హైద్రాబాద్, డిసెంబర్ 24 (way2newstv.in)
కొత్త సంవత్సర వేడుకల్లో ఎలాంటి అపశ్రుతులు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు రాచకొండ, సైబరాబాద్ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పలు నిబంధనలు, మార్గదర్శకాలను నిర్దేశించారు. వీటిని ఈవెంట్స్ నిర్వహకులు, హోటళ్లు, పబ్‌ల యాజమాన్యాలు, ఇతరులు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు వెళ్లాయి. రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌లు విజన్ 2020 లక్ష్యాలను వెల్లడించారు. ఇందులో మహిళలకు పటిష్ఠ భద్రత.. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం వంటివి ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.డిసెంబర్ 31 అర్ధరాత్రి వేడుకలను దృష్టిలో ఉంచుకుని రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌లు మహేశ్ భగవత్, సజ్జనార్‌లు ఓఆర్‌ఆర్‌పై రాత్రి 11 నుంచి ఉద యం 5 గంటల వరకు వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
డిసెంబర్ 31 ఫ్లై ఓవర్ల బంద్
దీంతో పాటు రెండు పోలీస్ కమిషనరేట్‌ల పరిధిలో ఉన్న ఫ్లైఓవర్లపై రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు.2020 వేడుకలను రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే నిర్వహించాలి. మత్తు పదార్థాలకు అనుమతి లేదు. వేడుకల నిర్వహకులు విధిగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. వేడుకలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు, ట్రాఫిక్ రద్దీ తలెత్తకుండా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలి. 45 డెసిబెల్స్ మ్యూజిక్ శబ్దం మించకూడదు. మహిళలు, పిల్లలను నిర్మానుష్య ప్రాంతాల్లో జరిగే కొత్త సంవత్సర వేడుకలకు పంపొద్దు. వేడుకల సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే కూల్ డ్రింకులు, ఇతర పానీయాలు తాగొద్దు. క్యాబ్‌లు, ఆటో డ్రైవర్లెవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే డయల్ 100, లేదా హాక్ ఐ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఎస్‌ఓఎస్ బటన్ నొక్కాలి.
No comments:
Post a Comment