Breaking News

05/11/2019

తెలంగాణలో కనిపించని పౌష్టికాహారం

ప్రతి 10 మందిలో ఇద్దరికి రక్తహీనత
వరంగల్, నవంబర్ 5, (way2newstv.in)
రాష్ర్టంలో పిల్లలకు పౌష్టికాహారం అందుతలేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘2019 నేషనల్ హెల్త్ ప్రొఫైల్’ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. రాష్ర్టంలోని ఐదేండ్ల లోపు పిల్లల్లో 60.9% మంది హిమోగ్లోబిన్ లోపంతో బాధపడుతున్నట్టు నివేదిక వెల్లడించింది. పౌష్టికాహార లోపంతో పిల్లల్లో ఐరన్‌‌ తగ్గడమే ఇందుకు కారణమని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా గర్భిణుల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. సరిపడా ఆహారం తీసుకోకపోవడం వల్లే సమస్య వస్తుంది. అయితే మన రాష్ర్టంలో గర్భిణుల కంటే సాధారణ మహిళల్లోనే రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంది. గర్భిణుల్లో 49.8% మందికి హిమోగ్లోబిన్ లోపం ఉంటే,15 నుంచి 49 ఏండ్ల వయసున్న మహిళల్లో 56.9% మందికి హిమోగ్లోబిన్ లోపం ఉంది. 
తెలంగాణలో కనిపించని పౌష్టికాహారం

ఇక దేశవ్యాప్తంగా58.4%  పిల్లలు, 53% మహిళలు రక్తహీనతను ఎదుర్కొంటున్నట్టు నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పోషకాహార పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నా రక్తహీనత సమస్య అలాగే కొనసాగడం గమనించదగ్గ విషయం.ఎర్రరక్త కణాల సంఖ్య తగ్గిపోవడం లేదా హిమోగ్లోబిన్ సాధారణం కంటే తక్కువ స్థాయికి పడిపోతే దానిని రక్తహీనత (ఎనీమియా)గా పేర్కొంటారు. పురుషుల్లో ప్రతి డెసీ లీటర్‌‌‌‌ (100 మిల్లీలీటర్లు) రక్తంలో కనీసం13.5 గ్రాములు, మహిళల్లో ప్రతి డెసీ లీటర్ కు 12.0 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే రక్తహీనత ఉన్నట్లు భావిస్తారు. మహిళల్లో రుతుస్రావం సమయంలో రక్తం ఎక్కువగా పోవడం, సరియైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఐరన్‌‌, ఫోలిక్ యాసిడ్, బీ12 విటమిన్ తగినంత శరీరానికి అందకపోతే రక్తహీనత ఏర్పడుతుంది. అధికశాతం పిల్లలు, మహిళల్లో సాధారణ రక్త హీనతే ఉంటుంది. అయితే, దీన్ని లైట్ తీసుకోవద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సాధారణ రక్తహీనతతో అప్పటికప్పుడు ప్రమాదం లేకపోయినప్పటికీ, దీర్ఘకాలం కొనసాగితే పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుందని, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంటున్నారు. పెద్దవారిలోనూ గుండె పనితీరుపై ఎఫెక్ట్ పడుతుందని, గుండెకు సరిపడా ఆక్సిజన్ అందకపోవడం వల్ల, గుండె కొట్టుకునే వేగంలో హెచ్చు తగ్గులు ఏర్పడుతాయని చెబుతున్నారు. దీర్ఘకాలం ఎనీమియాతో గుండె సంబంధిత వ్యాధులకు దారి తీసే ప్రమాదముంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.90 శాతం మంది పిల్లల్లో రక్తహీనతకు ఐరన్‌‌ లోపమే కారణంగా ఉంటుంది. దీంతో పిల్లలకు ఐరన్ సిరప్ ఇస్తారు. పెద్దవారిలో రక్తహీనతకు రకరకాల కారణాలు ఉంటాయి. కారణాన్ని బట్టి లక్షణాలు కూడా మారుతుంటాయి. ఉదాహరణకు ఐరన్‌‌ లోపంతో రక్తహీనత ఏర్పడితే అలసట, బలహీనమవడం, దమ్ము రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. అదే బీ12 విటమిన్ లోపం ఉంటే చేతులు, పాదాలు తిమ్మిరెక్కడం, చర్మం స్పర్శ కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే రక్తహీనతకు కారణాన్ని బట్టి డాక్టర్లు ట్రీట్‌‌మెంట్ ఇస్తారు.అయితే లోపం ఎక్కడుందో తెలుసుకుంటే సహజ పద్ధతిలోనే దాన్ని అధిగమించొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఉదాహరణకు బీ12 లోపం ఉంటే మాంసం (ముఖ్యంగా కాలేయం), చేపలు, గుడ్ల వంటివి ఎక్కువగా తినాలి. అదే ఐరన్ లోపం ఉంటే పండ్లు, ఆకు కూరలు, మాంసం, తృణధాన్యాల వంటివి ప్రతిరోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు

No comments:

Post a Comment