Breaking News

04/12/2019

బీజేపీ వైపు.. జేసీ చూపు

అనంతపురం, డిసెంబర్ 4 (way2newstv.in)
జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడేందుకు దాదాపుగా సిద్ధమయ్యారనే తెలుస్తోంది. ఆయన భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి అడుగులు కమలం పార్టీ వైపు పడుతున్నాయి. వైసీపీ నుంచి తన కుటుంబంతో పాటు అనుచరులను కాపాడుకోవాలంటే బీజేపీలోకి వెళ్లడం ఒక్కటే మార్గమని జేసీ దివాకర్ రెడ్డి భావిస్తున్నారు. జేసీ దివాకర్ రెడ్డి దాదాపు బీజేపీకి దగ్గరయినట్లు స్పష్టంగా తెలుస్తోంది.గత ఎన్నికల్లో టీడీపీ మరోసారి గెలుస్తుందని అంచనా వేసుకుని జేసీ దివాకర్ రెడ్డి ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి తాము ఎన్నికలకు దూరంగా ఉండి తనయులను బరిలోకి దించారు. అయితే జగన్ హవాలో ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఓటమి పాలయని తర్వాత జేసీ దివాకర్ రెడ్డి కొంత మౌనంగానే ఉన్నారు. 
బీజేపీ వైపు.. జేసీ చూపు

ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ కుటుంబంపైన, అనుచరులపైన దాడులు పెరిగాయన్న ఆందోళన జేసీ దివాకర్ రెడ్డిలో ఉంది. జేసీ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెబుతున్నారు. దివాకర్ ట్రావెల్స్ బస్సులను దాదాపు అన్నింటినీ సీజ్ చేసేశారు. ట్రాన్స్ పోర్టు వ్యాపారం దాదాపుగా దెబ్బతినింది. ఇక మైనింగ్ పై కూడా వైసీపీ ప్రభుత్వం కన్నెర్ర చేస్తుంది. ఇక అనుచరులు కూడా ఒక్కొక్కరుగా అధికార పార్టీవైపు వెళుతుండటం జేసీ కుటుంబానికి ఆందోళన కల్గిస్తుంది.తాడిపత్రిలోనూ జేసీ కుటుంబం ఒంటరి అవుతుందన్న వార్తలు వస్తున్నాయి. రాజకీయంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే పూర్తిగా నష్టపోతామని ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరుడు  దివాకర్ రెడ్డికి ఇటీవల సూచించడంతో ఆయన బీజేపీ వైపు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు. జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబుకు చెప్పిన తర్వాతనే జేసీ దివాకర్ రెడ్డి బీజేపీలోకి వెళతారన్న టాక్ జిల్లాలో నడుస్తుంది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా చంద్రబాబుతో సంప్రదించిన తర్వాతే బీజేపీలోకి వెళ్లారు. మొత్తం మీద వైసీపీ దెబ్బకు బెంబేలెత్తి పోతున్న జేసీ కుటుంబం కమలం తీర్థం పుచ్చుకునే రోజు ఎంతో దూరంలో లేదు.

No comments:

Post a Comment