Breaking News

08/11/2019

ఫోర్ ఫ్రంట్ లోకి జనసేనాని

విశాఖపట్టణం, నవంబర్ 8 (way2newstv.in)
పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబుకు ఏమీ ప్రత్యేకమైన అభిమానాలు, ప్రేమలు లేవంటారు. బాబు రాజకీయం అలాంటిది మరి. పవన్ కళ్యాణ్ ను వీలున్నంతవరకూ వాడుకోవాలని, తన రాజకీయ జీవితానికి కొత్త మెట్లు నిర్మించుకోవాలన్నదే బాబు ఆలోచనగా వైసీపీ చేస్తున్న ప్రచారమే నిజం అనుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ నుంచి పెద్ద ట్రబుల్ టీడీపీకే అనుకోవాలి. పవన్ కళ్యాణ్ అయిదేళ్ళ క్రితంలా ఉంటారని, మాట వింటారని టీడీపీలో బాబుతో సహా ఎవరైనా అనుకుంటే అది కూడా పొరపాటే. పవన్ కళ్యాణ్ కి తనకంటూ కొంత బలం ఉంది. సామాజికంగా బలమైన వర్గం ఉంది. పైగా పైకి ఎన్ని కబుర్లు చెప్పినా ముఖ్యమంత్రి సీటు మీద పవన్ కళ్యాణ్ కి కన్ను ఉంది. ఇపుడు లాంగ్ మార్చ్ సక్సెస్ తరువాత పవన్ కళ్యాణ్ లో కొత్త జోష్ కనిపిస్తొంది. 
ఫోర్ ఫ్రంట్ లోకి జనసేనాని

ఏపీ రాజకీయల్లో తాను ఫోర్ ఫ్రంట్ లోకి రావాలన్న ఆశలు కూడా కలుగుతు న్నాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్…ఆవేశపూరితమైన రాజకీయాలు చేస్తారు, నిలకడ లేని నేత. సీరియస్ పొలిటీషియన్ కాదు, చుట్టపు చూపుగా వస్తూ పోతూ ఉంటారు. ఇదీ ఆయన మీద ఏపీలోని మిగిలిన పార్టీలకు ఉన్న అభిప్రాయం. దానికి తగినట్లుగానే ఇన్నాళ్ళు పవన్ వైఖరి సాగింది. ఓడిపోయాక కూడా అరు నెలల పాటు పవన్ ఇలాగే చేశారు. జనసేన పని అయిపోయింది, క్యాడర్ ఏమీ లేదు. అంతా పాలపొంగు అనుకున్నారు. కానీ పవన్ బలం నీటిలో మొసలి లాంటిదని లాంగ్ మార్చ్ దాకా ఎవరూ గుర్తించలేకపోయారు. పవన్ కల్యాణ్ కి కరడు కట్టిన యూత్ ఫ్యాన్స్ అలాగే ఉన్నారు. ఇక ఆయన సినీ క్రేజ్ తో తెచ్చుకున్న అభిమానులు ఎక్కడా చెక్కుచెదరలేదు. ఇది చాలు పవన్ కల్యాణ్ మళ్ళీ రాజకీయం చేయడానికి ప్రారంభపు పెట్టుబడిగా పెట్టడానికి. దాంతో పవన్ కల్యాణ‌్ కనుక సీరియస్ గా రంగంలోకి దిగితే అది ఎవరికి దెబ్బ అన్నదే ఇపుడు ఏపీలో కొత్త చర్చగా ఉంది.నిజానికి పవన్ కళ్యాణ్, జగన్ వయసు ఇంచుమించు ఒక్కటే. రాజకీయంగా జగన్ కి సరిజోడు పవన్ కళ్యాణ్ మాత్రమే అవుతారు. ఆయన సీరియస్ గా రాజకీయాలు చేయాలే కానీ జగన్ కి ఎప్పటికైనా ప్రత్యర్ధి, సీఎం సీటుకు అభ్యర్ధి పవన్ కళ్యాణ్ అవుతారన్న అంచనాలు కూడా ఉన్నాయి.లాంగ్ మార్చ్ తరువాత ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు చూసుకుంటే వైసీపీ వర్సెస్ జనసేనగా మారిపోయాయి. ఇపుడు జగన్ తో పవన్ కళ్యాణ్ అంటున్నారు. సరిగ్గా ఇదే ఇపుడు జనసేనకు కూడా కావాల్సింది. పొలిటికల్ సీన్లో చంద్రబాబు వెనక్కు వెళ్ళిపోయారు. సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఈ రెండు పార్టీల మధ్యనే. నిజంగా ఇది వింత, విచిత్రమే. ఆరు నెలలుగా చంద్రబాబు ఏపీలో ఆందోళనలు చేస్తున్నా రాని హైప్, హడావుడి ఒక్క లాంగ్ మార్చ్ తో పవన్ కళ్యాణ్ తెచ్చేశారు. ఏపీ రాజకీయాలను హీటెక్కించేశారు. దీంతో ఏపీలో ప్రధాన ప్రతిపక్షంలోకి పవన్ కళ్యాణ్ వచ్చేశారు. ఇక ఇదే దూకుడుతో పవన్ కళ్యాణ్ మరిన్ని ఆందోళనలు కనుక ఏపీలో ప్రతీ చోటా నిర్వహించినట్లైతే అది అంతిమంగా చంద్రబాబుకే చేటు తెస్తుంది. బాబును చూసిన‌ జనాలకు రేపు పవన్ కళ్యాణ్ మోజు అయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇది రాజకీయం, బాబు తరువాత జగన్ అనుకున్నారు. రేపు మనసు పవన్ కళ్యాణ్ మీద మళ్ళితే టీడీపీ కొంప కొల్లేరే. కానీ టీడీపీ ఏం చేయలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ జోరుని ఆపలేదు, అలా అని విడిపోయి చేసేదేమీ లేదు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఎంత పెరిగితే అంత ఇబ్బందీ, ఇరకాటమే పసుపు పార్టీకి .

No comments:

Post a Comment