ఏలూరు, డిసెంబర్ 11, (way2newstv.in)
రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ విషయంలో కొందరు మేధావులు చర్చ సాగిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గిల్లారని, వారికి ఇష్టంలేని అధికారిని ఏపీలోని తన ప్రభుత్వంలో కీలక పోస్టులో నియమించుకున్నారని, అదే సమయంలో బీజేపీకి చెందిన కీలక నాయకుడు గోకరాజు గంగరాజు కుటుంబాన్ని జగన్ తన పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో బీజేపీతో ముఖ్యంగా కేంద్రంలో నెంబర్-2గా ఉన్న అమిత్ షాతోనే జగన్ పోరుకు తలపడ్డారని కొన్ని జగన్ వ్యతిరేక మీడియాల్లో కథనాలు వచ్చాయి.దీంతో ఈ విషయంలో అసలు లోతుపాతులు ఏంటి? సదరు కథనాల్లో నిజం ఎంత అనే చర్చ సాగుతోంది. వాస్తవానికి రాష్ట్రం ఇంటిలిజెన్స్ చీఫ్ పోస్టు విషయం కొన్నాళ్ల కిందట ఆసక్తిగామారింది.
వైసీపీ, బీజేపీ మధ్య పెరుగుతున్నదూరము.?
ఈ పోస్టు సీఎం కు అత్యంత దగ్గరగా ఉండే పోస్టు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పూసగుచ్చినట్టు తెలుసుకుని సీఎం చెవిన వేయడంలో ఈ పోస్టు కీలకం. అలాంటి దానికి మొదట స్టీఫెన్ రవీంద్రను సెలక్ట్ చేయాలని అనుకున్నారు. అయితే, ఆయన ఏపీకి వచ్చేందుకు సిద్ధమైనా.. అనివార్య కారణాల నేపథ్యంలో కేంద్రం నుంచి సంకేతాలు రాలేదు. దీంతో మనీష్ సిన్హాను జగన్ నియమించుకున్నారు.అది కూడా కేంద్రం నుంచి ఆయనను ఏపీ కేడర్‌కు బదిలీ చేసిన నేపథ్యంలో జగన్ విచక్షణ మేరకు మనీష్‌ను నియమించుకున్నారు. ఈ విషయాన్ని జగన్ వ్యతిరేక మీడియా కూడా చెప్పింది. మరి అలాంటి పోస్టులో మనీష్‌ను నియమించడం వల్ల కేంద్రంలోని బీజేపీకి కానీ, అమిత్ షాకు కానీ వచ్చిన నష్టమేంటో.. వారికి వచ్చిన ఇగో ప్రాబ్లం ఏంటో చెప్పలేదు. ఒక వైపు సీఎం విచక్షణ అంటూనే మనీష్ నియామకంతో కేంద్రంతో జగన్ ఢీ అంటే ఢీ అంటున్నారని జగన్ వ్యతిరేక మీడియా పసలేని కథనాలు రాసేసింది.వాస్తవానికి పశ్చిమ బెంగాల్ లోని కల్‌కత్తా ఎస్పీని శారదా కుంభకోణం సమయంలో అక్కడి ప్రభుత్వం వెనుకేసుకు వచ్చినప్పుడు కూడా కేంద్రం ప్రభుత్వం ఏమీ చేయలేక పోయింది. నిప్పు-ఉప్పుగా ఉన్న మమతా బెనర్జీనే ఏమీ చేయలేని కేంద్రం ఇప్పుడు ఏపీని ఏదో చేసేస్తుందని, అది జగన్ వల్లేనని ఈ కథనంలో వ్యతిరేక మీడియా వండి వార్చింది. ఇక, గంగరాజు ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఆయన బీజేపీలోనే ఉన్నారు. ఆయన తమ్ముళ్లు, సోదరులు, కుమారుడు వచ్చి వైసీపీలో చేరారు. ఇది ఎప్పుడో అనుకున్నదేనని వారు స్వయంగా చెప్పారు. ఎన్నికలకు ముందుగానే తాము వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని అనుకున్నామని రామరాజు చెప్పుకొచ్చారు.అయినా కూడా దీనిని కూడా బీజేపీ బోడిగుండుకు, జగన్ మోకాలికి ముడిపెట్టి రాసేశారు. ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు కూడా జగన్‌పై ఈ వ్యతిరేక మీడియా కొన్ని కథనాలను ప్రచారం చేసిన విషయం గుర్తుకు వస్తోంది. ఆయన కేసీఆర్‌తో జట్టు కట్టాడని, దీంతో ఏపీ భవిష్యత్తు ఇక అంధకారం అయిపోతుందని కూడా ఈ మీడియా కన్నీరు పెట్టుకుంది. చంద్రబాబు ఒక్కరే కేసీఆర్‌పైనా, జగన్‌పైనా అటు బీజేపీపైనా పోరుడుతున్నారని, ఒక్కరిని చేసి ఇంతమంది ఆడేసుకుంటున్నారంటూ .. శోకణ్ణాలు పెట్టింది. మరి తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా అంతే.. ఏదో మైండ్ గేమ్ అంటే .. రాజకీయ నాయకులకే అలవాటు అనుకుంటే.. ఇప్పుడు ఓ వర్గంమీడియాలోనూ సాగుతోందనే విషయం స్పష్టమవుతోందని అంటున్నారు పరిశీలకులు.
No comments:
Post a Comment