Breaking News

09/11/2019

జగన్ ను తిట్టడంతో...బీజేపీ బలోపేతమా

హైద్రాబాద్, నవంబర్9  (way2newstv.in)
ఆయన నిన్నటి దాకా పసుపు పార్టీ తమ్ముడే. అయిదు నెలల క్రితమే కాషాయం కండువా కప్పుకున్నారు. నాటి నుంచి ఆయన మాటల జోరు పెరిగింది. అది ఎంతవరకూ వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వమే తాను అన్నట్లుగా సుజనా చౌదరి మాటలు ఉంటున్నాయి. సుజనా చౌదరి ఏపీకి వస్తే చాలు జగన్ ని ఆడిపోసుకోకుండా వెళ్ళరు. బీజేపీని ఏపీలో బలోపేతం చేయడం అంటే జగన్ ని తిట్టడమే అన్నట్లుగా రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి అర్ధమైనట్లుంది. జగన్ పాలన అసలు బాగులేదని సుజనా చౌదరి తరచూ అంటున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన సర్కార్ పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది. మరి కేంద్రం నుంచి నిధులు తేవడమో బాధ్యత కలిగిన అధికార పార్టీ సభ్యుడిగా నిర్మాణాత్మక సలహాలు ఇవ్వడమో సుజనా చౌదరి చేయాలి. కానీ అవేమీ కాకుండా కేవలం జగన్ ని విమర్శిస్తే చాలానుకుంటున్నారు.సుజన చౌదరి జగన్ ని పట్టుకుని నియంత అనేశారు. 
జగన్ ను తిట్టడంతో...బీజేపీ బలోపేతమా

ఏపీలో ప్రజాస్వామ్యం లేదన్నారు. దానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తప్పించడమే ఒక ఉదాహరణ అని కూడా చెబుతున్నారు. ఈ పరిణామాలను కేంద్రం నిశితంగా గమనిస్తోందని కూడా సుజనా చౌదరి అంటున్నారు. ఏపీకి ఒక్క పరిశ్రమ రాలేదని, పాలన గాలికి వదిలేశారని కూడా సుజనా చౌదరి అంటున్నారు. గత అయిదు నెలలుగా పాలన లేక ఏపీ తీవ్రంగా నష్టపోయిందని కూడా ఆయన చెబుతున్నారు. మరి ఇవన్నీ కేంద్రం గమనిస్తూంటే బాధ్యత గల మాజీ మంత్రిగా కేంద్రం నుంచి సరైన నిధులను ఏపీకి తెచ్చి అభివృధ్ధి పాటుపడవచ్చుగా అన్న ప్రశ్న వస్తోంది. పైగా సుజనా చౌదరికి ఏపీ గురించి తెలియనిది కాదు, అన్ని విధాలుగా దగాపడ్డ రాష్ట్రంగా ఏపీ ఉంది. ఏపీ విషయంలో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో సుజనా చౌదరి చొరవ తీసుకోవచ్చు కదా అన్న మాట కూడా వస్తోంది.సుజనా చౌదరి ఎంతసేపూ జగన్ ని విమర్శించడానికే పరిమితం అవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. జగన్ కి జనం ఓటేశారు, పాలన చేతకాకపోతే రానున్న స్థానిక ఎన్నికల్లో జనం ఓటు అనే ఆయుధంతో తిప్పికొడతారు, ఒకవేళ అప్పటికీ తీరు మార్చుకోకపోతే 2024 నాటికైనా తగిన జవాబు ఇచ్చే శక్తి జనానికి ఉంది. ఇపుడు ఎన్నికలు అయిపోయాయి. కావాల్సింది అభివృధ్ధి, ఏపీకి లోటు బడ్జెట్ ఉంది. రాజధాని సంగతి తేలడంలేదు. పోలవరానికి నిధులు కావాలి. ఇక ఏపీకి ఇచ్చిన విభజన హామీలు మెజారిటీ అలాగే పడి ఉన్నాయి. వీటి సంగతి చూడాల్సిన బాధ్యత సుజనా చౌదరి లాంటి వారు తీసుకుంటే ఆయనకూ, ఆ పార్టీకి పేరు వస్తుంది. దాన్ని వదిలేసి కోరి గిల్లి కజ్జాలు పెట్టుకుంటే రాజకీయ రొచ్చు తప్ప జనాలకు మిగిలేది ఏముంది. కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి లాంటి మేధావులు ఈ సంగతి గురించి ఆలోచన చేస్తే మిగిలిన పార్టీలైన స్పూర్తి పొందుతాయి.

No comments:

Post a Comment