంటుంది. ఇందుకోసం చాలా మృదువైన నూలును వాడాల్సి ఉంటుంది. బక్సర్ జైలు గంగా నది ఒడ్డున ఉంది కాబట్టి ఇక్కడ ఆ యంత్రం పెట్టి ఉంటారన్నది జైలు అధికారుల అభిప్రాయం. అయితే, ఇప్పుడు నూలును మృదువుగా మార్చే అవసరం లేకుండా పోయింది. రెడీమేడ్‌గా ఉన్న నూలు వస్తున్నా బక్సర్ ‌సంప్రదాయం మాత్రం కొనసాగుతుంది. బక్సర్ జైలు ఇచ్చిన సమాచారం ప్రకారం చివరగా 2016లో పటియాలా జైలుకు ఉరితాడును పంపించారు. భారత్‌లో ఆఖరిగా ఉరిశిక్ష అమలైంది 2015లో. ముంబయి బాంబు పేలుళ్ల కేసులో దోషి యాకుబ్ మెమెన్‌కు ఈ శిక్షను అమలు చేశారు. అందుకు ఉరితాడు బక్సర్ నుంచే వెళ్లింది. బక్సర్‌లో ఉరితాళ్ల తయారీ కోసం నలుగురు సిబ్బంది ఉన్నారు. అయితే, వీళ్లు నేరుగా తాళ్లను తయారుచేయరు. ఉరితాళ్లను ఇక్కడి ఖైదీలే తయారు చేస్తారు. ఆ సిబ్బంది వారికి శిక్షణ ఇస్తారు. సూచనలు చేస్తారు. ఈ పని ఓ సంప్రదాయంలా మారింది. పాత ఖైదీల నుంచి కొత్త ఖైదీలు దాన్ని నేర్చుకుంటుంటారు. ఉరితాడు తయారీ కోసం జే34 అనే నూలును వాడతారు. 'తాడును చేయడం ఎక్కువగా చేత్తో చేసే పనే. దారాలను తాడులా అల్లేందుకు మాత్రమే యంత్రం పనిచేస్తుంది. మొదట 154 నూలు దారపు పోగులుండే ఉండలను తయారు చేస్తారు. ఇలాంటివి ఆరు ఉపయోగించి 16 అడుగల పొడవుండే తాడును అల్లుతారు. తాడును మృదువుగా, మెత్తగా మార్చడమే ఫినిషింగ్. ఉరి తాడు వల్ల ఎలాంటి గాయాలూ కాకూడదని, కేవలం ప్రాణం మాత్రమే పోవాలని నియమనిబంధనలు ఉన్నాయి. అందుకే ఫినిషింగ్ చాలా కీలకం. పాటియాలాకు పంపినప్పుడు ఉరి తాడు ధర 1725. కానీ, ఇప్పుడు ముడి వస్తువుల ధరలు పెరిగాయి. తాడు మెడ చుట్టూ బిగుసుకునేందుకు ఉపయోగించే ఇత్తడి బుష్ ధర కూడా పెరిగింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం ఉరితాడు ధరను 2120గా నిర్ణయించారు బక్సర్‌జైలు అధికారులు. ఉరి శిక్ష అమలులో మొదటగా వినిపించే పేరు తీహార్‌. వాస్తవానికి ఈ జైలుకు పెద్ద చరిత్రే ఉంది. ఈ కారాగారం ఎంతో మంది ప్రముఖులకు ఆశ్రయమిచ్చింది. కిరణ్‌బేడీ సంస్కరణకు బీజం వేసి తీహార్‌ ఆశ్రమంగా పేరుగాంచింది. తీహార్‌ జైలు కథను ఒకసారి చూద్దాం. ఢిల్లీ పరిసరాలలో ఉన్న చాణక్యపురి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో తీహార్‌ గ్రామంలో ఈ జైలు ఉంది. అందుకే తీహార్‌ జైలు అని అంటుంటారు. తీహార్ జైలు, దక్షిణ ఆసియా లోనే అతి పెద్ద కారాగారం. 1957లో ప్రారంభమైన తీహార్‌ జైలులో 6251 మంది సరిపోయే వసతులున్నాయి. కాని ఈ జైలు ఎప్పుడూ అంతకన్న ఎక్కువమందికే ఆశ్రమిస్తూ వస్తోంది. ఎందరో రాజకీయ వేత్తలు, పారిశ్రామిక వేత్తలు, హంతకులు, ఉగ్రవాదులు, ఉద్యమ నాయకులు ఎందరో ఈ జైలులో ఉన్నారు. కొందరిని ఇక్కడే ఉరి తీశారు. పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన కీలక నిందితుడు అఫ్జల్‌ గురును కూడా ఇక్కడే ఉరితీశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో కేహార్‌ సింగ్‌, సత్వంత్‌ సింగ్‌లను ఈ జైలులోనే ఉరి తీశారు. 1986 మార్చి 16న క్రిమినల్‌ చార్లెస్‌ శోభరాజ్‌ ఈ జైలు నుంచి తప్పించుకున్నాడు. మళ్లీ దొరికిపోయాడు. అప్పటికే పడిన శిక్షతో పాటు పారిపోయినందుకు మరో పదేళ్లు అదనపు శిక్ష పడింది. డీఎంకే నాయకులు ఎ.రాజా, ఎం.కె.కనిమొళి, వినోద్‌ గోయంకా, షాహిద్‌ బల్వా, సంజయ్‌చంద్రాలను 2జీ కేసులో అరెస్టు చేసి ఇదే జైలులో ఉంచారు. ఒలంపిక్స్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి సురేష్‌ కల్మాడీని 2010లో జరిగిన కామన్‌ వెల్త్‌ గేమ్స్‌లో అవినీతి ఆరోపణల కారణంగా అరెస్టు చేసి ఇక్కడికి తరలించారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మాన సమయంలో డబ్బు ఎర చూపి ఎంపిలను ప్రభావితం చేసిన ఆరోపణలపై సమాజ్‌ వాదీ పార్టీ మాజీ సభ్యుడు అమర్‌సింగ్‌ ఇదే జైలులో ఉండాల్సి వచ్చింది. తాము కోరిన విధంగా లోక్‌పాల్‌ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలంటూ ఆందోళన చేసిన అన్నా హజారే, అరవింద్‌ కేజ్రీవాల్‌లను అరెస్టు చేసి ఇక్కడే ఉంచారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతలా, అతని కుమారుడు అజయ్‌ చౌతలాలను అవినీతి కేసులో అరెస్టు చేసి ఈ జైలులోనే ఉంచారు. తీహార్‌ జైలులో 16 డెత్‌ సెల్స్‌ ఉన్నాయి. ఇక్కడ మొదటగా ఉరికంబం ఎక్కింది గాంధీ హంతకుడు నాథూరామ్‌ గాడ్సే. చివరగా అంటే 2015లో ముంబయి వరుస పేలుళ్ళ ఘటనలో శిక్ష పడ్డ యాకూబ్ మెమన్‌ను ఉరి తీసింది కూడా తీహార్‌లోనే. ఇప్పుడు నిర్భయ నిందితులు నలుగురికి కూడా తీహార్‌లో ఊపిరి ఆగిపోనుంది.

No comments:

Post a Comment