Breaking News

19/11/2019

నిధులు రావు.. పనులు జరగవు..(ఆదిలాబాద్)

ఆదిలాబాద్, నవంబర్ 19 (way2newstv.in): 
జిల్లా వాసులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను అందించటానికి కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన ‘సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి’ భవన నిర్మాణాకి నిధుల గండం ఏర్పడింది. నిధులు విడుదల కాకపోవటంతో నెల రోజులుగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ ఆసుపత్రి సేవలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జిల్లా వాసులు నిరాశకు గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపుగా రూ.78 కోట్లు విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను విడుదల చేయకపోవటంతో పనులు స్తంభించిపోయాయి. రెండేళ్ల కిందటే పనులు పూర్తి కావాల్సి ఉండగా వివిధ కారణాల వల్ల జాప్యం చోటుచేసుకుంది. ప్రస్తుతం నిధుల విడుదలలో ప్రతిష్టంభన ఏర్పడటంతో మరింత జాప్యం చోటు చేసుకుంటోంది. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో రిమ్స్‌ ఆసుపత్రి 2008లో ప్రారంభమైంది. 
నిధులు రావు.. పనులు జరగవు..(ఆదిలాబాద్)

ఇందులో పూర్తి స్థాయి వైద్యులు లేకపోగా, ప్రత్యేక వైద్య నిపుణులు లేరు. ఈ కారణంగా సాధారణ చికిత్సలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. పరిస్థితి విషమంగా ఉన్న రోగులను హైదరాబాద్‌, నిజామాబాద్‌, మహారాష్ట్రలోని నాగపూర్‌, యావత్మాల్‌ ప్రాంతాలకు రిఫర్‌ చేయాల్సి వస్తోంది. ఆర్థిక స్థోమత ఉన్న వారు మెరుగైన వైద్యం కోసం ఆయా ప్రాంతాలకు వెళుతున్నప్పటికీ పేద రోగులు ఇక్కడే అందుబాటులో ఉన్న వైద్యం చేయించుకుంటూ రోజులు లెక్కపెట్టుకుంటూ దేవునిపై భారం వేసి గడుపుతున్నారు. ఇలాంటి వారికి సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావటానికి ప్రధాన మంత్రి స్వస్థ్‌ సురక్ష యోజన(పీఎంఎస్‌ఎస్‌వై)-3 కింద సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించడానికి వివిధ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలను కేంద్రం ఎంపిక చేసింది. ఈ మేరకు జిల్లా కేంద్రానికి కేంద్రం 2015లో రూ.150 కోట్లతో ఈ ఆసుపత్రిని మంజూరు చేసింది. ఇందులో కేంద్రం వాటా రూ.120 కోట్లు, రాష్ట్ర వాటా రూ.30 కోట్లుగా కేటాయించారు. 2016 జులైలో పనులు ప్రారంభమయ్యాయి. ఒప్పందం మేరకు గుత్తేదారు 18 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంది. అంటే 2018 జనవరి నాటికి పనులు పూర్తి చేసి భవనాన్ని అప్పగించాల్సి ఉంది.ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే ఆధునిక వైద్య సేవలు జిల్లా వాసులకు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న రిమ్స్‌లో 500 పడకలు మాత్రమే ఉండి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందటం లేదు. వైద్యుల కొరతకు తోడు ప్రత్యేక వైద్య నిపుణులు అసలే లేరు. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభమైతే కార్డియో, న్యూరాలజీ, న్యూరోసర్జరి, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ, యూరాలజీ, సీటీవీఎస్‌ లాంటి ఎనిమిది విభాగాలు ఏర్పాటవుతాయి. ఒక్కొక్క విభాగంలో ప్రత్యేక వైద్య నిపుణులు కనీసం ఐదుగురు చొప్పున ఉండి, అదనంగా నర్సింగ్‌, పారామెడికల్‌ సిబ్బంది అందుబాటులో ఉంటారు. హైదరాబాద్‌, మహారాష్ట్రలోని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో లభించే సేవలన్నీ స్థానికంగానేే లభిస్తాయి. గుండె, కాలేయం, మూత్రపిండాలు, నరాలకు సంబంధించిన శస్త్ర చికిత్సలన్నీ అందుబాటులోకొస్తాయి. అంతే కాక పీజీ తరగతుల నిర్వహణకు కూడా అనుమతి లభిస్తుంది. ప్రతి ఏడాది 50 మంది పీజీ విద్యార్థులు చేరినా ఐదేళ్లలో దాదాపు 250 మందికి పైగా వైద్యులు ఉంటారు. అంటే మొత్తంగా వైద్యులు మూడు వందలకు పైగా ఈ ఆసుపత్రిలో ఉండి వైద్య సేవలు అందించే అవకాశాలుంటాయి. వివిధ కారణాలతో ఆసుపత్రి నిర్మాణం పనులు ఆగుతూ సాగుతూ ఇప్పటికి 75శాతం పనులు పూర్తయ్యాయి. ఆసుపత్రికి అవసరమైన పలు రకాల యంత్రాలు సైతం సరఫరా అయ్యాయి. వీటిని ఇదే ఆసుపత్రిలోని గదుల్లో భద్రపరచి ఉంచారు. ప్రస్తుతం 75 శాతం పనుల్లో అయిదు అంతస్తులతో భవన నిర్మాణం పూర్తయింది. అంతర్గత పనులు 25 శాతం చేయాల్సి ఉంది. బయట ప్రహారి, ఆసుపత్రి ఆవరణలో అంతర్గత రహదారులు నిర్మించాల్సి ఉంది. నిధులు విడుదల కాక ఈ పనులన్నీ ఆగిపోయాయి. రూ.150 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన ఈ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్రం రూ.120 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 78 కోట్లు విడుదల చేసింది. అనంతరం విడుదల చేయాల్సిన నిధులను ఆపేసింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదల చేస్తేనే మిగతా నిధులు విడుదల చేస్తామని మెలిక పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.30 కోట్లలో రూ.20 కోట్లను విడుదల చేయనున్నట్లు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఆ నిధులు ఇంకా విడుదల కాలేదు. దీంతో పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఆసుపత్రి నిర్మాణంలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు సైతం లేక ఇబ్బందులకు గురవుతున్నారు. పనులు పూర్తి అయిన మేరకు పంపించిన బిల్లులు అలాగే మూలనపడి ఉన్నాయి.

No comments:

Post a Comment