హైద్రాబాద్, డిసెంబర్ 12, (way2newstv.in)
సంప్రదాయ బోధనా పద్ధతులకు భిన్నంగా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందిస్తూ, వారిలో బోధన, గ్రహణ, పఠన నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ స్వేచ్ఛా పాఠశాలల (ఫ్రీడం స్కూళ్లు) విధానం తీసుకువచ్చింది. స్వేచ్ఛా పాఠశాలల్లో పరీక్షల విధానం, కార్యాచరణ అంతా విద్యార్థుల అభీష్టం మేరకు నడుస్తోంది. దీంతో ఈ విధానంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షంవ్యక్తం చేస్తున్నారు.ఉదయం ప్రార్థనతో విద్యార్థులకు సేచ్ఛ ప్రారంభం అవుతుంది. మాడ్యూల్స్‌లోని అంశాలపై విద్యార్థులు పరస్పరం వేర్వేరుగా, బృందాలుగా చర్చలు జరుపుకోవడంతోపాటు లోతుగా పరిశీలించడం చేస్తుంటారు. సాధారణ పాఠశాలల్లో నిర్వహించే పరీక్షలు ఈ పాఠశాలల్లో కానరావు. పరీక్షల్లో విద్యార్థులు పెన్ను, పేపర్లను వినియోగించరు.
గురుకుల పాఠశాలల్లో ఫ్రీడమ్ ఎడ్యుకేషన్
స్కిట్, డిబేట్స్, క్విజ్, డ్రామా లాంటి అంశాలతో విద్యార్థులకు మార్కులు కేటాయిస్తారు. స్వేచ్ఛా పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠాలు బోధించరు. సలహాదారులుగా మాత్రమే ఉంటారు. తరగతిగదుల్లో చదువుకోవాలనే నిబంధనలేమీ ఉండవు. పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తాయనే భయం ఉండదు. విద్యార్థుల ప్రతిభను బట్టి మార్కులు వేస్తుంటారు. ఈ పాఠశాలల్లో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుడు అంటే విద్యార్థులకు భయం ఉండదు. ఆటలు ఆడుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు. అంతా విద్యార్థుల ఇష్టం. ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య ఆప్యాయత పెంపొందించేందుకు వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతుంటారు. వీటి ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకరికొకరు కరచాలనం, ఆలింగనం చేసుకుంటారు. దీంతో పిల్లల్లో భయం పోయి ఉపాధ్యాయులతో ఆత్మీయంగా ఉంటారు.రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 23 గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వం సేచ్ఛా పాఠశాలల విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. సొసైటీ క్రమక్రమంగా వాటిని మెరుగుపరిచేందుకు సరికొత్త కార్యాచరణను రూపొందిస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
No comments:
Post a Comment