ముంబై, నవంబర్ 9 (way2newstv.in)
సమయం దగ్గరపడుతున్నా మహారాష్ట్ర రాజకీయాలు ఒక కొలిక్కి రాలేదు. ఈ నెల 9వ తేదీతో గత ప్రభుత్వ కాలపరిమితి ముగుస్తుంది. ఎన్నికల ఫలితాలు వచ్చి పదిహేను రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా బీజేపీ, శివసేనల మధ్య సంధి కుదరలేదు. ఇక కుదురుతుందన్న నమ్మకమూ లేదు. ఎవరో ఒకరు దిగిరావాల్సిందే. లేకుంటే ప్రభుత్వ ఏర్పాటు కష్టసాధ్యమే. మహారాష్ట్రలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకుండా గవర్నర్ రంగంలోకి దిగారు.మహారాష్ట్రలో బీజేపీ, శివసేనల మధ్య వార్ అలాగే నడుస్తుంది. రెండు పార్టీలు తమ డిమాండ్లకు తలవంచాల్సిందేనంటూ సంకేతాలను పంపుతున్నాయి. ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగినప్పటికీ కొంత మెత్తబడినా డిమాండ్ల విషయంలో తాము వెనక్కు తగ్గేది లేదంటూ స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో ఏం జరగబోతుందన్నది రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఇద్దరూ తగ్గట్లేదే...
మరోవైపు గవర్నర్ బీజేపీ, శివసేన సభ్యులకు ఎప్పటికప్పుుడు సమయమిస్తూ వారి మనోభావాలను తెలుసుకుంటున్నారు.మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తారని పెద్దయెత్తున ప్రచారం జరిగింది. జరుగుతోంది కూడా. అయితే రాష్ట్రపతి పాలనకు అవకాశాలు లేనట్లే కన్పిస్తుంది. ప్రభుత్వం ఏర్పడేంత వరకూ ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ నే కొనసాగించే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తోంది. అదే సమయంలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీని ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించనున్నారు.బలనిరూపణ సమయానికి రెండు పార్టీల మధ్య సయోధ్య కుదురుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో శివసేన కూడా తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించడం విశేషం. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ను స్టార్ట్ చేయవచ్చన్న అనుమానంతో శివసేన ముందు జాగ్రత్తగా క్యాంప్ రాజకీయాలకు తెరదీసింది. మరి మహారాష్ట్ర నెలకొన్న రాజకీయ అనిశ్చితికి మరికొద్ది గంటల్లోనే తెరపడే అవకాశముంది.
No comments:
Post a Comment