Breaking News

21/11/2019

చట్టసభల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించండి

శాసన మండలి ఛైర్మన్ ఎంఎ. షరీఫ్
 అమరావతి నవంబర్ 21 (way2newstv.in)
రాజ్యాంగం ద్వారా సంక్రమించిన చట్టసభల బాధ్యతలను శాసన మండలి సభ్యులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ మహ్మద్ అహ్మద్ షరీఫ్ పిలుపునిచ్చారు. శాసనసభ సమావేశ మందిరంలో గురువారం నూతనంగా ఎంపికైన 6 కమిటీలను ఉద్దేశించి షరీఫ్ మాట్లాడారు. కార్యక్రమానికి అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు అధ్యక్షత వహించారు. తెలుగు భాషా సాంస్కృతిక అభివృద్ధి కమిటీ ఛైర్మన్ హోదాలో ఎంఎ.షరీఫ్ మాట్లాడుతూ తాను ఛైర్మన్గా వ్యవహరిస్తున్న కమిటీలో సభ్యులుగా బుద్దా వెంకటేశ్వరరావు, కేఎస్ లక్ష్మణరావు, కత్తి నర్సింహారెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి, పీవీఎన్.మాధవ్, ఏఎస్ రామకృష్ణలు కొనసాగుతారన్నారు. 
చట్టసభల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించండి  

ఫిర్యాదుల కమిటీ ఛైర్మన్ గా రెడ్డి సుబ్రహ్మణ్యం, సభ్యులుగా బీద రవిచంద్ర, మంతెన వెంకట సత్యనారాయణరాజు, పాకాలపాటి రఘువర్మ, జి.దీపక్రెడ్డి పనిచేయనున్నారని తెలిపారు. అదేవిధంగా ప్రచార పట్టిక కమిటీ ఛైర్మన్గా వైవీబీ రాజేంద్రప్రసాద్, సభ్యులుగా ఇల్లా వెంకటేశ్వరరావు, చిక్కాల రామచంద్రరావు, రామసూర్యరావు వ్యవహరించనున్నారు. నైతిక విలువల (ఎథిక్స్) కమిటీ ఛైర్మన్గా వెన్నపూస గోపాలరెడ్డి, సభ్యులుగా చిక్కాల రామచంద్రరావు, కేఈ ప్రభాకర్, విఠపు బాలసుబ్రహ్మణ్యం, సోము వీర్రాజులు కొనసాగనున్నారు. ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్గా దేవసాని చినగోవిందరెడ్డి, సభ్యులుగా గౌనివారి శ్రీనివాసులు, బచ్చుల అర్జునుడు, చిల్లా రామచంద్రారెడ్డి, పి.అశోక్బాబు, ఎఎస్ రామకృష్ణారెడ్డి పనిచేస్తారన్నారు. ప్రభుత్వ హామీల అమలు కమిటీ ఛైర్మన్గా జి.తిప్పేస్వామి, సభ్యులుగా పీవీఎన్ మాధవ్, షేక్ మహ్మద్ ఇక్బాల్, కేఈ ప్రభాకర్, యానాదిపల్లి శ్రీనివాసులు రెడ్డి వ్యవహరించాలని ఛైర్మన్ నిర్ణయించారు. ఆయా కమిటీల ఛైర్మన్ లు, సభ్యులంతా క్రమం తప్పకుండా ప్రతినెలా సమీక్షా సమావేశాలను నిర్వహించి ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలన్నారు. అలాగే విధుల్లో ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించి సంబంధిత అధికారులను సంప్రదిస్తూ ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి  కృషి చేయాలన్నారు. సమాజంలో ప్రజా వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహణ వ్యవస్థలతో పాటు మీడియా వ్యవస్థ ప్రాముఖ్యమైనవి అని గుర్తుచేశారు. శాసన వ్యవస్థ ద్వారా ఎంపికైన ప్రతినిధులు ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తొలి సమావేశంలో శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంతో పాటు ఆయా కమిటీల ఛైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు.  ప్రజా సంబంధిత అంశాలు, సమాజాభివృద్ధి, సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.

No comments:

Post a Comment