Breaking News

07/12/2019

ఏపీలో కుల, మత రాజకీయాలు

విజయవాడ, డిసెంబర్ 7, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్‌‌లో రాజకీయ వ్యూహప్రతివ్యూహాలు గతానికంటే భిన్నంగా సాగుతున్నాయి. ఎన్నికలై ఆరునెలలే గడిచినా, అధికార, విపక్షాలు రకరకాల ఎత్తుగడలతో ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ఒకవైపు కేవలం సంక్షేమమే లక్ష్యంగా, అట్టడుగువర్గాల్లోనూ బలమైన పునాది వేసుకునేందుకు, సీఎం జగన్‌ రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్‌ను ప్రారంభిస్తుండగా, విపక్షాలు మాత్రం జగన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, ఆయన కులం, మతంపై ఒక స్ట్రాటజిక్‌గా చర్చను లేవనెత్తుతున్నాయన్న డిస్కషన్ జరుగుతోంది గుంటూరు మెడికల్ కాలేజీ జింఖానా ఆడిటోరియంలో వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభిస్తూ, భావోద్వేగంగా మాట్లాడారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. 
ఏపీలో కుల, మత రాజకీయాలు

కొన్నాళ్లుగా తన మతం, కులంపై కొందరు మాట్లాడుతున్నారని, అలా మాట్లాడటం తనకెంతో బాధ కలిగిస్తోందన్నారు. తన మతం మానవత్వం, తన కులం మాట నిలబెట్టుకోవడం అంటూ ప్రసంగించారు. కొంతకాలంగా సీఎం జగన్‌ కులం, మతంపై కామెంట్లు చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, తిరుపతిలో జరిగిన సమావేశంలో మరింత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మతం మార్చుకున్న జగన్ కులాన్ని ఎందుకు వదలటం లేదని ప్రశ్నించారు పవన్. మతం మార్చుకుంటే ఇక కులం ఉండకూడదన్నారు. జగన్ క్రిస్టియన్ అయితే ఏసులో ఉన్న సహనం, క్షమ గుణాలు ఆయనలో ఎక్కడ ఉన్నాయి? అని ప్రశ్నించారు. జగన్‌కు ఓట్ల కోసం కులం, మతం, డబ్బు కావాలని మాట్లాడారు పవన్ కల్యాణ్. ఏడుకొండలు మినహా అంతటా వైసీపీ రంగులే వేస్తున్నారని ప్రభుత్వ తీరుపై పవన్ ఫైర్ అయ్యారు. జగన్‌పై మతం కోణంలో పవన్ విమర్శలు వ్యూహాత్మకమా? ఒక వర్గానికే పరిమితం చెయ్యాలని జనసేన అధినేత స్ట్రాటజీనా? అదేపనిగా కులం, మతం విమర్శలు చేయడంలో ఆలోచనేంటి? పవన్‌ కల్యాణ్‌ ఈమధ్య, జగన్‌ను జగన్‌ రెడ్డి అంటున్నారు. ట్విట్టర్‌లో అయితే జగన్‌ రెడ్డి అంటూ కోట్స్‌లో పేరు పెడుతున్నారు. తనను పవన్‌ నాయుడు అంటున్నందుకే, ఎదురుదాడిగా జగన్‌ రెడ్డి అంటున్నారా లేదంటే జాతీయ మీడియాలో జగన్‌ను, జగన్‌ రెడ్డి అంటున్నందుకా అన్నది చర్చనీయాంశమైంది. ఎప్పుడూలేనిది జగన్‌ రెడ్డి అనడంలో ఉద్దేశమేంటన్నది ఎవరికీ బోధపడ్డంలేదు. ఒకవైపు జగన్ రెడ్డి అంటూ కులాన్ని, మరోవైపు క్రిస్టియన్‌ కాబట్టి కులం ఎందుకు అనడం, తిరుమలలో వెంకన్నను దర్శించుకుంటే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు అంటూ టార్గెట్ చేయడం, వంటి మాటలు ఈమధ్య పవన్‌ నోటి నుంచి వస్తున్నాయి. ఇదంతా వ్యూహాత్మకంగానే మాట్లాడుతున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఉత్తరాదిలో బీజేపీ అనుసరించే హిందూత్వ అజెండా తరహాలో ఇలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతున్నారా ఓటర్లలో చీలిక తెచ్చే ప్రయత్నమా జగన్‌ను కొందరివాడినే చేసే ఎత్తుగడ వేశారా అన్నది, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా, పవన్‌ కూడా కొన్ని వర్గాలకు దూరం కావడం ఖాయమన్న విశ్లేషణలూ సాగుతున్నాయి. జగన్‌ కులం, మతంపై పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కూడా ఘాటుగానే స్పందించారు. జగన్‌కు కులం, మతం అంటూ ఏదీలేదని, అందరివాడని వ్యాఖ్యానించారు. మొత్తానికి ఏపీలో రాజకీయాలు మతం చుట్టూ తిరుగుతున్నాయి. అటు టీడీపీ, బీజేపీకి తోడు జనసేన కూడా, అదేపనిగా మత ప్రస్తావన తెస్తోంది. తిరుమల క్యాలెండర్ వివాదాలు, గుళ్లకు వైసీపీ రంగుల వ్యవహారం, టీటీడీ వెబ్‌సైట్లో యేసయ్య పాటల కాంట్రావర్సీ, ఇలా మతానికి సంబంధించి దొరికిన ఏ ఆయుధాన్ని వదలకుండా గట్టిగానే సంధిస్తున్నారు విపక్ష నేతలు. పవన్‌ కల్యాణ్ మరింత ఘాటుగా జగన్‌ మతం, కులంపై కామెంట్లు చేస్తూ కాక రేపుతున్నారు. మరి పవన్‌ ఒక మెజారిటీ వర్గం ఓట్లను ఆకర్షించేందుకే ఇలాంటి ఎత్తుగడ ఎంచుకున్నారా లేదంటే యథాలాపంగా మాట్లాడుతున్నారా అన్నవాటిపై చర్చ జరుగుతోంది. అయితే నిజంగా పవన్ వ్యూహాత్మకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, ఈ వ్యూహం పవన్‌కు మేలు చేస్తుందా మైనస్‌గా మారుతుందా జనం ఎలా ఆలోచిస్తారన్నది అన్నది కాలమే సమాధానం చెప్పాలి.

No comments:

Post a Comment