Breaking News

07/12/2019

తెలంగాణపై ఆర్థిక మాంద్య ప్రభావం

1000 కోట్లు పైగా తగ్గనున్న ఇన్ కమ్
హైద్రాబాద్, డిసెంబర్ 7 (way2newstv.in)
తెలంగాణను సైతం ఆర్థిక మాంద్యం కాటేసింది. ఇలా జరగడం గత ఐదేళ్ళలో ఇదే మొదటిసారి. రాష్ట్ర ప్రభుత్వ వార్షిక ఆదాయానికి ఈ అక్టోబర్ నాటికి ఒక్కసారిగా 838 కోట్ల రూపాయల మేరకు గండి పడింది. అది నెగెటివ్ గ్రోత్ ను సూచిస్తోంది. గత ఏడాది మొత్తం టాక్స్ రెవెన్యూ 44,615 కోట్ల రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఏటా 20 శాతం దాకా పెరుగుతూ వచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది కూడా 15 వేల కోట్ల నుంచి 20 వేల కోట్ల రూపాయల దాకా అదనపు ఆదాయం రాగలదని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. అందుకు భిన్నంగా ఈ ఏడాది అక్టోబర్ వరకు వచ్చిన ఆదాయం 43 వేల 777 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే గత ఏడాది ఇదే కాలానికి పోలిస్తే 838 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. 
తెలంగాణపై ఆర్థిక మాంద్య ప్రభావం

ఆదాయానికి గండి పడితే ఆ మేరకు ఖర్చులకూ కోత తప్పదు. అసలు ఇలా ఎందుకు జరిగిందో కూడా చూద్దాం. మనకు బాగా ఆదాయం వస్తోంది ఎన్ని పథకాలైనా చేపడుతాం ఎంత ఖర్చయినా భరిస్తాం ఓ ఐదున్నరేళ్ళుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవే మాటలు అంటున్నారు. నిజం చెప్పాలంటే తెలంగాణ సొంత వనరుల ఆదాయంలో అభివృద్ధి రేటు కూడా కేసీఆర్ మాటలకు తగినట్లుగానే ఉండింది. 21 శాతం వృద్ధి రేటు అంటే మాటలు కాదు. ఇప్పుడు మాత్రం పరిస్థితిలో కొంత మార్పు వచ్చినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కు తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ఓ ఆర్థిక నివేదిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రమాద ఘంటికలను మోగించింది. 2019 అక్టోబర్ వరకు పరిస్థితిని చూస్తే పన్ను ఆదాయంలో 838 కోట్ల రూపాయల మేరకు ఆదాయం తగ్గిందని ప్రభుత్వం చెప్పింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రతికూల వృద్ధికి సూచిక. ప్రమాద ఘంటికలు ఎందుకు మోగాయో తెలుసుకునేందుకు ముందుగా అసలు రాష్ట్రప్రభుత్వ ఆదాయం ఎలా తగ్గిపోయిందో చూద్దాం.తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న ఆదాయ వనరుల్లో జీఎస్టీ, సెంట్రల్ టాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సేల్స్ టాక్స్ కూడా ముఖ్యమైనవే. వీటిలో జీఎస్టీ నుంచి, సెంట్రల్ టాక్స్ నుంచి వచ్చే ఆదాయాల్లో తగ్గుదల కనిపిస్తోంది. గత ఏడాది అక్టోబర్ లో జీఎస్టీ నుంచి 16 వేల 429 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ కు అది 14 వేల 097 కోట్ల రూపాయలకు పడిపోయింది. సెంట్రల్ టాక్స్ గత ఏడాది అక్టోబర్ లో 8 వేల 578 కోట్ల రూపాయలు కాగా ఈ అక్టోబర్ కు అది 6 వేల 404 కోట్ల రూపాయలకు తగ్గిపోయింది. సెప్టెంబర్, అక్టోబర్ లలో తెలంగాణ ప్రభుత్వ ఆదాయాలు గణనీయంగా తగ్గినట్లు చెబుతున్నారు. గత ఏడాది అక్టోబర్ నాటికి ఈ మొత్తం 44 వేల 615 కోట్ల రూపాయలుగా ఉండింది. ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి పన్ను ఆదాయం 43 వేల 777 కోట్ల రూపాయలుగా ఉంది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఊరట కలిగించే అంశాలు కూడా ఉన్నాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సేల్స్ టాక్స్ ఆదాయాల్లో మాత్రం కొంతమేర పెరుగుదల కనిపించింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే 2018 అక్టోబర్ నాటికి ఆ మొత్తం 3, 127 కోట్ల రూపాయలు గా ఉండింది. 2019 అక్టోబర్ నాటికి అది 3,716 కోట్ల రూపాయలకు పెరిగింది. సేల్స్ టాక్స్ విషయానికి వస్తే అది 2018 అక్టోబర్ నాటికి 6,019 కోట్లుగా ఉండింది. తాజాగా ఈ ఏడాది అక్టోబర్ నాటికి అది 6,176 కోట్లకు పెరిగింది. ఈ రెండు చోట్ల పెరిగిన మొత్తంతో చూస్తే మరో రెండు చోట్ల తగ్గిన మొత్తమే ఎక్కువగా ఉంది. మొత్తం మీద 800 కోట్లరూపాయలకు పైగా ఆదాయం తగ్గిపోయింది. నిజం చెప్పాలంటే ఆదాయం పెంచుకునే అవకాశం ఆదాయం పెరిగే అవకాశం ఇంకా ఉన్నాయి. హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ పరంగా దూసుకెళ్తోంది. ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా పెద్ద సమస్యగా మారకపోవచ్చు. ఆర్థిక కార్యకలాపాలు పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. కాకపోతే అన్ని రోజులూ ఒక్కలా ఉండవు. ఆర్థిక మాంద్యం ప్రభావం ప్రభుత్వ ఆదాయంపై పడే అవకాశం ఉంది. ఇప్పటికే రైతుబంధు లాంటి పథకాల అమలులో తీవ్రజాప్యం చోటు చేసుకుంటున్నది. మరో వైపున ప్రభుత్వం సంక్షేమ పథకాలకు, ఇతరత్రా గా కూడా భారీస్థాయిలో నిధులు వెచ్చిస్తోంది. కొన్నాళ్ళ పాటు అప్పులు తేలిగ్గా పుట్టినా ఆ తరువాత అప్పులు తీసుకురావడం కష్టం అవుతుంది. అంతేగాకుండా వడ్డీలకే అధిక మొత్తాలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే ఇప్పటికైనా కొత్త పథకాలు ప్రవేశపెట్టడాన్ని తగ్గించి, ఉన్న పథకాలనే సరిగా అమలు చేస్తే చాలనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇటీవల ఆర్టీసీ సమ్మె సందర్భంలోనే కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం సాధ్యం కాదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందుకు వీలు కల్పించదని కూడా అన్నారు. సమ్మెపై మొదట కఠినంగా వ్యవహరించినప్పటికీ చివర్లో మాత్రం కనికరించారు. ఆ విషయాన్ని పక్కనబెడితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో తగ్గుదలను నిలువరించేందుకు సీఎం కేసీఆర్ ఏం మంత్రం వేస్తారో చూడాల్సిందే.

No comments:

Post a Comment