ఒంగోలు, నవంబర్ 4, (way2newstv.in)
వారిద్దరూ భార్యా, భర్తలు...రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే భార్య ఒక పార్టీలో ఉంటే, భర్త మరొక పార్టీ భార్య కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీలో ఉంటే, భర్త రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ. ఇద్దరూ ఎవరి రాజకీయంలో వారు బిజీగా వున్నారు అయితే ఒకే ఇంట్లో రెండు జెండాలున్నా వీరు సఖ్యతగానే వున్నారు కానీ, పార్టీల అధినాయకుల్లోనే అపార్థాలు పెరుగుతున్నాయట. బీజేపీ లీడర్‌గా భార్య వైసీపీ సర్కారు మీద మాటల దాడి పెంచడంతో, భర్తపై జగన్ సర్కారు నిఘా పెట్టిందన్న ఊహాగానాలు చక్కర్లుకొట్టాయి. చివరికి నియోజకవర్గంలో ఆయనను పక్కకుపెట్టే పరిస్థితి వచ్చిందట. ఇంతకీ చెరో పార్టీలో వున్న ఆ భార్యాభర్తల దారెటు...? ప్రకాశం జిల్లా పర్చూరు రాజకీయాల్లో తిరుగులేనివిధంగా చక్రంతిప్పిన దగ్గుబాటి కుటుంబం, ప్రస్తుతం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. దగ్గుబాటి తర్వాత ఆయన కుమారుడు చెంచురామ్‌తో పొలిటికల్ ఆరంగేట్రం చేయిద్దామంటే, కొన్ని సాంకేతిక కారణాలు అడ్డొచ్చాయి. దీంతో చేసేదేమీ లేక దగ్గుబాటి వెంకటేశ్వర రావు పోటీ చేశారు. అయితే రాష్ట్రమంతా జగన్ హవా నడుస్తున్నా, పర్చూరులో మాత్రం ప్రతికూల పవనాలు వీచాయి. దీంతో పర్చూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన దగ్గుబాటి, ఓడిపోయారు.
అయోమయంలో దగ్గుబాటి దంపతులు
అటు విశాఖ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా భార్య పురంధ్రీశ్వరి కూడా ఓడిపోయారు. ఇద్దరూ ఓడిపోవడం, కుమారుడి రాజకీయం ఆరంగేట్రం కూడా సఫలం కాకపోవడంతో, తీవ్ర నిరాశలో కూరుకుపోయింది దగ్గుబాటి కుటుంబం. అయితే అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. భార్యొక పార్టీ, భర్తొక పార్టీ. ఒకే ఇంట్లో రెండు పార్టీలంటూ, అప్పడే పెద్ద ఎత్తున సూటిపోటీ మాటలు ఎదురయ్యాయి. ఇంట్లో ఒక్కటైనా, బయట ఎవరిదారి వారిదేనని, కపుల్స్ ఇద్దరూ చెప్పుకున్నారు. కానీ ఎన్నికలు అయిపోయాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే, కేంద్రంలో బీజేపీ మళ్లీ వచ్చింది. మొన్నటి వరకూ మిత్రపక్షంగా కనిపించిన ఈ రెండు పార్టీల మధ్య, ఇప్పుడు ఏపీలో భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే దగ్గుబాటి ఫ్యామిలీలోనూ మంట రేపుతోంది. పర్చూరులో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినా, నియోజకర్గ ఇన్‌చార్జిగా కొనసాగాలని దగ్గుబాటికి సూచించారట జగన్. దీంతో పర్చూరు సెగ్మెంట్ నలుదిక్కులా తన కొడుకును వెంటబెట్టుకుని తిరుగుతూ, పార్టీ, పాలనా వ్యవహారాలపై పట్టు సాధించారట. అయితే, రాష్ట్రంలో బీజేపీ తన రాజకీయ వైఖరిని మార్చుకుని, రాష్ట్రప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, ఆ పార్టీలో ఉన్న పురందేశ్వరి కూడా తమ పార్టీ విధానాలకు అనుగుణంగా మాట్లాడటం ప్రారంభించారు. వైసీపీ సర్కారు విధానాలను ప్రశ్నించారు. దీంతో దగ్గుబాటి వైఖరిని పసిగట్టాలని జిల్లా నాయకులను ఆదేశించారట జగన్. క్రమేపీ పర్చూరు నియోజకవర్గ వ్యవహారాల్లో ఇటు జిల్లాకు చెందిన మంత్రి బాలినేని జోక్యం చేసుకోవడం ప్రారంభమైందట. కొద్దిరోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన రాజకీయ భవితవ్యంపై అంతర్మథనం చెందుతున్నారని తెలుస్తోంది. శ్రేయోభిలాషులు, ముఖ్య అనుచరులతో విస్తృతంగా మంతనాలు జరుపుతున్న ఆయన, సొంత పార్టీలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను చూసి కలత చెందుతున్నారట. భార్యాభర్తలు వుంటే, గింటే ఒకే పార్టీలో వుండాలని, లేదంటే లేదని ఏకంగా వైసీపీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయన్న వార్తలు, దగ్గుబాటి వర్గీయుల్లో వాడివేడి చర్చకు దారి తీశాయి. అయితే వైసీపీలో చేరాలన్నా ఒత్తిడిపై ఇంతవరకూ పురందేశ్వరి స్పందించలేదు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన పురందేశ్వరి మొదటిసారి ఈ వ్యవహారంపై స్పందించారు. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరాలని ఆహ్వానం వచ్చిందన్న పురంధ్రీశ్వరి, ఇప్పుడు తనకు ఎటువంటి ఆహ్వానం రాలేదన్నారు. వైసీపీలో చేరడానికి ముందు, చెరొక పార్టీలోనే వుంటామని, జగన్‌కు తన భర్త చెప్పారని అన్నారు పురంధ్రీశ్వరి. అయితే, వుంటే గింటే భార్యాభర్తలిద్దరూ ఒకే పార్టీలో వుండాలని దగ్గుబాటికి, సీఎం జగన్ స్పష్టం చేశారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో దగ్గుబాటి తీవ్ర కలత చెందారని, ఎవరికి ఇష్టమైన పార్టీలో వారుంటే, అభ్యంతరమేంటని తన సన్నిహితులతో వ్యాఖ్యానించారని తెలిసింది. రాజీనామాకు సైతం ఆయన సిద్దపడ్డారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల క్రితం, నియోజకవర్గంలో ఆయన అభిమానులు, అనుచరులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కు దగ్గుబాటి హాజరవుతారని, పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు వారి సమక్షంలోనే ప్రకటిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో, ఆయన రాలేదు. అయితే, దగ్గుబాటికి వ్యతిరేకంగా పార్టీలో పరిణామాలు జరుగుతున్నాయని అందరూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో, మీటింగ్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీ నుంచి వెళ్లిపోయి, దగ్గుబాటిని ఓడించి, తిరిగి వైసీపీలో చేరిన రామనాథం పట్ల దగ్గుబాటి అనుచరులు తీవ్ర వ్యాఖ్యలు చేశారట. నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా దగ్గుబాటినే కొనసాగించాలని, లేదంటే గొట్టిపాటి భరత్‌ను నియమించాలని, అలాకాదని రామనాథంను నియమిస్తే ఊరుకునేదిలేదని అన్నారట. రావి రామనాథంను తిరిగి పార్టీలో చేర్చుకోవడమే, దగ్గుబాటిని తీవ్రంగా కలచివేసిందని తెలుస్తోంది. సాక్షాత్తూ సీఎం జగన్ సమక్షంలోనే రామనాథం బాబు పార్టీలో చేరారు. తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా, రామనాథంను చేర్చుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. దీంతో కలత చెందిన దగ్గుబాటి, నియోజకవర్గానికి వెళ్లడం మానేసి, సీఎంను కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేశారట. అయినా ఆయన అపాయింట్‌మెంట్ దొరకలేదట. దీంతో విజయసాయిరెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేశారట. పదేపదే మెసేజ్‌లు పంపగా ఒక్కసారి ఫోన్‌లో క్లుప్తంగా మాట్లాడినట్లు సమాచారం. ఆఖరికి జిల్లా మంత్రుల రాయబారంతో జగన్‌ను కలిసే అవకాశం దొరికిందట దగ్గుబాటికి. కానీ భార్యాభర్తలు ఇద్దరూ వుంటే, ఒకే పార్టీలో వుండండి, లేదంటే మీరు కూడా వెళ్లిపోండి అని ముక్తసరిగా చెప్పారని, రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే దగ్గుబాటి ఆవేదనకు కారణమని తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో, నియోజకవర్గంలో తిరిగి పార్టీలో చేరిన రామనాథం చెప్పిన పనులు చేయాలని మంత్రులతో పాటు మరికొందరు నాయకుల నుంచి జిల్లా అధికారులకు సమాచారం అందిందట. నియోజకవర్గంలోని పాత వైసీపీ నాయకులు కూడా రామనాథంబాబు వెంట తిరగడం ప్రారంభించారట. దీన్ని గుర్తించిన దగ్గుబాటి 'అసలేం జరుగుతోంది? నా విషయంలో ఎందుకు పక్షపాతం చూపుతున్నారు. నేను బాధ్యతల్లో ఉండాలా తప్పుకోవాలా?' అంటూ విజయసాయిరెడ్డికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీనిపైనా ఎలాంటి రెస్పాన్స్ రాలేదట.
No comments:
Post a Comment