పాట్నా, డిసెంబర్ 23 (way2newstv.in)
పౌరసత్వ సవరణ చట్టం, ఎన్సార్సీల అమలుపై దేశవ్యాప్తంగా ఆందోళనలు అలుము కుంటున్నాయి. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ చట్ట సవరణ బిల్లుకు మద్దతిచ్చిన కొందరు ఎన్సార్సీ అమలుకు మాత్రం నై అంటున్నారు. ఇప్పటికే మమత బెనర్జీ తన రాష్ట్రంలో అమలుపర్చడానికి మీరెవరు అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మమత బెనర్జీ తొలి నుంచి పౌరసత్వ సవరణ చట్టంతో పాటు ఎన్సార్సీని కూడా వ్యతిరేకిస్తున్నారు.కానీ బీజేపీకి మిత్రుడిగా ఉన్న నితీష్ కుమార్ సయితం ఎన్సార్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత కొద్దిరోజులుగా బీహార్ లో పౌరసత్వ సవరణ చట్టం బిల్లు, ఎన్సార్సీ అమలుపై ఆందోళనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ వంటి పార్టీలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి.
నితీష్... యూ టర్న్...
దీంతో నితీష్ కుమార్ వెనకడుగు వేయాల్సి వచ్చింది. నిజానికి పౌరసత్వ సవరణ చట్ట బిల్లు ఆమోదం కోసం ఉభయ సభల్లో జనతాదళ్ యు మద్దతిచ్చింది.ఇలా మద్దతివ్వడంపై పార్టీలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినా పౌరసత్వ సవరణ చట్టబిల్లుకు మాత్రం నితీష్ కుమార్ బీజేపీకి సహకరించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశంగా మారనుంది. విపక్షాలు సయితం దీనినే అస్త్రంగా మలచు కోనున్నాయి. అందుకే నితీష్ కుమార్ తాను బీహార్ లో ఎన్సార్సీని అమలు పర్చడం లేదని స్పష్టం చేశారు. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజపీ ఇరకాటంలో పడినట్లయింది.బీజేపీ బీహార్ లో అధికారంలో ఉన్నట్లే లెక్క. బీజేపీ, జేడీయూ కలసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. అక్కడే ఎన్సార్సీ అమలు కాకుంటే మిగిలిన రాష్ట్రాలపై వత్తిడి తెచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ఎలా చేస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒడిశాలో కూడా నవీన్ పట్నాయక్ తాను ఎన్సార్సీని అమలు చేయనని చెబుతున్నారు. ఇప్పుడు నితీష్ కుమార్ అడ్డం తిరగడంతో మిగిలిన రాష్ట్రాలపై కర్ర పెత్తనం చేయాలనుకుంటున్న బీజేపీకి మింగుడు పడని అంశంగా మారింది.
No comments:
Post a Comment