Breaking News

10/12/2019

కష్టపడ్డారు... అనుకున్నది సాధించారు

బెంగళూర్, డిసెంబర్ 10(way2newstv.in)
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తాను అనుకున్న గోల్ కొట్టేశారు. ఒంటిచేత్తో పార్టీని విజయతీరాలకు తీసుకెళ్లారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా యడ్యూరప్ప మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళ్లారు. తాను అనుకున్న ప్రకారమే రిజల్ట్ తెచ్చుకున్నారు. కర్ణాటకలో పదిహేను అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పన్నెండు స్థానాల్లో విజయం సాధించింది. దీంతో కర్ణాటకలో యడ్యూరప్ప సర్కార్ కు ఇక ఎదురులేకుండా పోయింది.యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి నాలుగు నెలలు అవుతుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారంటే అందుకు కారణం కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలే. పదిహేడు మంది రాజీనామా చేయడంతోనే యడ్యూరప్ప ముఖ్యమంత్రి కాగలిగారు. 
కష్టపడ్డారు... అనుకున్నది సాధించారు

అప్పటి స్పీకర్ వారిపై అనర్హత వేటు వేసి, 2023వరకూ పోటీ చేయకూడదని ఆదేశించినా సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ వారు తమకు అనుకూలంగా తీర్పును తెచ్చుకోగలిగారు.తనను ముఖ్యమంత్రిగా చేసిన అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల పట్ల యడ్యూరప్ప సానుకూలంగానే ఉన్నారు. ఉప ఎన్నికలు జరిగితే వారికే టిక్కెట్లు ఇవ్వాలని యడ్యూరప్ప పట్టుబట్టారు. స్థానిక బీజేపీ నేతలు ఇందుకు అభ్యంతరం తెలిపినప్పటికీ యడ్యూరప్ప కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించగలిగారు. వారిని పార్టీలో చేర్చుకుని మరీ ఉప ఎన్నికల్లో దాదాపు అందరికీ సీట్లు వచ్చేలా చూడగలిగారు. ఇక వారిని గెలిపించుకునే బాధ్యతను కూడా యడ్యూరప్ప తన భుజానకెత్తుకున్నారు.కేంద్ర నాయకులు ఎవరూ ప్రచారానికి రాకపోయినా, రాష్ట్ర నాయకత్వం సహకరించకపోయినా, అక్కడక్కడా రెబల్స్ తలనొప్పి ఎదురైనా యడ్యూరప్ప వారిని గెలిపించుకుని తీరాలన్న లక్ష్యంతో పనిచేశారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలందరికీ తన మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని ఎన్నికల హామీ ఇచ్చి మరీ గెలిపించుకున్నారు. రాష్ట్ర పార్టీ నాయకత్వం సహకరించకపోయినా పెద్దగా పట్టించుకోలేదు. ఈ నాలుగు నెలల్లో కర్ణాటకలో వరదల తాకిడికి విపరీతమైన నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా సాయం అందలేదు. పైగా మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపుదారులను జనం ఇంటికి పంపారు. అయినా యడ్యూరప్ప వెరవకుండా తనను అందలం ఎక్కించిన ఎమ్మెల్యేలను గెలిపించుకోవడమే కాకుండా, తన అధికారాన్ని పూర్తికాలం నిలబెట్టుకోగలిగారు. ఇక యడ్యూరప్ప కు తిరుగులేనట్లే.

No comments:

Post a Comment