Breaking News

07/11/2019

రాజకీయ వారసులు లేని గీతారెడ్డి...?

హైద్రాబాద్, నవంబర్ 7   (way2newstv.in)
మాజీ మంత్రి గీతారెడ్డి పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే కన్పిస్తుంది. రాజకీయాలకే కాదు నియోజకవర్గానికి, పార్టీకి ఆమె పూర్తిగా దూరమయ్యారనే చెప్పాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వరస ఓటములతో ఆ పార్టీ నేతలు కుదేలయిపోయారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా చెలాయించిన నేతలు ఎవ్వరూ ఇప్పుడు యాక్టివ్ గా లేరు. అందులో గీతారెడ్డి కూడా ఒకరు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనడం లేదు. పార్టీ కూడా గీతారెడ్డిని పట్టించుకోవడం లేదు. అసలు గీతారెడ్డి రాజకీయంగా ఉన్నట్లా? లేనట్లా? అన్న చర్చ జరుగుతోంది.జె.గీతారెడ్డి సీనియర్ నేత. కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉన్న నేత. ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద గీతారెడ్డి మంత్రిగా పనిచేశారు. 
రాజకీయ వారసులు లేని గీతారెడ్డి...?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి పదవుల జాబితాలో తొలిపేరు గీతారెడ్డిదే ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సబ్జెక్ట్ పరంగా బాగా అధ్యయనం చేసే గీతారెడ్డి తనకు అప్పగించిన శాఖలకు న్యాయం చేస్తారన్న పేరుంది. అయితే గీతారెడ్డికి ఉన్న ఒకే ఒక బలహీనత ప్రజల్లో మమేకమై ఉండకపోవడం. అధికారంలో ఉన్నప్పటికీ, లేనప్పటికీ ఆమె జనంలో పెద్దగా కనపడరు.గీతారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత గీతారెడ్డి రాత తిరగబడింది. 2014, 2018 ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి పోటీ చేసి గీతారెడ్డి ఓటమి పాలయ్యారు. వరసగా ఓటమి చెందడం, కాంగ్రెస్ కు ఇక రాష్ట్రంలో భవిష్యత్ లేదని తెలియడంతో గీతారెడ్డి జహీరాబాద్ కు కూడా దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. దీనికి తోడు వయసు కూడా మీద పడుతుండటంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.గీతారెడ్డి పట్టించుకోక పోవడంతో జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ను నడిపించే నేత లేరు. కొత్త ఇన్ ఛార్జిని నియమించాలన్నా గీతారెడ్డిని కాదనే శక్తి పార్టీ అగ్రనేతలకు లేదు. మరోవైపు గీతారెడ్డికి వారసులు ఉన్నప్పటీకి రాజకీయంగా వారసత్వం అందుకునేందుకు వారు ముందుకు రావడం లేదు. అందుకే తిరిగి ఆ కుటుంబం నుంచి గీతారెడ్డి మాత్రమే రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలి. లేకుంటే ఇక వారసులు రానట్లే. పార్టీ కూడా గీతారెడ్డి ఇక రాజకీయాల్లోకి రారని డిసైడ్ అయింది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండటంతో జహీరాబాద్ ఇన్ ఛార్జిపై నిర్ణయం తీసుకోవాలని అక్కడి క్యాడర్ కోరుతోంది.

No comments:

Post a Comment