బెంగళూర్, డిసెంబర్ 4 (way2newstv.in)
కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు అధికార మార్పిడికి కారణమవుతాయా? రానున్న ఉప ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీకి ఎనిమిది స్థానాలను దక్కకపోతే అధికారం కోల్పోవడం ఖాయం. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుంది. కాంగ్రెస్, జేడీఎస్ ల నుంచి కనీసం ఆరుగురు సభ్యులను తీసుకు రాగలిగితే అధికారాన్ని కాపాడుకునే వీలుంది. ఇప్పటికే కొందరు విపక్ష ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ నేతలు ఇప్పటికే ఫిల్లర్లు వదులుతున్నారు.కానీ ఎవరు వస్తారు? ఎవరు తమతో టచ్ లో ఉన్నారన్న విషయం చెప్పడం లేదు. అయితే బీజేపీని నమ్మి మరోసారి కాంగ్రెస్, జేడీఎస్ ల నుంచి వస్తారా? అన్నది అనుమానంగానే ఉంది. ఇప్పటికే పదిహేను మంది రాజీనామాలు చేసిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
కర్ణాటకలో డిసెంబర్ 9 టెన్షన్
గత ఎన్నికల్లో ప్రజా తీర్పును వారు వమ్ము చేశారనే అపప్రధను ఎదుర్కొంటున్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీకి పెద్దగా స్థానాలు వచ్చే అవకాశం లేదని కూడా అంతర్గత సర్వేలు వెల్లడిస్తున్నాయి.ఈ నేపథ్యంలో యడ్యూరప్ప ను నమ్మి భారతీయ జనతా పార్టీలోకి వచ్చే సాహసం ఎవరు చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. మహారాష్ట్ర రాజకీయాల ప్రభావం కూడా కర్ణాటక ఉప ఎన్నికలపై పడ్డాయనే చెప్పాలి. ఈ నెల 5వ తేదీన కర్ణాటకలో పదిహేను నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతుండటంతో బీజేపీతో పాటు కాంగ్రెస్, జేడీఎస్ లు హోరాహోరీగా తలపడుతున్నాయి. బీజేపీకి అంతగా సానుకూల పవనాలు లేకపోవడంతో తిరిగి ఆపరేషన్ కమల్ ను స్టార్ట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది.డిసెంబరు 9వ తేదీ తర్వాత కర్ణాటకలో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా కోల్పోయిన అధికారాన్ని తిరిగి దక్కించుకునే ప్రయత్నంలో ఉంది. అందుకే మళ్లీ జనతాదళ్ ఎస్ తో సఖ్యతను కొనసాగిస్తోంది. ఎమ్మెల్యేలు ఎవరూ జారి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫలితాల తర్వాత ఎలాంటి ప్రలోభాలకు నేతలు గురి కాకూడదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కర్ణాటకకు నలుగురు పరిశీలకులను పంపుతున్నారు. మొత్తం మీద ఎన్నికల ఫలితాలు రాకమునుపే బీజేపీ, కాంగ్రెస్ లు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నాయి.
No comments:
Post a Comment