Breaking News

04/11/2019

ఐదేళ్లలో 12 వేలు తగ్గిన సింగరేణి ఉద్యోగులు

అదిలాబాద్, నవంబర్ 4, (way2newstv.in)
రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణిలో కార్మికుల సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది. తెలంగాణ వస్తే సింగరేణి కార్మికుల సంఖ్యను లక్షకు పెంచుతామని, కొత్తగా పెద్ద సంఖ్యలో బొగ్గు గనుల తవ్వకాలు చేపడతామని పాలకులు గొప్పలు చెప్పారు. ఆచరణలో మాత్రం అది ఎక్కడా కన్పించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కాలంలో సింగరేణిలో 60 వేల మంది కార్మికులుండగా ప్రస్తుతం వీరి సంఖ్య 48 వేలకు తగ్గింది. సుమారు 12 వేలకు పైగా రిటైర్అయ్యారు.  2014 సంవత్సరం నుంచి సంస్థలో నేరుగా 3,025 మందికి మాత్రమే  ఉద్యోగాలు వచ్చాయి. కారుణ్య నియామకాల కింద 7,500 మంది వారసులు కొలువుల్లో చేరారు.90వ దశకంలో సుమారు లక్షా 16 వేల మందితో కళకళలాడిన సింగరేణిలో ప్రస్తుతం 48 వేల లోపే కార్మికులు ఉన్నారు. 
 ఐదేళ్లలో 12 వేలు తగ్గిన సింగరేణి ఉద్యోగులు

1886లో మొదటిసారిగా ఇల్లెందులో నాటి బ్రిటిష్ పాలకులు బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించారు. ఆ సమయంలో భూగర్భంలో పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు బలవంతంగా బొగ్గు ఉత్పత్తి పనుల్లో ప్రజలను బ్రిటీష్ పాలకులు చేర్పించారు. క్రమంగా బొగ్గు ఉత్పత్తిలో కీలకపాత్ర కార్మికులదే అయింది. ఈ ప్రాంతం నుంచి కార్మికులు రాకపోతే రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల నుంచి తీసుకువచ్చారు. బొగ్గు గనులకు నాడు కార్మికులు ప్రాణాలు పోశారు. ప్రస్తుతం సింగరేణి యాజమాన్యం, పాలకులు అధికోత్పత్తే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇందులో భాగంగా యాంత్రీకరణ, ప్రైవేటీకరణకు యాజమాన్యం శ్రీకారం చుట్టింది. కార్మికుల సంక్షేమం కన్నా అధికోత్పత్తికి ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో భూగర్భగనుల్లో యంత్రాల ప్రవేశం, ఓపెన్కాస్ట్ గనుల జోరు కార్మికుల పాలిట శాపంగా మారాయి. తెలంగాణలో సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాలు మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాది కొత్తగూడెంలో సుమారు 24 అండర్గ్రౌండ్ మైన్స్, 18 ఓపెన్కాస్ట్ గనులలో మొత్తంగా ఆగస్టు నాటికి 47,916 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. 1991లో 11 ఏరియాల్లో కార్మికులు, ఉద్యోగులు, అధికారులతో కలిపి మొత్తం 1,16,918 మంది ఉండగా ప్రస్తుతం వీరి సంఖ్య 48 వేలకు పడిపోయింది. ఈ 28 ఏళ్ల కాలంలో సుమారు 69 వేలకు పైగా కార్మికులు రిటైర్అవడం, వీఆర్ఎస్ తదితర కారణాలతో బయటకు వెళ్లిపోయారు.నియామకాలపై యాజమాన్యం, ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో సింగరేణిలో ఉద్యోగావకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం సింగరేణిలో 24 భూగర్భగనులు, 18 ఓపెన్కాస్ట్ గనులు ద్వారా బొగ్గు ఉత్పతి జరుగుతోంది. గతంలో భూగర్భ బొగ్గు గనులు ఎక్కువగా ఉండటంతో మానవశక్తి అవసరం ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం గనుల సంఖ్య తగ్గడంతోపాటు యాంత్రీకరణ పెరగడంతో మానవశక్తి అవసరాలు తగ్గాయి. మరోవైపు సింగరేణిలో కొత్త గనులు ప్రారంభించేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదు. ఉన్నవాటిని విస్తరించడం తప్పితే కొత్తగా వేటిని అందుబాటులోకి తీసుకురాలేకపోతోంది. సింగరేణి విస్తరించిన  జిల్లాల పరిధిలో కొత్తగా అండర్గ్రౌండ్ మైన్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం 2014లో తన మేనిఫెస్టోలో పేర్కొంది. కొత్త గనుల ద్వారా భారీగా ఉద్యోగాలు వస్తాయని, లక్ష ఉద్యోగులు సంస్థలో పనిచేసేలా అవకాశాలు కల్పిస్తామని చెప్పినా ఆచరణలో మాత్రం చూపలేకపోయింది. గత ఆరేళ్లలో ఆరు భూగర్భ గనులు, మరో ఆరు ఓపెన్కాస్ట్ గనులను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఉన్నవాటిని విస్తరించడం వరకే పూర్తయ్యింది. విస్తరణ వల్ల కొత్తగా ఎలాంటి ఉపాధి లభించలేదు. 18 సంవత్సరాల తర్వాత సింగరేణిలో మందమర్రి ఏరియాలో కొత్తగా కేకే 6 పేరుతో అండర్గ్రౌండ్ బొగ్గు గనికి సీఎం శంకుస్థాపన చేయగా ప్రస్తుతం ఆ గని ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి.  ఉత్పత్తి పెంపుతోపాటు కొత్తగా మరింత మంది కార్మికులకు ఉద్యోగ అవకాశాలు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

No comments:

Post a Comment