బెంగళూర్, నవంబర్ 12 (way2newstv.in)
యడ్యూరప్పతో మాట్లాడేందుకు కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇష్టపడటం లేదంటున్నారు. యడ్యూరప్ప చేస్తున్న వ్యవహారంలో తనను ఇరికించడానికి చేసిన ప్రయత్నాలపై అమిత్ షా మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల యడ్యూరప్ప ఆడియో టేపు కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఆడియో టేపును సాక్ష్యంగా స్వీకరించవచ్చని న్యాయస్థానం కూడా అభిప్రాయపడటంతో యడ్యూరప్పపై అధిష్టానం సీరియస్ గా ఉంది.అందుకే యడ్యూరప్ప జేడీఎస్ నేతలతో అంటకాగుతున్నారని తెలుస్తోంది. అధిష్టానానికి సంకేతాలు పంపేందుకే యడ్యూరప్ప జనతాదళ్ ఎస్ తో సఖ్యతగా మెలుగుతున్నారని పార్టీ వర్గాలు సయితం అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే యడ్యూరప్పకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సహకరించడం లేదు.
యడ్డీతో భేటీకి దూరంగా అమిత్ షా
ఆయనపై వ్యతిరేకంగా అధిష్టానానికి పలుమార్లు నివేదికలను అందించింది. యడ్యూరప్పకు వ్యతిరేకంగా అసంతృప్తులను సయితం బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేరదీస్తుంది.త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా ఎనిమిది స్థానాలను యడ్యూరప్ప గెలుచుకోవాల్సి ఉంది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి 104 మంది సభ్యులున్నారు. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే మరో ఎనిమిది మంది సభ్యులు ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఉప ఎన్నికల్లో గెలిచినా యడ్యూరప్పను మార్చాలన్నది కేంద్ర నాయకత్వం ఆలోచనగా ఉంది. ఈ విషయాన్ని పసిగట్టిన యడ్యూరప్ప ముందుగానే జేడీఎస్ సత్సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.జనతాదళ్ సాయాన్ని యడ్యూరప్ప తీసుకోవడంపై ఇప్పటికే పార్టీలో సీనియర్లు మండిపడుతున్నారు. గతంలో జనతాదళ్ తమపట్ల వ్యవహరించిన తీరును వారు గుర్తు చేస్తున్నారు. దళ్ అంటేనే బ్లాక్ మెయిలింగ్ అని తెలిసి కూడా యడ్యూరప్ప వారితో పొత్తుకు తహతహలాడటాన్ని సీనియర్ నేతలు తప్పుపడుతున్నారు. యడ్యూరప్ప మాత్రం బీజేపీలో తనకు వ్యతిరేకత వ్యక్తమయినా దళ్ సాయం తీసుకోవచ్చని వ్యూహాన్ని రచిస్తున్నారు. మొత్తం మీద బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి ఎప్పుడైనా ఎలాంటి నిర్ణయమైనా వెలువడ వచ్చన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతోంది.
No comments:
Post a Comment